Supreme Court on BCCI: గంగూలీ, జే షాలకు లైన్‌ క్లియర్‌.. పదవుల్లో కొనసాగేందుకు గ్రీన్‌సిగ్నల్‌-supreme court accepts change in bcci constitution that allows ganguly and jay shah to continue ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Supreme Court On Bcci: గంగూలీ, జే షాలకు లైన్‌ క్లియర్‌.. పదవుల్లో కొనసాగేందుకు గ్రీన్‌సిగ్నల్‌

Supreme Court on BCCI: గంగూలీ, జే షాలకు లైన్‌ క్లియర్‌.. పదవుల్లో కొనసాగేందుకు గ్రీన్‌సిగ్నల్‌

Hari Prasad S HT Telugu
Sep 14, 2022 05:46 PM IST

Supreme Court on BCCI: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జే షాలకు సుప్రీంకోర్టులో లైన్‌ క్లియర్‌ అయింది. వాళ్లు మరోసారి ఆ పదవులు చేపట్టే వీలు కల్పించేలా అత్యున్నత న్యాయస్థానం కీలక మార్పులు చేసింది.

బీసీసీఐ కార్యదర్శి జే షా, అధ్యకుడు సౌరవ్ గంగూలీ
బీసీసీఐ కార్యదర్శి జే షా, అధ్యకుడు సౌరవ్ గంగూలీ (Twitter)

Supreme Court on BCCI: బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) రాజ్యాంగంలో కీలకమైన మార్పులు చేయడానికి బుధవారం (సెప్టెంబర్‌ 14) సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జే షా మరోసారి ఆ పదవులు చేపట్టే వీలు కలిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరి పదవీ కాలం ముగిసిపోయింది.

అయితే గతంలో ఆర్‌ఎం లోధా కమిటీ చేసిన సిఫార్సుల మేరకు బీసీసీఐ రాజ్యాంగంలో మార్పులు చేశారు. దీని ప్రకారం రాష్ట్ర అసోసియేషన్‌, బీసీసీఐలో పదవులు చేపట్టిన వాళ్లు తిరిగి వెంటనే పోటీ చేయకుండా కొంతకాలం దూరంగా ఉండాలన్న నిబంధన ఉంది. దీనిని సవరించాలని కోరుతూ బీసీసీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. బుధవారం ఈ కీలక తీర్పు వెలువరించింది.

ఈ నెల మొదట్లోనే గంగూలీ, జే షా పదవీకాలాలు ముగిశాయి. కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ అన్న నిబంధనతో వీళ్లు తమ పదవుల్లో కొనసాగే వీలు లేకుండా పోయింది. ఈ నిబంధనను ఎత్తేయాలని కోర్టుకు వెళ్లారు. ఇప్పుడీ నిబంధన ఎత్తేయడంతో వీళ్లు పదవుల్లో కొనసాగేందుకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా బీసీసీఐ తరఫు వాదనలను వినిపించారు.

ఈ పిటిషన్‌ను డీవై చంద్రచూడ్‌, హిమ కోహ్లిల ధర్మాసనం విచారించింది. దేశంలో ప్రస్తుతం క్రికెట్‌ను గణనీయంగా క్రమబద్ధీకరించారన్న విషయాన్ని తుషార్‌ మెహతా.. సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పారు. బీసీసీఐ ఓ స్వతంత్ర సంస్థ అని, దాని రాజ్యాంగంలో జరిగి మార్పులన్నింటినీ బోర్డు ఏజీఎం పరిగణనలోకి తీసుకుంటుందని కూడా వివరించారు. ఇక రాష్ట్ర అసోసియేషన్‌, బీసీసీఐ రెండు వేర్వేరు వ్యవస్థలని, వాటి నిబంధనలు కూడా వేరని కూడా తుషార్‌ మెహతా ధర్మాసనానిని చెప్పారు. ఆయన వాదనలు విన్న సుప్రీంకోర్టు.. బీసీసీఐ రాజ్యాంగంలో కీలక మార్పుకు అంగీకరించింది.

WhatsApp channel