TTD Deputation Extension : టీటీడీ ఈవో ధర్మారెడ్డి పదవీ కాలం పొడిగింపు
తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ధర్మారెడ్డికి ఎట్టకేలకు డిప్యూటేషన్ పొడిగింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో మరో రెండేళ్ల పాటు ధర్మారెడ్డి అదే పదవిలో కొనసాగనున్నారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగించేందుకు కేంద్రం అనుమతించింది. గత కొద్ది రోజులుగా అటు అధికారులు, ఇటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారిన ఈవో వ్యవహారంలో ఎట్టకేలకు సానుకూల ఫలితం లభించింది. రాష్ట్రంలో ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ధర్మారెడ్డి పదవీ కాలం ముగియడంతో మాతృసంస్థల్లో విధుల్లో చేరాల్సి ఉంది. రిటైర్మెంట్‌కు మరో రెండేళ్ల గడువు మాత్రమే ఉండటంతో డిప్యూటేషన్ పొడిగింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ ఉద్యోగి అయిన ధర్మారెడ్డి రెండు విడతల్లో రాష్ట్రంలో ఏడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇటీవల ఆయన పదవీ కాలం ముగియడంతో మరోసారి పొడిగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాని కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా కావడంతో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ధర్మారెడ్డి డిప్యూటేషన్‌పై కేంద్రం స్పందించకపోవడంతో ఆయన్ను రాష్ట్ర సర్వీసుల్లోకి విలీనం చేసుకోవాలని భావించారు. దేవాదాయ శాఖ కార్యదర్శి హోదాలో నియమించాలని భావించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల కోసం ఢిల్లీ వెళ్లిన సమయంలో ధర్మారెడ్డి వ్యవహారంపై సానుకూలత లభించింది.
గత వారం ధర్మారెడ్డి ఢిల్లీకి 300 శ్రీవారి కళ్యాణం లడ్డూలతో ఢిల్లీ పర్యటనకు వెళ్లారనే వార్తలకు కూడా వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా, ప్రత్యేక అనుమతులతో విమానంలో లడ్డూలను తరలించారని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం అనూహ్యంగా ధర్మారెడ్డి పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. టీటీడీలోనే ఆయన పదవీ విరమణ చేస్తారని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది.
మరోవైపు టీటీడీ ఈవోగా ఐఏఎస్ స్థాయి అధికారుల్ని నియమించాలంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ కాని వారిని ఈవోలుగా నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టాపిక్