TTD Caution Deposits : కాషన్ డిపాజిట్‌పై దుష్ప్రచారం నమ్మొద్దంటున్న టీటీడీ…
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు చెల్లించే కాషన్ డిపాజిట్‌లను మళ్ళిస్తున్నారనే విమర్శల్ని తోసిపుచ్చింది. నిరాధార ఆరోపణలు చేస్తూ టీటీడీ గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరిస్తోన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వసతి సౌకర్యం కోసం ముందస్తుగా చెల్లించే కాషన్ డిపాజిట్‌ను తిరిగి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లిస్తుందనే ఆరోపణల్ని టీటీడీ తోసిపుచ్చింది. టీటీడీపిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తిరుమలకు వచ్చే భక్తులు చెల్లించే డిపాజిట్ సొమ్మును తిరిగి వారి ఖాతాలకు పంపుతామని టీటీడీ స్పష్టం చేసింది. కాషన్ డిపాజిట్ విషయంలో భక్తులు అవాస్తవాలను నమ్మొద్దని టిటిడి విజ్ఞప్తి చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే భక్తుల ఖాతాల్లోకి ఆలశ్యంగా సొమ్ము చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి చేసింది.
కాషన్ డిపాజిట్ సొమ్మును నిర్ణీత వ్యవధిలోపు భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని టీటీడీ తెలిపింది. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై టిటిడి అధికారులు సోమవారం తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కరంట్ బుకింగ్, ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో గదులు బుక్ చేసుకుంటున్నారు. భక్తులు గదులు ఖాళీ చేసిన తరువాతి రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు కాషన్ డిపాజిట్ రిఫండ్ ఎలిజిబిలిటి స్టేట్‌మెంట్‌ను అధీకృత బ్యాంకులైన ఫెడరల్ బ్యాంకు లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులకు పంపుతున్నారు.
సంబంధిత బ్యాంకు అధికారులు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు సంబంధిత మర్చంట్ సర్వీసెస్‌కు పంపుతారు. సెలవు రోజుల్లో ఇలా చేయలేరు. మర్చంట్ సర్వీసెస్ వారు మరుసటి రోజు కస్టమర్ బ్యాంకు అకౌంట్‌కు వారి సొమ్మును తిరిగి చెల్లిస్తారు. భక్తులకు సంబంధించిన బ్యాంకులు సంబంధిత కస్టమర్‌కు లావాదేవీకి సంబంధించి కన్ఫర్మేషన్ మెసేజ్(ఏఆర్ నంబరు)ను, సొమ్మును సంబంధిత భక్తుల అకౌంట్‌కు పంపుతారు.
కాషన్ డిపాజిట్ చెల్లించిన బ్యాంకులు, తిరిగి భక్తుల అకౌంట్‌కు సొమ్ము చెల్లించడంలో జాప్యం జరుగుతున్నట్లు టిటిడి గుర్తించింది. భక్తులు యాత్రికుల సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్, ఈ-మెయిల్ ద్వారా సమస్యను టిటిడి దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో పైవివరాలతో సంబంధిత బ్యాంకుల్లో విచారణ చేయాలని భక్తులకు సూచిస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 7 బ్యాంకు పనిదినాల్లో కాషన్ డిపాజిట్ రీఫండ్ చేయాల్సి ఉంటుందని, ఈ ఏడాది జులై 11 నుండి 4, 5 రోజుల్లో రీఫండ్ చేరే విధంగా టిటిడి యుపిఐ విధానంలో రీఫండ్ చేస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల నేరుగా భక్తుల అకౌంట్‌కే రీఫండ్ సొమ్ము చెల్లించడానికి వీలవుతోంది.
ఇటీవల కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని కాషన్ డిపాజిట్‌కు సంబంధించి టిటిడిపై దుష్ప్రచారం చేస్తున్నారని, కాషన్ డిపాజిట్ సొమ్ము నేరుగా భక్తుల ఖాతాలకే చేరుతుందని, రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి వినియోగించు కుంటున్నాయనేది అవాస్తవమని చెబుతున్నారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి అధికారులు హెచ్చరిస్తున్నారు.