AP Politics: ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తారా..? లేక ఆగుతారా..?-cm jagan may move to early elections or scheduled time of elections 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /   Cm Jagan May Move To Early Elections Or Scheduled Time Of Elections 2024

AP Politics: ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తారా..? లేక ఆగుతారా..?

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 05:00 AM IST

YSRCP Latest News: ఏపీ రాజకీయం మారుతోంది. ఎమ్మెల్సీ ఫలితాల ఎఫెక్ట్ గట్టిగానే నడుస్తోంది. అధికార వైసీపీ దిద్దుబాటు చర్యలు చేపడుతుంటే... ప్రతిపక్ష టీడీపీ ఫామ్ లోకి వచ్చేసింది. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట తెరపైకి వస్తోంది. అయితే ప్రస్తుతం వీస్తున్న ఎదురుగాలిని జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

సీఎం జగన్
సీఎం జగన్

AP Elections 2024: ఏపీ రాజకీయం మారుతోంది..! ఎన్నికలకు టైం ఉండగానే ప్రధాన పార్టీలు ఆ మూడ్ లోకి వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. ఓ వైపు అధికారపక్షానికి గట్టి సందేశం అందితే... మరోవైపు ప్రతిపక్ష పార్టీకి గట్టి బలమే దొరికింది. అదే ఊపుతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని చెబుతోంది. మొన్నటి వరకు వై నాట్ 175 అంటూ వచ్చిన జగన్ కు ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత మొదలైందా అన్న చర్చ జోరుగా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు జగన్ కు అతిపెద్ద సవాల్ గా మారుతాయా..? ఐదేళ్ల అధికారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికలకు వెళ్తారా..? లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లి తేల్చుకుంటారా..? అసలు జగన్ ఏం చేయబోతున్నారనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారిపోయింది.

"ఇది మల్లెల వేళయనీ

ఇది వెన్నెల మాసమనీ

తొందరపడి ఒక కోయిల

ముందే కూసిందీ... ఇది పాత సినిమాలోని ఓ పాట. సరిగ్గా ఇదే విషయాన్ని ఏపీ రాజకీయాలకు వర్తింపజేస్తే... జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చేయబోతున్నాడా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. అసలు విషయానికొస్తే.... ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కంటే ముందే(10 నెలల) అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న చర్చ అధికార వైసీపీ కారిడార్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. కానీ కోయిల మాదిరిగా ముందే కూసినట్లు.... జగన్ కూడా అంత ఈజీగా ముందస్తు వైపు మొగ్గు చూపించకపోవచ్చనే సన్నిహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో.... షెడ్యూల్ వరకు వేచి చూస్తే పరిస్థితి అనుకూలంగా ఉంటుందా..? లేక తేడా కొడుతుందా..? అనే విషయంపై కూడా మేథోమథనం నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజా పరిస్థితుల విషయంలో జగన్ కంటూ ఓ అంచనా ఉండే ఉండొచ్చన్న వాదన కూడా ఉంది.

ఇక రాష్ట్రంలో ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ కు గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పొచ్చు. కొంత వరకు ఇది పట్టభద్రుల ఆలోచన స్థితిని ప్రతిబింబించింది. మరోవైపు సొంత పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు... క్రాస్ ఓటింగ్ వేసే పరిస్థితి వచ్చింది. ఫలితంగా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే సీన్ కూడా కనిపించింది. తద్వారా జగన్ పై ఉన్న విశ్వసనీయత, అంచనాలు, ఓటర్ల ఆమోదం, పార్టీపై పట్టు కూడా సడలించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాల్లో.... అధికార పార్టీ నిరాశకు గురైనట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో మొన్నటి వరకు వార్ వన్ సైడ్, వై నాట్ 175 అంటూ తెగ కాన్ఫిడెన్స్ తో ఉన్న వైసీపీకి.... తాజా పరిణామాలు భిన్నంగా మారినట్లు అయిపోయింది.

ఏపీ ఎన్నికల ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.... అనుకూల విషయాల కంటే, ప్రతికూల విషయాలే ఎక్కువ ప్రభావితం చూపిస్తాయన్నట్లు ఉంటుంది. దీనికి బోలేడు ఉదాహరణలు కూడా ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. టీడీపీ వైఫల్యాలనే ఆధారంగా చూసుకుంటూ ఫలితంగా జనాలకు చేరువయ్యారు. తద్వారా ప్రజల్లో ఎన్నో ఆశలు కూడా చిగురించాయి. అనుకున్నట్లే జగన్... భారీ విక్టరీని కూడా కొట్టారు. అది ఏ రేంజ్ లో అంటే 1983లో ఎన్టీఆర్, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సాధించలేని మెజార్టీని సొంతం చేసుకున్నాడు. జగన్ సాధించిన ఈ విక్టరీ... 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఏ దశలో కూడా మింగుడుపడలేదనే ఒక్క మాటలో చెప్పొచ్చు.

