Ravi Shastri | ఆడాలంటే ఐపీఎల్‌ నుంచి తప్పుకో.. కోహ్లీకి రవిశాస్త్రీ సలహా-ravi shastri avice for virat kohli and say pull out of ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri | ఆడాలంటే ఐపీఎల్‌ నుంచి తప్పుకో.. కోహ్లీకి రవిశాస్త్రీ సలహా

Ravi Shastri | ఆడాలంటే ఐపీఎల్‌ నుంచి తప్పుకో.. కోహ్లీకి రవిశాస్త్రీ సలహా

Maragani Govardhan HT Telugu
Apr 27, 2022 11:53 AM IST

వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ సలహా ఇచ్చారు. కష్టంగా అనిపిస్తే ఐపీఎల్ నుంచి వైదొలగాలని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే బ్రేక్ తప్పనిసరి అని అన్నారు.

రవిశాస్త్రీ-కోహ్లీ
రవిశాస్త్రీ-కోహ్లీ (Hindustan times)

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి రెండున్నరేళ్లు దాటింది. ప్రదర్శన కూడా అనుకున్న స్థాయిలో చేయడం లేదు. దీంతో అభిమానులు అతడి ప్రదర్శన పట్ల నిరాశ చెందుతున్నారు. కనీసం ఐపీఎల్‌లోనైనా పుంజుకుని పునరాగమనం చేస్తాడని ఆశించారు. కానీ ఇక్కడ కూడా విరాట్‌కు అస్సలు కలిసిరావడం లేదు. రెండు గోల్డెన్ డకౌట్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ 9 పరుగులకే ఔటై మరోసారి నిరుత్సాహపరిచాడు. దీంతో కోహ్లీ ప్రదర్శనపై మాజీ సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ విరాట్‌కు విలువైన సలహా ఇచ్చారు. కాస్త బ్రేక్ తీసుకుని, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు.

"అతడు(కోహ్లీ) నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాబట్టి అతడికి విరామం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. అదే తెలివైన పని. బ్యాలెన్స్ చాలా అవసరం. అంతర్జాతీయ క్రికెట్‌లో 6-7 ఏళ్ల పాటు కొనసాగాలనుకుంటే ఐపీఎల్ నుంచి వైదొలుగడం మంచిది. ఈ రకంగా చూసుకుంటే నువ్వు 14-15 ఏళ్ల ఆడావు. విరాట్‌కే కాదు ఏ ఇతర ఆటగాడికైనా ఇదే విషయం చెబుతాను. భారత్ తరఫున ఆడి రాణించాలనుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గీత గీసుకోవాల్సిందే. టీమిండియా.. అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏకైక సమయం ఐపీఎల్ సీజనే. అప్పుడు కూడా ఆటగాళ్లు విరామం లేకుండా ఆడుతున్నారు. ఆఫ్ సీజన్‌లో విరామం తీసుకోవాలి. కాబట్టి సగం రోజులే ఆడతానని ఫ్రాంఛైజీకి ధైర్యంగా చెప్పండి. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే కఠినమైన కాల్స్ తీసుకోవాలి." అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.

రాజస్థాన్‌-బెంగళూరు మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ అద్భుత అర్దశతకంతో రాజస్థాన్‌ను ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించిందీ జట్టు. ఆరంభం నుంచి పొదుపుగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్(2/19), వానిండు హసరంగా(2/23), మహ్మద్ సిరాజ్(2/30) ఆకట్టుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలోనే 115 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. వరుసగా పెవిలియన్ క్యూ కట్టడంతో రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో కుల్పీప్ సేన్ 4 వికెట్లతో విజృంభించగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రాజస్థాన్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ అంతకుముందు బ్యాటింగ్ లో స్కోరుకే పరిమితం కావాల్సిన జట్టును.. రియాన్ పరాగ్ అర్ధసెంచరీతో రాణించి ఒంటి చేత్తొ గెలిపించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్