Sri Lanka in T20 World Cup Super 12: నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్‌ 12కు శ్రీలంక-sri lanka in t20 world cup super 12 as they beat netherlands ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sri Lanka In T20 World Cup Super 12: నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్‌ 12కు శ్రీలంక

Sri Lanka in T20 World Cup Super 12: నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్‌ 12కు శ్రీలంక

Hari Prasad S HT Telugu
Oct 20, 2022 02:26 PM IST

Sri Lanka in T20 World Cup Super 12: కీలకమైన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్‌ 12కు చేరింది ఆసియా కప్‌ ఛాంపియన్‌ శ్రీలంక. గురువారం (అక్టోబర్‌ 20) జరిగిన మ్యాచ్‌లో 16 రన్స్‌తో విజయం సాధించింది.

నెదర్లాండ్స్ పై విజయంతో సూపర్ 12కు శ్రీలంక టీమ్
నెదర్లాండ్స్ పై విజయంతో సూపర్ 12కు శ్రీలంక టీమ్ (AFP)

Sri Lanka in T20 World Cup Super 12: టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌ 12 స్టేజ్‌కు చేరి ఊపిరి పీల్చుకుంది శ్రీలంక. ఈసారి తొలిరౌండ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే నమీబియా చేతుల్లో ఓడిన ఆసియాకప్‌ ఛాంపియన్‌.. ఆ తర్వాత గ్రూప్‌ ఎలో యూఏఈ, నెదర్లాండ్స్‌లపై గెలిచి సూపర్‌ 12 చేరడం విశేషం. గురువారం (అక్టోబర్‌ 20) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 16 రన్స్‌ తేడాతో విజయం సాధించింది.

ఈ కీలకమైన మ్యాచ్‌లో కుశాల్ మెండిస్‌ 44 బాల్స్‌లోనే 79 రన్స్‌తో రాణించడంతో శ్రీలంక 162 రన్స్‌ చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ కూడా బాగానే పోరాడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 రన్స్‌ చేసింది. ఆ టీమ్‌ ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓడౌడ్‌ 53 బాల్స్‌లోనే 71 రన్స్‌ చేసి లంక టీమ్‌కు చెమటలు పట్టించాడు. అయితే వానిందు హసరంగ 3, తీక్షణ 2 వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ను కట్టడి చేశారు.

మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించిన శ్రీలంక.. సూపర్‌ 12కు చేరుకుంది. యూఏఈ, నమీబియా మధ్య మ్యాచ్‌ తర్వాత ఈ గ్రూప్‌ ఎ నుంచి శ్రీలంకతోపాటు వెళ్లే మరో టీమ్‌ ఏదో తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో నమీబియా గెలిస్తే ఆ టీమే వెళ్తుంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ 3 మ్యాచ్‌లలో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది. అయితే ఆ టీమ్‌ నెట్‌ రన్‌రేట్‌ -0.162గా ఉంది.

నెదర్లాండ్స్‌ కంటే నమీబియా నెట్‌ రన్‌రేట్‌ (1.277) మెరుగ్గా ఉంది. దీంతో యూఏఈపై గెలిస్తే చాలు నమీబియా సూపర్‌ 12కు అర్హత సాధిస్తుంది. ఆసియాకప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ ఫేవరెట్స్‌ షాకిచ్చి విజేతగా నిలిచిన శ్రీలంక ఈ టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే నమీబియా చేతుల్లో ఓడిపోయింది. దీంతో కనీసం తర్వాతి రౌండ్‌కైనా అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది.

అయితే ఆ తర్వాత యూఏఈపై ఘన విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ను కూడా మెరుగుపరచుకుంది. అయితే ఆ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు లంక ప్లేయర్స్‌ చమీర, ప్రమోద్‌ మధుషన్‌, ధనుష్క గుణతిలక గాయపడ్డారు. అయినా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో పోరాడిన లంక.. చివరికి గెలిచి సూపర్‌ 12 స్టేజ్‌కు చేరుకుంది.

WhatsApp channel