CAG Report: ప్రతిపాదనలకు ఖర్చులకు పొంతన లేదు..
బడ్జెట్ ప్రతిపాదనలకు.. ఖర్చులకు పొంతన లేదని పేర్కొంది కాగ్. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఆడిట్ నివేదికలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలకాంశాలను ప్రస్తావించింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). అప్పులు పెరుగుతున్నా సంపద సృష్టిపై దృష్టి సారించడం లేదని తెలిపింది.
శాసనసభ ఆమోదం లేకున్నా భారీ మొత్తంలో ఖర్చు జరుగుతోందని పేర్కొంది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ . బడ్జెట్ ప్రతిపాదనల్లో వాస్తవికతలేదని పేర్కొంది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధింన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఆడిట్ నివేదికలను మంగళవారం తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు.
నివేదికలోని పలు అంశాలు..
2014-15 నుంచి అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసిన రూ. 1,32,547 కోట్ల వ్యయాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉంది. కొన్ని కేటాయింపులకు మించి ఖర్చు చేయగా, అనుబంధ కేటాయింపులకు శాసనసభ ఆమోదం లేకున్నా ఖర్చు చేశారు. భారత ప్రభుత్వ అకౌంటింగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. పీడీ అకౌంట్ల నిర్వహణ పారదర్శకంగా లేదు. బడ్జెట్‌ను తగిన రీతిలో విశ్లేషించి అర్థవంతంగా వినియోగ పద్దులను తయారు చేయాలి.
సామాజిక–ఆర్థిక గ్రాంట్ల కింద చేసిన ప్రతిపాదనలో నాలుగు గ్రాంట్ల కింద ఖర్చు 50 శాతం మించలేదు.
2020-21లో పెట్టుబడి వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ. 16,859 కోట్ల నుంచి రూ. 15,922 కోట్లకు తగ్గింది. 198 పీడీ ఖాతాలకు గాను 139 ఖాతాల్లో 2021 మార్చి ఆఖరు నాటికి లావాదేవీలు లేవు.
రుణమాఫీకి రూ. 6,012 కోట్లు కేటాయించినా రూ. 213 కోట్లే ఖర్చు చేశారు. రెండు పడకల గదుల ఇళ్లకు రూ. 5,000 కోట్లు ఇచ్చినా రూ. 550 కోట్లే వ్యయం అయింది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా కంటే ఎక్కువ నిధులను కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో 21 శాతం, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 26 శాతం వ్యయం కాలేదు. పీడీ ఖాతాల నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మళ్లించకూడదు.
రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరి ఖర్చులు పెరుగుతున్నాయి. వేతనాలు, పింఛన్లపై వ్యయం, వడ్డీల చెల్లింపులు 2015-16 నుంచి పెరుగుతున్నాయి.
15వ ఆర్థిక సంఘం అంచనాలను రాష్ట్రం అందుకోలేకపోయింది. పన్ను ఆదాయం కింద రూ.89,950 కోట్లు వస్తుందని ఆర్థిక సంఘం అంచనా వేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.69,329 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ, వచ్చింది మాత్రం రూ.67,957 కోట్లే.