September 02 Telugu News Updates : కుప్పంలో అలా ఏం జరగలేదు - డీజీపీ-andhra pradesh telugu live news updates september 02092022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  September 02 Telugu News Updates : కుప్పంలో అలా ఏం జరగలేదు - డీజీపీ

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

September 02 Telugu News Updates : కుప్పంలో అలా ఏం జరగలేదు - డీజీపీ

04:33 PM ISTSep 02, 2022 10:00 PM B.S.Chandra
  • Share on Facebook
04:33 PM IST

  • August 31 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..

Fri, 02 Sep 202204:30 PM IST

జ్యోతిబాపూలే ఓవర్సీస్ కింద దరఖాస్తులకు ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జ్యోతిభా ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటరాదు. డిగ్రీ లో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలని పేర్కొంది.

Fri, 02 Sep 202203:37 PM IST

బ్రహ్మస్త్ర కు పోలీసులు షాక్

బ్రహ్మస్త్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్న సమయంలో పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు. గణేష్‌ ఉత్సవాల బందోబస్తులో సిబ్బంది బిజీగా ఉండడంతో అనుమతి ఇవ్వలేమని రాచకొండ పోలీసులు తెలిపారు.

Fri, 02 Sep 202203:27 PM IST

టీఎస్పీఎస్సీ కీలక సమావేశం

గ్రూప్ -2, గ్రూప్ -3 తో పాటు ఇతర ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక అనుమతులు వచ్చిన నేపథ్యంలో... భర్తీ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ భేటీకి పలు శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. అయితే ఖాళీలకు సంబంధించి తగిన వివరాలను తక్షణమే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే... త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు.

Fri, 02 Sep 202203:02 PM IST

సమీక్ష జరుగుతోంది…

కుప్పంలో జరిగిన ఘటనలపై సమీక్ష జరుగుతోందన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా కుప్పంలో ఏమీ జరగలేదని వ్యాఖ్యానించారు. కుప్పంలో పోలీసుల ఏకపక్ష వైఖరి అనేది ఆరోపణలు మాత్రమేనని అన్నారు.

Fri, 02 Sep 202202:57 PM IST

ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా యశ్వంతపూర్, నర్సాపూర్ కు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

Fri, 02 Sep 202201:47 PM IST

కుప్పం ఘటనపై స్పందించిన డీజీపీ

తిరుమలలో ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడారు.కుప్పం ఘటన శాంతిభద్రతలను ఇబ్బంది పెట్టేంత పెద్దదికాదని ఆయన పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు.

Fri, 02 Sep 202201:22 PM IST

తీస్తా సెతల్వాద్‌కు ఊరట 

ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు ఊరట లభించింది. 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల  కేసులో సుప్రీంకోర్టు సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

Fri, 02 Sep 202201:12 PM IST

కేంద్రం వివక్ష చూపుతోంది - కేటీఆర్

తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్ వివక్షపూరిత వైఖరి కొనసాగుతూనే ఉందని ఐటీశాఖమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆరోపించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో తెలంగాణకు చోటు దక్కకపోవడమే ఇందుకు సాక్ష్యం అన్నారు. లైఫ్ సైన్సెస్- ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న దేశ లైఫ్ సైన్సెస్ రాజధాని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ నగరాన్ని కావాలనే విస్మరించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Fri, 02 Sep 202201:12 PM IST

ప‌విత్రోత్స‌వాలు…

వైఎస్ఆర్ జిల్లా దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 8 నుండి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 7న సాయంత్రం పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు. సెప్టెంబ‌రు 8న ఉద‌యం చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 9న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 10న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

 

Fri, 02 Sep 202212:21 PM IST

సమయం ఇవ్వండి..

 గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి బీజేపీ అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఆమె బదులిచ్చారు.  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఇటీవల పీడీ చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 

Fri, 02 Sep 202211:18 AM IST

కేంద్రమంత్రిపై హరీశ్ రావ్ ఫైర్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు విషయంలో అబద్దాలు చెప్పిన నిర్మలా సీతారామన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరకపోతే ఇప్పుడే రాజీనామా చేస్తానని.. చేరితే మీరు చేస్తారా? అని డిమాండ్ చేశారు.

Fri, 02 Sep 202210:48 AM IST

27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala Srivari Brahmotsavalu: ఈనెల 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఛైర్మన్​ తెలిపారు. ప్రభుత్వం తరఫున సీఎం జగన్​ స్వామివారి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.

Fri, 02 Sep 202210:00 AM IST

హైదరాబాద్ టు రాజస్థాన్ టూర్….

irctc tourism announced rajasthan tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ROYAL RAJASTHAN' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఫ్లైటీ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. జైపూర్, పుష్కర్, జోద్ పూర్, ఉదయ్ పూర్ వంటి పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

Fri, 02 Sep 202209:49 AM IST

సీఎంకు భట్టి లేఖ..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ  రాశారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్ధులకు మంచి భోజనం పెట్టాలని కోరారు.

