Opinion: మార్పు బాటలో జనసేనాని-opinion column jana sena leader pawan kalyan in a new political style ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Opinion Column Jana Sena Leader Pawan Kalyan In A New Political Style

Opinion: మార్పు బాటలో జనసేనాని

HT Telugu Desk HT Telugu
Apr 25, 2023 04:22 PM IST

‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇటీవల వేస్తున్న అడుగులు కొత్త రాజకీయ పంథాన్ని చూపిస్తున్నాయి. రాజకీయాల్లో విలువలు అడుగంటుతున్న ఈ సమయంలో ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజకీయ పరిపక్వతను చాటుతున్నాయి.’ - పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ రీసెర్చర్‌ ఐవీ మురళీ కృష్ణ విశ్లేషణ.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో విలువలు అడుగంటుతున్న సమయంలో పవన్ కల్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజకీయ పరిపక్వతను చాటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయమున్న తరుణంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ తాజాగా రాసిన బహిరంగ లేఖ ద్వారా అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం శ్రమిస్తున్న జనసైనికుల దృష్టి మరల్చడానికి, జనసేన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని, వాటిని సరిగా అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాల్సి ఉందని జనసేనాని దిశానిర్దేశం చేశారు.

‘‘సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా పొత్తుల గురించి ఎవరికి వారు ఏదేదో మాట్లాడొద్దు, పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా’’ అని పవన్‌ కల్యాణ్‌ ఈ లేఖలో స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో పవన్‌ కల్యాణ్‌ ముందు నుంచీ ఒక ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను కూడా మానసికంగా పొత్తుల కోసం సిద్ధం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి తొలిసారి ఆయన ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించారు. పొత్తుల్లో తప్పులేదని, నియంతను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మచిలీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వననే లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించారు.

ఆ తర్వాత ఢిల్లీ పర్యటనలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌కి విముక్తి కలిగిస్తామని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే తన అభివాదమని, అజెండా అని ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామాలు గమనిస్తే పొత్తుల గురించి జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఉన్న అవగాహన, వైఎస్సార్సీపీ నాయకులకు, రాజకీయ విశ్లేషకులకు లేదేమో అనిపిస్తోంది. దానివల్లే టీడీపీ-జనసేన పొత్తు ఎప్పుడు చితికిపోతుందా అని వైఎస్సార్సీపీ శ్రేణులు దింపుడు కళ్లెం ఆశలతో ఎదురు చూస్తున్నాయి.

పొత్తుల గురించి పవన్‌ మాట్లాడినప్పుడల్లా అధికార వైఎస్సార్సీపీ ఉలిక్కిపడుతోంది. పవన్‌ కల్యాణ్‌ టీడీపీకి అమ్ముడుపోయారని పదునైన మాటలతో ఆరోపణలు చేస్తోంది. మరో అడుగు ముందుకేసి దమ్ముంటే అన్ని సీట్లలో పోటీ చేయాలని జనసేనను రెచ్చగొడుతోంది. మాజీ మంత్రి కొడాలి నానీ, మంత్రి అంబటి రాంబాబు లాంటి వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి పవన్‌ కళ్యాన్‌ని, ప్రతిపక్షాలను దూషిస్తూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మంత్రి స్థానంలో ఉన్న ఆదిమూలపు సురేశ్‌ తన హోదాను మరిచి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చొక్కా విప్పి వీరంగం సృష్టించారు. ఇక, అధికార పక్షానికన్నా తామేం తక్కువ తిన్నామా అన్నట్టు టీడీపీ నాయకులు కూడా రెచ్చిపోతున్నారు. టీడీపీ నాయకులు పట్టాభి, వంగలపూడి అనిత, చింతమనేని ప్రభాకర్‌ లాంటి వాళ్లు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారు.

ఇలాంటి నాయకుల వల్ల ఇంట్లో పిల్లలు టీవీ చూస్తే చెడిపోతారని తల్లిదండ్రులు భయపడే విధంగా సమకాలీన రాజకీయాలు ఉన్నాయి. విచ్చిలవిడిగా ప్రవర్తిస్తూ, విలువలను దిగజార్చిన ఇలాంటి నాయకులను ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియంత్రించే ప్రయత్నం కూడా చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్న తీరు ఎంతో మేలు.

సరైన ఆధారాలు, తగిన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయొద్దనీ, మీడియాలో వచ్చిందనో లేదా మరెవరో మాట్లాడారనో నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడొద్దనీ, మనం అసభ్యంగా దూషించొద్దని పార్టీ నాయకులకు ఈ బహిరంగ లేఖలో జనసేనాని సూచించారు. 2009 ఎన్నికల ముందు పంచెలూడదీసి కొడుతానని, ఇటీవల ఒక కార్యకర్తల సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతూ ‘మరొక్కమారు ప్యాకేజీ అన్నారంటే కొడతాను వైపీసీ కొడుకులారా..’ అంటూ చెప్పు చూపించిన జనసేనాని పవన్‌లో మార్పు రావడం స్వాగతించాల్సిన అంశం.

కేవలం సూచనలు చేయడం కాకుండా ఈ మార్పును పవన్‌ తన నుంచే మొదలుపెట్టారు. గతానికి భిన్నంగా పవన్‌ కల్యాణ్‌ మచిలీపట్నం సభలో మాట్లాడారు. పరివర్తన కోసమే తాను ఆ సభ పెట్టినట్టు ఆయనే చెప్పుకున్నారు.

‘‘వైసీపీని, వ్యక్తులను విమర్శించి ప్రయోజనం లేదు. ఈ సభ పరివర్తన కోసమే. మీరు ఓట్లు అమ్ముకోవడం మానుకోకపోతే విలువలు మాట్లాడే నాలాంటి నాయకులు ఓడిపోతూనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్‌ కోసం మాకు అండగా నిలవండి. ఒక్కసారి జనసేనను చూడండి. కులాన్ని దాటి ఆలోచించండి..’’ అంటూ పవన్‌ కల్యాణ్‌ ఆ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటిస్తున్న చంద్రబాబుపై ఇటీవల జరిగిన రాళ్లదాడిని ఖండిస్తూ ప్రతిపక్షాలను చూస్తే జగన్‌ ప్రభుత్వానికి ఎందుకు అంత అభద్రతా భావం..? అంటూ చంద్రబాబుకు అండగా నిలబడ్డారు.

అధికారపక్షం బాధ్యత విస్మరించిన చోట కచ్చితంగా ప్రతిపక్షం ప్రజల కోసం నిలబడుతుందని పవన్‌ పరిపక్వతతో వ్యవహరించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో వచ్చిన మార్పు స్పష్టంగా కనపడుతోంది. అయినప్పటికీ ఎన్నికల వేళ తొందరపడి అధికారపార్టీ చేసే కుట్రల తాలూకు పద్మవ్యూహాల్లో చిక్కుకోవద్దనే జనసేనాని మరోసారి బహిరంగ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

ఈ లేఖను పరిశీలిస్తే పవన్‌ చేసిన మరో కీలక సూచనను కూడా ఇందులో గమనించవచ్చు. ‘‘మనతో మంచిగా ఉండే పార్టీలలోని చిన్న చితకా నేతలు మనపై ఏవైనా విమర్శలు చేస్తే, అవి నాయకుని వ్యక్తిగత విమర్శలుగానే భావించండి. అంతేతప్ప, ఆ వ్యాఖ్యలను ఆయా పార్టీలకు ఆపాదించవద్దు’’ అన్నారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసిన తర్వాత కొంతమంది టీడీపీ నాయకులు ‘‘మనకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదు, ఒంటరిగానే అధికారంలోకి వచ్చేస్తాం’’ అని ఒంటరిగానే పోటీ అంటూ ప్రచారం మొదలుపెట్టారు.

క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడే ఇలాంటి నాయకుల వల్ల టీడీపీకే నష్టం జరుగుతుంది. ఇలాంటి నాయకుల మాటలకు ప్రతి విమర్శ చేస్తే జనసేన కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫలితంగా టీడీపీ, జనసేన నాయకులు కొట్టుకుంటే, మధ్యలో వైస్సార్సీపీ లాభపడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జనసేనాని ఈ సూచన చేశారని స్పష్టమవుతోంది. అధికార పక్షం మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోవాలి. ఓట్లు చీలనివ్వనని టీడీపీ చెప్పాలి. కానీ, ఆ పని టీడీపీ చేయలేకపోతోంది. టీడీపీ బదులు జనసేన పార్టీయే చొరవ తీసుకొని మరీ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఇది పరిపక్వతకు నిదర్శనం.

నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. ఉద్యమాలు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా అధికార పక్షం ఇబ్బందులు పెడుతున్న సమయంలో విపక్షం సంయమనం పాటించాలి. ఇలాంటి సమయాల్లో చర్యకు ప్రతి చర్య పనికిరాదు. ప్రస్తుత ఘర్షణ రాజకీయ వాతావరణంలో గత నేతలను ఆదర్శంగా తీసుకుంటే వీరికి కనువిప్పు కలగవచ్చు.

దేశ ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆ తర్వాత ప్రధానమంత్రులైన పి.వి.నరసింహారావు, చంద్రశేఖర్‌, వాజ్‌పేయ్‌, మన్మోహన్‌ సింగ్‌తో సహా ఎల్‌.కే.అద్వానీ, సుష్మాస్వరాజ్‌, జార్జిఫెర్నాండెజ్‌, సోమనాథ్‌ చటర్జీ వంటి నేతలు మార్గదర్శకులుగా నిలుస్తారు.

ప్రజా ఉద్యమాలే జీవితంగా బతికిన ప్రజల మనిషి, కమ్యూనిస్టు పార్టీ ప్రమాణాలను ఊపిరిగా భావించిన ఆదర్శమూర్తులు నర్రా రాఘవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, గౌతులచ్చనలతో పాటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన నందమూరి తారక రామారావు, జలగం వెంగళరావు, 1999 నుండి 2004 వరకు రాష్ట్ర ప్రతిపక్ష నేతగా, తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి, సుదీర్ఘకాలం విపక్షంలో ఉన్న జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి నాయకుల స్ఫూర్తిని కొనసాగించడంలో ప్రస్తుత తరం నాయకులు విఫలమవుతున్నారు.

దాడికి ప్రతిదాడి చేస్తూ, విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ రాజకీయాలను దిగజారుస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ పరిపక్వత చూపుతూ ఒక టార్చ్‌ బేరర్‌లా వ్యవహరిస్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు!

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

ఐవీ మురళీ కృష్ణ
ఐవీ మురళీ కృష్ణ

(డిస్‌క్లెయిమర్: ఈ ఒపీనియన్ కాలమ్‌లో తెలియపరిచిన అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థకు చెందినవి మాత్రమే. హెచ్‌టీ తెలుగువి కావు.)

IPL_Entry_Point

సంబంధిత కథనం