Hyderabad Pravalika : ప్రవళిక ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? కీలక విషయాలు వెలుగులోకి!-hyderabad pravalika met boy friend before suicide love failure reason ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Pravalika : ప్రవళిక ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? కీలక విషయాలు వెలుగులోకి!

Hyderabad Pravalika : ప్రవళిక ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? కీలక విషయాలు వెలుగులోకి!

Bandaru Satyaprasad HT Telugu
Oct 14, 2023 08:02 PM IST

Hyderabad Pravalika : అశోక్ నగర్ లో గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య వెనుక అసలు కారణాన్ని పోలీసులు ఛేదించారు. ప్రియుడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్థారించారు.

ప్రవళిక ఆత్మహత్యకు కారణాలు తెలిపిన డీసీపీ వెంకటేశ్వరరావు
ప్రవళిక ఆత్మహత్యకు కారణాలు తెలిపిన డీసీపీ వెంకటేశ్వరరావు

Hyderabad Pravalika : హైదరాబాద్ అశోక్ నగర్ లో గ్రూప్-2 అభ్యర్థిని మర్రి ప్రవళిక శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు ముందు అసలేం జరిగిందే పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. వరంగల్ జిల్లా బిక్కాజీ పల్లికి చెందిన మర్రి ప్రవళిక(23) గ్రూప్స్ కోచింగ్ కోసం అశోక్ నగర్ లోని బృందావన్ గల్స్ హాస్టల్ లో 15 రోజుల క్రితం జాయిన్ అయ్యిందన్నారు. ఆమెకు హాస్టల్లో శ్రుతి, సంధ్య అనే స్నేహితులు ఉన్నారని, వారిని విచారించామన్నారు. శుక్రవారం రాత్రి ప్రవళిక రూమ్ లో ఒక్కరే ఉన్నపుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వేరే ఇష్యూతో ముడిపెడుతున్నారు

'ప్రవళిక సూసైడ్ నోట్ రాసింది. ఆమె మొబైల్ చూస్తే.. అందులో ఒక ఛాటింగ్ ను గమనించాం. కోస్గి మండలానికి చెందిన శివ రామ్ రాథోడ్ అనే అబ్బాయితో ప్రైవేట్ ఛాటింగ్ చేసిందని గుర్తించాం. శుక్రవారం ఉందయం బాలాజీ దర్శన్ హోటల్లో వీరిద్దరూ టిఫిన్ చేశారు. ఆ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించాం. శివ రామ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆ ఛాటింగ్ లో తెలుసుకున్నాం. తనను మోసం చేశాడని.. ప్రవళిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని నిర్థారించాం. ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. గతంలో వారు యువతిని మందలించారు. ప్రవళిక సూసైడ్ లెటర్, ఛాటింగ్ ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపించాం. ఆ నివేదిక అనంతరం ప్రియుడు శివరాంపై కేసు నమోదు చేస్తాం. ఈ ఘటనను వేరే ఇష్యూతో ముడిపెడుతున్నారు. స్థానిక విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు, రాజకీయ నేతలు ధర్నా చేశారు. నిన్న ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేశాం' అని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సూసైడ్ నోట్ లో

ఆత్మహత్యకు ముందు ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ఈ లెటర్ లో 'అమ్మా నన్ను క్షమించు. నేను ఓడిపోయాను, నా వల్ల నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నావు. ఏడవకండి జాగ్రత్తగా ఉండండి. నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. నన్ను చూసుకున్నారు. కానీ నేను నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను ఎవరూ క్షమించరు అమ్మా, నాన్న జాగ్రత్త' అని ప్రవళిక రాసింది. శుక్రవారం రాత్రి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రవళిక మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు. ప్రవళిక మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Whats_app_banner