Fri, 02 Sep 202209:48 AM IST

కోనేరు మధుకు సుప్రీం నోటీసులు

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంలో కోనేరు మధు కు సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్‌ అంశాలు చోటు చేసుకోవడంతో నిందితుడిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్సమెంట్ డైరక్టరేట్‌ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

Fri, 02 Sep 202209:36 AM IST

పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్ సైట్స్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.

Fri, 02 Sep 202208:56 AM IST

ఆయన మహా నాయకుడు - రేవంత్ రెడ్డి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహా నాయకుడు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరణం ఒక్క కాంగ్రెస్ పార్టీ కే కాదు తెలుగు ప్రజలందరికీ తీరనిలోటన్నారు. .

Fri, 02 Sep 202208:55 AM IST

నివేదిక పంపిస్తాం

ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనపై విచారణ చేపట్టామని.. ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌. గా ఆస్పత్రిలో పరిస్థితులపై సిబ్బందితో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు పనిచేసిన సిబ్బందిని విచారించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని డీహెచ్‌ తెలిపారు.

Fri, 02 Sep 202208:19 AM IST

వైసీపీపై ప్రజాపోరు సభలు

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా 5000 చోట్ల బిజేపీ ప్రజా పోరు సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.  కార్యక్రమాల నిర్వహణ కోరకు రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీ ఏర్పాటు చేశారు. 

Fri, 02 Sep 202208:04 AM IST

ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే…..

త్వరలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిలుగా ఉంటారని చంద్రబాబు ప్రకటించారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు.

Fri, 02 Sep 202207:39 AM IST

బర్డ్‌లో ఉచిత శస్త్ర చికిత్సలు

బర్డ్ ఆసుపత్రిలో ఉచితంగా గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ  అధికారులు ప్రకటించారు.  టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో గ్రహణమొర్రికి చికిత్స  చేస్తున్నారు. Cleft Lip and Cleft Palate surgery శస్త్రచికిత్స అవసరమయ్యే పేద పిల్లలకు ఉచితంగా చేస్తామని  ప్రకటించారు.  రోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓ పి లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అపాయింట్‌మెంట్‌, విచారణల కోసం 7337318107 నంబర్లో సంప్రదించవచ్చని టీటీడీ వైద్యులు ప్రకటించారు. 

Fri, 02 Sep 202207:37 AM IST

దెందులూరులో ఘర్షణ

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో పలువరు గాయపడ్డారు. బైక్ ఢీకొన్న ఘటనలో పరస్పర దాడులు చేసుకున్నారు.  బాధిత వర్గంలో టీడీపీ కార్యకర్త ఉండడంతో వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది.  విజయరాయి గ్రామంలో రోడ్డుపై  బాధితులు, టిడిపి కార్యకర్తలు బైఠాయించి నిరసనకు దిగారు.  దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. 

 

Fri, 02 Sep 202207:35 AM IST

భారీగా గంజాయి స్వాధీనం

కాకినాడ జిల్లా పత్తిపాడు  మండలంలోని ధర్మవరం జాతీయ రహదారి మీదుగా రవాణా అవుతున్న గంజాయిని పత్తిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో  440 కిలోలు గంజాయి పట్టుబడింది. అనకాపల్లి జిల్లా కసింకోట ప్రాంతంలోని బయ్యవరం నుంచి కంట ఈ నారు ద్వారా గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం అందడంతో  ధర్మవరం హైవేపై నిఘా ఉంచి పట్టుకున్నారు. హర్యానాకు చెందిన వాహనంలో 440 కేజీల గంజాయిని స్వాధ్వానం చేసుకున్నారు.

Fri, 02 Sep 202207:33 AM IST

నరసరావుపేట బీసీ కాలనీలో ఘర్షణ

నరసరావుపేట బీసీ కాలనీలో ఘర్షణలో వైసీపీ లోని ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక వర్గంలోని యువతి సెల్ ఫోన్ కి మరో వర్గంలోని యువకుడు అసభ్యకరంగా మెసేజ్ లు పంపడంతో ఘర్షణ తలెత్తింది. న్యాయం చేయాలని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట అర్ధరాత్రి ఆందోళనకు  దిగడంతో ఘర్షణ జరిగింది.  నరసరావుపేట 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించారు. 

Fri, 02 Sep 202206:24 AM IST

తెలంగాణ పదో తరగతి సప్లమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ కమిషనర్‌ ఫలితాలను విడుదల చేశారు. సప్లమెంటరీ పరీక్షల్లో 79.82శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. 

