Malkajgiri BRS : తెరపైకి ‘ప్లాన్ బీ’ - కొత్త నేతల పేర్లను పరీశీలిస్తున్న గులాబీ బాస్!
Malkajgiri Assembly Constituency: మైనంపల్లి కామెంట్స్ చిచ్చు రేపిన నేపథ్యంలో మల్కాజ్ గిరి సీటుపై డైలామాలో పడింది బీఆర్ఎస్ హైకమాండ్. దీంతో కొత్త అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది.
Telangana Assembly Elections 2023: అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచేసింది. ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి… ఎన్నికల రేసులో టాప్ గేర్ వేసింది. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. అయితే మల్కాజ్ గిరి సీటు అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్ రావ్ టార్గెట్ గా మైనంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు చేయటంతో… పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. మైనంపల్లి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో…. ప్లాన్ బీ రెడీ చేసే పనిలో పడిందంట బీఆర్ఎస్. కొత్త నేతల పేర్లను తెరపైకి తీసుకువచ్చే దిశగా కసరత్తు షురూ చేసిందని సమాచారం.
పరిశీలనలో కొత్త పేర్లు…?
మంత్రి హరీశ్ రావ్ పై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావ్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ తో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో… మైనంపల్లిపై చర్యలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ హైకమాండ్. ఆయనకు ప్రకటించిన టికెట్ ను పక్కనపెట్టడంతో పాటు… పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉందన్న చర్చ గట్టిగా నడుస్తోంది. ఇదే సమయంలో ఆయన్ను పక్కనపెడితే అభ్యర్థిగా ఎవరిన్ని దించాలనే దానిపై కూడా గులాబీ బాస్ కసరత్తు షురూ చేశారు. ప్రధానంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ టికెట్ ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మమల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో… అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట..! ఇయనే కాకుండా…. కుత్బుల్లాపూర్ టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పేరును కూడా గులాబీ బాస్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ముదిరాజ్ కోటాలో ఆయన పేరు….?
తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన టికెట్ల జాబితాలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఒక్కరికి కూడా టికెట్ దక్కలేదు. రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన సామాజికవర్గంగా పేరున్న ముదిరాజ్ లకు టికెట్ ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి సీటును ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారట…! ప్రస్తుతం ఆకుల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ… అనంతరం కాంగ్రెస్ లో చేరారు. ఈ మధ్యనే హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన… కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఆకుల రాజేందర్ తో చర్చలు జరిపి పార్టీలోకి రప్పించవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇయనే కాకుండా… ఒక్కరిద్దరు కార్పొరేటర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల మేరకు తెలుస్తోంది.
మొత్తంగా మైనంపల్లిపై వేటు పడటం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇవాళో, రేపో మైనంపల్లి హైదరాబాద్ కు రానున్నారు.ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆయన ఎలా స్పందిస్తారు…? పునరాలోచన చేసిన హరీశ్ రావ్ కామెంట్స్ వ్యవహరంపై యూటర్న్ తీసుకుంటారా..? లేక పార్టీ మారుతారా..? అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
సంబంధిత కథనం