Lunch Break | క్రికెటర్లు లంచ్‌ బ్రేక్‌లో ఏం తింటారో తెలుసా?-what do cricketers eat during lunch break in test cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lunch Break | క్రికెటర్లు లంచ్‌ బ్రేక్‌లో ఏం తింటారో తెలుసా?

Lunch Break | క్రికెటర్లు లంచ్‌ బ్రేక్‌లో ఏం తింటారో తెలుసా?

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 09:37 PM IST

క్రికెట్‌ను ఫాలో అయ్యే చాలా మందికి అసలు ప్లేయర్స్‌ లంచ్‌ బ్రేక్‌లో ఏం తింటారన్న అనుమానం ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా కాస్త ఎక్కువ తింటే ఆయాసంతో అసలు ఆడలేరు. తక్కువ తింటే నీరసం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమతులమైన ఆహారం తీసుకోవడం, మోతాదు మించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

<p>ఇండియన్ క్రికెట్ టీమ్</p>
ఇండియన్ క్రికెట్ టీమ్ (PTI)

Lunch Break.. ఈ లంచ్‌ బ్రేక్ మనందరికీ ఉంటుంది. అలాగే రోజంతా క్రికెట్‌ ఆడే ప్లేయర్స్‌కు కూడా ఉంటుంది. ముఖ్యంగా టెస్ట్‌ మ్యాచ్‌లలో తొలి రెండు సెషన్లను వేరు చేసేది ఈ లంచ్‌ బ్రేకే. అయితే క్రికెట్‌ను ఫాలో అయ్యే చాలా మందికి అసలు ప్లేయర్స్‌ లంచ్‌ బ్రేక్‌లో ఏం తింటారన్న అనుమానం ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా కాస్త ఎక్కువ తింటే ఆయాసంతో అసలు ఆడలేరు. తక్కువ తింటే నీరసం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమతులమైన ఆహారం తీసుకోవడం, అది కూడా మోతాదు మించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒంట్లో శక్తి రావాలి. అదే సమయంలో పొట్టలో ఆయాసం ఉండకూడదు. మామూలుగా మనమైతే మధ్యాహ్నం వేళ ఫుల్లుగా కడుపు నింపేసుకుంటాం. క్రికెటర్లకు ఆ అవకాశం ఉండదు.

ఏంటీ లంచ్‌ బ్రేక్‌?

టెస్ట్‌ క్రికెట్‌ను చూసే వాళ్లకు ఈ లంచ్‌ బ్రేక్ గురించి తెలుసు. ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో ప్రతి రోజూ ఉదయం రెండు గంటల ఆట తర్వాత తొలి సెషన్‌ ముగుస్తుంది. ప్లేయర్స్‌ లంచ్‌ కోసం వెళ్తారు. ఈ లంచ్‌ బ్రేక్ 40 నిమిషాల పాటు ఉంటుంది. క్రీజులో అటుఇటూ పరుగెత్తే బ్యాట్స్‌మెన్‌కైనా, బౌలర్లు, ఫీల్డర్లకైనా కాస్త శరీరం రీఛార్జ్‌ కావడానికి ఈ లంచ్‌ బ్రేక్‌ బాగా పనికొస్తుంది. అయితే ఈ బ్రేక్‌లో వాళ్లు తీసుకునే ఫుడ్‌పై ఫీల్డ్‌లో వాళ్ల ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. పైగా భారత ఉపఖండంలో టెస్ట్‌ మ్యాచ్‌లు సాధారణంగా ఉదయం 9, 9.30 గంటల మధ్య ప్రారంభమవుతాయి. ఆ లెక్కన రెండు గంటలు అంటే 11 లేదా 11.30 గంటలకు లంచ్ బ్రేక్‌ ఉంటుంది. ఎటూ కాని ఆ సమయంలో ప్లేయర్స్‌ లంచ్‌ ఏం చేస్తారు అన్న అనుమానం చాలా మంది క్రికెట్‌ చూసే అభిమానులకు కలుగుతుంది.

లంచ్‌ బ్రేక్‌లో ఏం తింటారు?

రెండు టీమ్స్‌ మ్యాచ్‌లో తలపడుతున్నప్పుడు.. ఆ రోజు, ఆ సమయంలో ప్లేయర్స్‌ పోషిస్తున్న రోల్‌ను బట్టి ఈ లంచ్‌ ఉంటుంది. ఉదాహరణకు లంచ్‌ బ్రేక్‌ సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ క్రీజులో బ్యాటింగ్‌ చేస్తూ ఉంటే.. వాళ్లు ఈ బ్రేక్‌లో చాలా తక్కువగా తింటారు. వికెట్ల మధ్య పరుగెత్తే సమయంలో ఆయాసం ఉండకూడదు కాబట్టి. అదే సమయంలో అలసట రాకూడదు కాబట్టి అరటిపండు, ప్రొటీన్‌ బార్‌ వంటివి తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. లంచ్‌ తర్వాత బౌలింగ్‌ చేయబోయే బౌలర్లు కూడా ఇంతే. వాళ్లు కూడా ఇలా తక్కువ మొత్తంలో అయినా అధిక శక్తిని ఇచ్చే ఆహారాన్ని తింటారు. 

ఇక మిగతా వాళ్లు అంటే బ్యాటింగ్‌ టీమ్‌లో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చున్న వాళ్లు, బౌలింగ్‌ టీమ్‌లో కేవలం ఫీల్డింగ్‌ చేసే వాళ్లు ఏదైనా తినడానికి అవకాశం ఉంటుంది. వీళ్లకు చాలా వెరైటీల వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్‌ తినే వాళ్లకు ప్రొటీన్‌ ఎక్కువగా ఇచ్చే చికెన్‌, ఫిష్‌ కచ్చితంగా ఉంటుంది. ఇక శాకాహార ప్లేయర్స్‌ కోసం పప్పులు, కూరగాయాలు, సలాడ్‌లు అందుబాటులో ఉంటాయి. 

లంచ్‌ చివర్లో ఫ్రూట్‌ సలాడ్‌లాంటి డెజర్ట్‌ కూడా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే ఐస్‌క్రీమ్‌లు కూడా తినొచ్చు. సాధారణంగా ఏ దేశంలో మ్యాచ్‌లు జరుగుతున్నా.. కొవ్వు తక్కువగా ఉన్న, శక్తిని ఇచ్చే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్‌నే లంచ్‌లో భాగంగా ప్లేయర్స్‌కు అందిస్తారు. క్రికెటర్లకు వాళ్ల వ్యక్తిగత అలవాట్ల ప్రకారం కూడా ప్రత్యేక లంచ్‌ ఏర్పాట్లు ఉంటాయి.

వన్డేల్లో పరిస్థితి ఏంటి?

టెస్ట్‌ క్రికెట్‌లో అయితే ఆడిన ఐదు రోజులూ లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది. కానీ వన్డే క్రికెట్‌లో అలా కాదు. ఒక టీమ్‌ ఇన్నింగ్స్‌ తర్వాత మరో టీమ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే ముందు 45 నిమిషాల బ్రేక్‌ ఉంటుంది. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌ మూడున్నర గంటల్లో ముగించాలి. 45 నిమిషాల బ్రేక్‌ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండుసార్లు డ్రింక్స్‌ బ్రేక్‌లు ఉంటాయి. వన్డే మ్యాచ్‌లలోనూ బ్రేక్‌ సమయంలో క్రికెటర్లకు ఇలాంటి ఆహారమే అందుబాటులో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం