Chandrababu: రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే ఎక్కువ నష్టం జరిగింది-chandrababu comments on cm jagan over tdp formation day celebrations at hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Chandrababu Comments On Cm Jagan Over Tdp Formation Day Celebrations At Hyderabad

Chandrababu: రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే ఎక్కువ నష్టం జరిగింది

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 08:19 PM IST

TDP Formation Day Updates:తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఊపిరిపోసుకున్న పార్టీ తెలుగుదేశం అని అన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ సభను తలపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.... టీడీపీ ఆవిర్భావం ఆత్మగౌరవానికి ప్రతీకా అని చెప్పారు.

సభలో చంద్రబాబు
సభలో చంద్రబాబు

TDP Formation Day at Hyderabad: తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుండిపోయే వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని అన్నారు చంద్రబాబు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం జాతి ఉద్ధరణ కోసమే అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లిలో తలపెట్టిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.... ప్రజలే తమ సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. శుభానికి సూచిక అయిన పసుపు రంగును ఎంచుకున్నారని, పసుపు ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుందన్నారు. అందరి దృష్టితోనే ఎన్టీఆర్... తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు.

తెలుగుదేశం జెండా కూడా రైతులు, కార్మికులు, పేదవాళ్ల చిహ్నంగా ఉంటుందన్నారు చంద్రబాబు. చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందన్నారు. తెలుగువారి కోసం పని చేసే పార్టీ కూడా తెలుగుదేశమే అని స్పష్టం చేశారు. తెలుగు జాతి అంటే తెలుగుదేశమన్నారు. పెత్తందారి, దళారి వ్యవస్థను రూపుమాపిన చరిత్ర తెలుగుదేశానిదే అన్నారు. మొట్టమొదటిసారిగా దేశంలో సంక్షేమ పథకాలకు నాంది పలికిన పార్టీ కూడా టీడీపీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

"2 రూపాయలకు కిలో బియ్యం పెట్టిన నేత ఎన్టీఆర్. సమస్యలకు పరిష్కారం ఎన్టీఆర్. అధికార వికేంద్రీకరణ చేసిన వ్యక్తి కూడా ఎన్టీఆరే. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అన్నివర్గాలకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశమే. ఉన్నత విద్యావంతులను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్. రెసిడెన్షియల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆడపిల్లలకు విద్యను దగ్గర చేశారు. ప్రజల గురించి ఆలోచించే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే" అని చంద్రబాబు అన్నారు.

"ఐటీ వ్యవస్థను అభివృద్ధి చేశాం. హైదరాబాద్ ఇవాళ ఎలా ఉందో చూస్తున్నాం. డ్వాక్రా ఉద్యమాన్ని నడిపాం. ఆడబిడ్డలకు అండగా ఉన్నాం. ఆర్టీసీలో మహిళలకు అవకాశం కల్పించిన చరిత్ర కూడా టీడీపీదే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పని చేసే పార్టీ తెలుగుదేశం. ఐటెక్స్ సిటీ, నాలెడ్జ్ ఎకానమీకి అడుగు వేశాం, మానవ వనరులను అభివృద్ధి చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మానవ వనరుల అభివృద్ధికి కేంద్రం చేశాం. ఆ నమూనానే ఇవాళ్టి హైదరాబాద్ అభివృద్ధి. సాగునీటి ప్రాజెక్ట్ లను కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాళ్లు రాణిస్తున్నారు. ఉద్యోగాలు చేయటం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా... ఎక్కువ ఆదాయం సంపాందించే వ్యక్తులుగా తెలుగువారు ఎదిగారు. ప్రధాని మోదీ నిర్వహించిన జీ 20 సమావేశాల్లో మాట్లాడాను. 2047 ఏడాది వరకు భారత్ నెంబర్ వన్ గా ఎదిగిలా కార్యాచరణ రూపొందించాలని చెప్పాను" అంటూ చంద్రబాబు గుర్తు చేశారు.

ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని అన్నారు చంద్రబాబు. 10 కోట్ల మందికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని చెప్పారు. " 2014లో విభజన జరిగింది. విభజన సమయంలో తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరిన ఏకైక పార్టీ టీడీపీ. నేను ఆ రోజు హైటెక్స్ సిటీ కడితే .. రాజశేఖర్ రెడ్డి కూల్చివేస్తే ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగేదా..? ఓఆర్ఆర్ రద్దు చేస్తే ఇంత అభివృద్ధి ఉండేదా..? జీనోమ్ వ్యాలీ రద్దు చేస్తే కొవిడ్ కు వ్యాక్సిన్ వచ్చేదా..? మా తర్వాత వచ్చిన ఈ తెలంగాణ అభివృద్ధిని ఆపలేదు. వారందర్నీ అభినందించాల్సిందే. ఇలాంటి కీలక ప్రాజెక్ట్ లను తీసుకురావటం ఎంతో సంతృప్తి ఉంది. ఓట్ల కోసం కాదు జాతి కోసం పని చేశాను. జాతి కోసం పని చేశాను. పేరు, ఓట్లు, డబ్బుల కోసం పని చేయలేదు. బిల్ గేట్స్ వంటివారిని మెప్పించాను. ఆ రోజు నాతో బిల్ గేట్స్ ఏకీభవించారు. అలాంటి ప్రాజెక్ట్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చాను. ఐఎస్ బీ కోసం ఆ రోజు నాలుగు రాష్ట్రాలు పోటీ పడితే... మన రాష్ట్రానికి తీసుకువచ్చాను. ఇవన్నీ చేసిన సంతృప్తి ఉంది" అంటూ చంద్రబాబు మాట్లాడారు.

ఏపీలోని పరిస్థితులపై మాట్లాడిన చంద్రబాబు… సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయాలని చూస్తే…జగన్ రెడ్డి చంపేశాడని ధ్వజమెత్తారు. 29వేల రైతులు, 33వేల ఎకరాల భూమిని ఇచ్చి త్యాగం చేశారని… ఇదంతా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతోనే చేశారని చెప్పారు. నాడు శంషాబాద్ కోసం 5వేల ఎకరాల భూమిని తీసుకున్నామని… ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అంటే… మూడు ముక్కలాట ముచ్చట చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశామని… కృష్ణా - గోదావరి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఫలితంగా ఇవాళ రైతులకు నీళ్లు అందుతున్నాయని చెప్పారు. విభజన కంటే జగన్ వల్లే ఎక్కువ నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీలో తిరుగుబాటు మొదలైందన్నారు చంద్రబాబు. గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని… రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఏపీని బాగు చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని.. పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

IPL_Entry_Point