Fri, 02 Sep 202206:14 AM IST

నిర్మలా సీతారామన్ తనిఖీలు

కామారెడ్డి  జిల్లా బీర్కూర్  రేషన్ షాపులో కేంద్రమంత్రి  నిర్మలా సీతారామన్ తనిఖీలు నిర్వహించారు.  కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు.  రేషన్ కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంతని కలెక్టర్ ను ప్రశ్నించారు.  ఆ సమాచారం  తనకి తెలియదని  కలెక్టర్ జితేష్ పాటిల్  చెప్పడంతో , ఐఏఎస్ ఆఫీసర్ మీకు తెలియదా అని నిర్మలా సీతారామన్  ప్రశ్నించారు.  అరగంటలో తెలుసుకుని చెప్పాలన్న నిర్మలా సీతారామన్  సూచించారు. రేషన్ షాపులో మోడీ ఫోటో లేకపోవడం గమనించి, మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్‌ను  ప్రశ్నించారు. మోడీ ప్లెక్సీ పెట్టకపోతే సాయంత్రం నేనే వచ్చి కడతానని చెప్పారు. 

Fri, 02 Sep 202206:14 AM IST

సూర్యాపేటలో విద్యార్ధుల ఆందోళన

సూర్యాపేట అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్ధులు ఆందోళనకు దిగారు. సెంట్రల్ యూనివర్శిటీ ప్రవేశపరీక్ష కోసం సూర్యాపేట అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీని కొందరు విద్యార్ధులకు సెంటర్‌గా కేటాయించారు. పీజీ ప్రవేశపరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్ధులకు  సూర్యాపేటలో పరీక్షా కేంద్రం లేకపోవడంతో అవాక్కయ్యారు. పరీక్షా కేంద్రాన్ని సిద్ధిపేటకు మార్చినట్లు తాపీగా సమాధానం ఇవ్వడంతో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. పీజీ ప్రవేశ పరీక్ష రాయకపోతే విద్యార్ధులు నష్టపోతామని వాపోతున్నారు. 

Fri, 02 Sep 202206:14 AM IST

కోర్టులో లొంగిపోయిన తమ్మినేని కోటేశ్వరరావు

ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో హత్యకు గురైన టిఆర్‌ఎస్‌ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య వ్యవహారంలో ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు కోర్టులో లొంగిపోయారు. హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు శుక్రవారం ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. 

Fri, 02 Sep 202206:14 AM IST

పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‍కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. 

Fri, 02 Sep 202206:14 AM IST

పోటాపోటీగా వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలు

గుంటూరు జిల్లా తాడికొండలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ‌గా వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు సాగుతున్నాయి.  వైఎస్ వర్ధంతి సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.   తాడికొండ, తుళ్లూరు మండలాల్లో ఎమ్మెల్సీ డొక్కా వర్గం ర్యాలీలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  ఫిరంగిపురంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి  పాల్గొంటున్నారు.  రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు, కార్యకర్తలు వేర్వేరుగా వర్ధంతి నిర్వహిస్తున్నారు. 

Fri, 02 Sep 202204:46 AM IST

సముద్రంలో బాహుబలి నౌక

తొలి దేశీయ విమానవాహక నౌక ‘ విక్రాంత్’ ను  కొచ్చిలో ప్రధాని నరేంద్ర మోదీ నౌకాదళానికి అప్పగించారు.   కొచ్చిన్ షిప్ యార్డ్ లో తయారైన 262 మీటర్ల  నౌకను దేశీయంగా తయారు చేశారు.  భారత్ లో తయారైన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్.  రూ.23 వేల కోట్లతో రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకలో 1700 మంది సిబ్బంది పనిచేయనున్నారు. 

Fri, 02 Sep 202204:43 AM IST

టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ చార్జీలు, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు  పాల్గొననున్నారు.  ఎన్నికలపై శ్రేణులు సిద్దంగా ఉండేలా దిశానిర్దేశం  చేయనున్నారు. ప్రజలపై పడుతున్న ఆర్థికభారం, ప్రభుత్వంలో కుంభకోణాలపై చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై చర్చిస్తారు. 

Fri, 02 Sep 202202:39 AM IST

నల్గొండలో బస్సు దగ్ధం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకావర్తి గ్రామ శివార్లలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టైర్‌ పేలి అదుపు తప్పి ప్రమాదానికి గురైన బస్సులో మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు కిందకు దిగిపోయారు.

Fri, 02 Sep 202202:38 AM IST

హెచ్‌పి గ్యాస్‌ సిలిండర్ల  లారీలో పేలుడు

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా హెచ్‌ గ్యాస్‌ సిలిండర్లలో మంటలు చెలరేగి సిలిలండర్లు పేలిపోయిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.  కొమరోలు మండలం దద్దవాడ శివారులో అగ్నిప్రమాదం  జరిగింది. ఇంజన్ లో మంటలు చెలరేగి వేగంగా  లారీకి వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.