ఎమ్మెల్సీ ఫలితాల్లో ఎదురుగాలి...

పటిష్టమైన స్థితిలో ఉన్నామనకున్న వైసీపీని... తాజా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఫలితంగా టీడీపీ విజయం సాధించింది. తాజా ఫలితాలను కొలమానంగా తీసుకుంటే మాత్రం.... అధికార పార్టీ సభ్యుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లే అని చెప్పొచ్చు. పార్టీ అధినేత తీరుపై కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఫలితంగా ముందస్తుకు వెళ్లాలని అనుకునే జగన్ మద్దతుదారులు కూడా ఆలోచనలో పడినట్లు అయిపోయింది. మరోవైపు ఈ ఫలితాల ద్వారా.... టీడీపీ పనైపోలేదని... ఎన్నికల సీన్ లోనే ఉన్నామన్న గట్టి సందేశాన్ని ఇచ్చినట్లు కూడా రుజువు అయింది.

గత కొంతకాలంగా టీడీపీ - జనసేన కలుస్తాయన్న వాదన తెరపైకి వస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ పరిణామం కూడా జగన్ కు నిద్రపట్టకుండా చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబుపై ఉన్న రాజకీయ కక్ష కారణంతోనే అమరావతిని పక్కనపెట్టారన్న విషయం కూడా ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లింది. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... కేవలం నవరత్నాల అమలు కోసం లక్ష కోట్లను ఖర్చు పెట్టడం కూడా అర్థరహితమన్న వాదన కూడా బలపడినట్లు కనిపిస్తోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో అమరావతి అత్యంత ప్రధానమైన అంశంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లు మూడు రాజధానులకు మద్దతు ఇస్తారా..? అమరావతికే జై కొడుతారా అనేది తెలిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. జగన్ మాత్రం కేవలం సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ చేస్తున్నారు. ఓటర్లను ఆక్షరించేందుకు ఆయా పథకాలను తీసుకువచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... అమలు చేసేలా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు మరింత ముదరటం, ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వంటి సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది. కానీ సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనకడగు వేయలేదు జగన్. దీంతో పేదల సంక్షేమ అజెండానే తమదన్న విషయాన్ని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లగలిగే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఫలితంగా 175 స్థానాలను టార్గెట్ పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. కానీ ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు... వారి అంచనాలకు బ్రేక్ లు వేసినట్లు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిసారించలేకపోవటంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా కీలకమైన అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ వంటి పనులు కూడా వెనకబడిపోయాయనే వాదన వినిపిస్తోంది.

ఇక తాజా ఎమ్మెల్సీ ఫలితాలలో టీడీపీ గెలిచినప్పటికీ... పవన్ తో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజల్లో చంద్రబాబు పట్ల నమ్మకం కలిగే విషయంలో ఇక సమయం పట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఓ వైపు నుంచి వినిపిస్తున్నాయి. జగన్ పాలన ఇదే మాదిరిగా కొనసాగితే... ఎన్నికల షెడ్యూల్ వరకు పరిస్థితులు పూర్తిగా మారిపోవచ్చు. పవన్ - చంద్రబాబు కలిస్తే జగన్ కు మరింత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పటంలో సందేహం ఉండదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు... చంద్రబాబుకు కాస్త అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తోంది. గతంలో ఇచ్చిన హామీల విషయంలో విఫలమైనప్పటికీ... మరోసారి ఛాన్స్ ఇచ్చేందుకు కూడా ఏపీ ఓటర్లు ఆలోచిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. జగన్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొవటం, ప్రశ్నించే విషయంలో కూడా చంద్రబాబుకు అనేక అస్త్రాలు సిద్ధంగానే ఉన్నాయి. రాజధాని నిర్మాణం పూర్తి చేయకపోవటం, తీవ్రమైన అప్పులు వంటి విషయాల్లో గట్టిగా నిలదీసే అవకాశం ఉంది. ఇప్పటికే సైకో జగన్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ చంద్రబాబు, పవన్ పదే పదే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. నిజానికి ఒక్కసారి పరిస్థితులు తలకిందులైతే... సీన్ మొత్తం మారిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రా ఓటర్లు ఎన్నికల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో వీస్తున్న ఎదురుగాలిని జగన్ ఎలా ఎదుర్కుంటారనేది అతిపెద్ద ప్రశ్నే అనే చెప్పొచ్చు....!

IPL_Entry_Point

సంబంధిత కథనం