Karimnagar Reservoirs : డెడ్ స్టోరేజ్ లో జలాశయాలు - వరుణుడిపైనే ఆశలు...!
Reservoirs Karimnagar District : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. భారీ వర్షాలు పడితేనే మళ్లీ ప్రాజెక్టులు నిండనున్నాయి.
Karimnagar District : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాల్లో నీళ్ళు అడుగంటాయి. డెడ్ స్టోరేజ్ కి నీటి మట్టం పడిపోవడంతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నానాటికీ పడిపోతున్న నీటి మట్టం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలను కలవరపరుస్తోంది. ఆరుగాలం శ్రమకు సై అంటున్న రైతుల మదిలో దిగాలును పెంచుతోంది.
సకాలంలో కురిసే వర్షాలపై గంపెడాశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి కర్షకుల్లో కనిపిస్తోంది. గతేడాది ఆది నుంచే వర్షాల జోరుతో నీళ్లు సమృద్ధిగా కనిపించాయి. ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఉండకుంటే సాగుకు, తాగుకు ఇబ్బంది ఎదురుకానుంది. ఇటీవల తొలకరి జల్లుల జాడలు కనిపించినా అనుకున్న విధంగా వర్షపాతం నాలుగు జిల్లాల పరిధిలో నమోదుకాలేదు. జూన్, జులై మాసంలో పడే వర్షాల ఆధారంగానే పంటల సాగుకు మేలు జరగనుంది. జిల్లాలోని పెద్దనీటి వనరుల మీదనే చెరువులు, కుంటల కింద ఆయకట్టు ఆధారపడి ఉంది. ప్రధాన జలాశయాల ప్రస్తుత పరిస్థితి తీరు ఇలా ఉంది.
కరీంనగర్ లో తాగునీటి ఇక్కట్లు…..
కరీంనగర్ తలాపున ఉన్న లోయర్ మానేరు డ్యామ్ ద్వారా కరీంనగర్, సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటితో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో దాదాపు 6.80 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. ఈసారి మండు వేసవిలో ఎలాగోలా దాహార్తి కష్టాలు రాకుండా ఉన్న నీటిని సక్రమంగానే వినియోగించారు. ఇప్పుడున్న అసలు సమస్యల్లా ఈ జలాశయం కింద ఉన్న చెరువులు, కుంటల్లో అనుకున్న విధంగా నీళ్లు లేకపోవడంతో వాటి కింద సాగు చేసిన ఆయకట్టు పంటలకు ఇబ్బంది కలుగనుంది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 3 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఈ నెలలో భారీ వానలు పడకుంటే కరీంనగర్ గడ్డు పరిస్థితి ఎదుర్కునే పరిస్థితి నెలకొంది. ఎల్ఎండీ నీటి నిల్వ సామర్థ్యం 24 టిఎంసీలు కాగా, ప్రస్తుతం 5.82 టిఎంసీల నీరు ఉంది. గతేడాది ఈ సమయానికి 8.18 టిఎంసీల నీరు ఉంది. 12 టీఎంసీల నీరు డ్యామ్ లో ఉంటేనే కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లై కి ఇబ్బంది లేకుండా ఉంటుందని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ వై.సునీల్ రావు తెలిపారు. డెడ్ స్టోరేజ్ నుంచి ప్రస్తుతం బూస్టర్ ల ద్వారా కరీంనగర్ కు మంచినీటి సప్లై చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఎడారిని తలపిస్తున్న మిడ్ మానేర్….
మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం కళ తప్పి రూపును కోల్పోయింది. గతేడాది ఎటు చూసినా నీటిసంద్రమనే పందాలో కనిపించినా మిడ్ మానేర్ జలాశయంలో ఇప్పుడు ఆ ఆనవాళ్లు లేవు. కి.మీ పరిధిలో తగ్గిపోయాయి. 2023లో ఇదే సమయానికి 20 టీఎంసీలతో కళకళలాడిన మద్య మానేర్ జలాశయంలో ఇప్పుడు 5 టీఎంసీలకు పైగా నీళ్లున్నాయంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. దాదాపు 15 టీఎంసీలు తగ్గిపోయాయి.
ఈ జలాశయం కింద సాగవ్వాల్సిన పంటల విషయంలో రైతులు ఆచితూచి సాగుకు సిద్ధమవుతున్నారు. వర్షాలు పడి నీళ్లు నిండిన తరువాతనే పంటలు వేద్దామనే ధోరణితో ఉన్నారు. పైగా ఇక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాలకు నీళ్లు అందించాల్సి ఉంది. కానీ మిడ్ మానేర్ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది.
ఎండుతున్న ఎల్లంపల్లి…
పలు జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో నిల్వలు తగ్గుముఖం పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచే హైదరాబాద్ కు తాగునీటి సరఫరా జరుగుతోంది. దీనికింద చాలా చిన్న నీటి వనరులు ఆధారపడి ఉన్నాయి.
నారాయణపూర్ చెరువుతోపాటు ఇక్కడి జలాశయం వెనుక భాగంలో నిలిచే నీటితో అంతర్గాం, ఎండపల్లి, ధర్మారం, పెగడపల్లి, వెల్గటూర్, ధర్మపురి మండలాల్లోని రైతాంగానికి మేలు జరగనుంది. ఇక్కడ కూడా గతేడాదితో పోలిస్తే నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. కేవలం ఆరు టీఎంసీల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో సాగుకు, తాగుకు ఎంతమేర ఇక్కడి జలం అందుతుందనేది అధికారులకే అర్థం కావడం లేదు.
కిందటి ఏడాదితో పోలిస్తే 7 టీఎంసీలు తగ్గాయి. రోజు రోజుకు జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టం చూస్తే నీటి కష్టాలు తప్పాలంటే వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.