Virat Kohli to Delhi stadium: కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.. చాలా రోజుల తరువాత..-virat kohli breaks internet by driving to delhi stadium before ind aus 2nd test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli To Delhi Stadium: కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.. చాలా రోజుల తరువాత..

Virat Kohli to Delhi stadium: కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.. చాలా రోజుల తరువాత..

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 02:36 PM IST

తాను చరిత్ర తిరగ రాసేందుకు అడ్రస్‌గా నిలిచిన తన సొంత స్టేడియంలోకి వస్తూ విరాట్ కోహ్లీ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ
ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ (Getty)

105 టెస్ట్ మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ తన స్వస్థలమైన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కేవలం మూడు మ్యాచులే ఆడాడంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. ఈ స్టేడియాన్ని గతంలో ఫిరోజ్ షా కోట్లా మైదానంగా పిలిచేవారు. కోహ్లీ ఈ మైదానంలోనే క్రికెట్ ఆడుతూ పెరిగాడు. మీరు యూట్యూబ్‌లో వెతికితే 17 ఏళ్ల కోహ్లీ ఈ మైదానంలో ఆడుతూ ఉండే 15 నిమిషాల వీడియో దొరుకుతుంది. ఇప్పుడు ఆల్-టైమ్ గ్రేట్‌గా నిలిచిన కోహ్లీ ఇదే స్టేడియానికి తిరిగి వచ్చాడు. ఇదే మైదానంలోని స్టాండ్‌ తన పేరుపైనే ఉంది. 

టెస్ట్ స్టార్ట్ అవడానికి ఇంకా రెండు రోజులు ఉందనగా కోహ్లీ ఒక ఎమోషనల్ పోస్టుతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలోకి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘చాలా కాలం తరువాత ఢిల్లీ స్టేడియంలోకి లాంగ్ డ్రైవ్.. నాస్టాల్జిక్ ఫీలింగ్..’ అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లీ.. 2017లో అనుష్క శర్మను పెళ్లాడిన తరువాత మకాం ముంబైకి మార్చాడు. ఢిల్లీలో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఏడాది కూడా అదే కావడం యాధృచ్చికం. ఈ స్టేడియంలో కోహ్లీకి అన్ని తీపి గుర్తులే. మూడు టెస్టుల్లో కోహ్లీ 467 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం కోహ్లీ ఇక్కడ తొలి టెస్ట్ ఆడాడు. అప్పుడు బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు.

కోహ్లీ తిరిగి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. కెప్టెన్‌గా ఢిల్లీలో తొలి మ్యాచ్ ఇది. 337 పరుగుల తేడాతో ఆ మ్యాచ్ గెలిచాడు. రెండేళ్ల తరువాత ఇక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 243 పరుగులు సాధించాడు. అది ఆయన ఐదో డబుల్ సెంచరీ కావడం విశేషం. 2017 తరువాత ఒకే ఒక వన్ డే మ్యాచ్‌లో ఇక్కడ ఆడాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అది.

టెస్టుల్లో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నకోహ్లీకి.. తన స్టార్‌డమ్‌కు చిన్నప్పటి నుంచి సహకరించిన సొంత పిచ్ వేదిక కావడం ఇప్పుడు తనకి సరైన అవకాశం.

WhatsApp channel

సంబంధిత కథనం