Heavy Rains In AP బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం… ఏపీలో భారీ వర్షాలు-imd issued three days heavy rain alert to andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Imd Issued Three Days Heavy Rain Alert To Andhra Pradesh

Heavy Rains In AP బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం… ఏపీలో భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu
Oct 16, 2022 09:08 AM IST

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు
ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురువనున్నట్లు వాతవరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..ఏపీ, తమిళనాడు తీరాల వెంబడి విస్తరించి ఉందని పేర్కొంది. ఈనెల 18న అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈనెల 20న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్‌ తీరం దిశగా పయనమవుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాయలసీమతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వరదలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్‌ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

ఆదివారం(16-10-22):

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

సోమవారం(17-10-22):

అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, పల్నాడు,శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

మంగళవారం(18-10-22):

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

వర్షాలు నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ప్రవహించే అవకాశం ఉన్నందున నదీపరీవాహక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేడ్కర్ సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. కుంభవృష్టితో కోనసీమ తడిసి ముద్దైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చంపావతి, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది.

IPL_Entry_Point