Neeraj Chopra: జావెలిన్ విసురుతూ కింద పడిపోయిన ఒలింపిక్ ఛాంపియన్.. వీడియో
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా కువొర్తనే గేమ్స్‌లోనూ అతడు గోల్డ్ మెడల్ సాధించాడు.
కువొర్తనే: అథ్లెటిక్స్‌లో ఇండియాకు తొలి మెడల్ అందించిన అథ్లెట్‌గా గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ పాండే. ఈ మధ్యే తన రికార్డును తానే తిరగరాస్తూ మరో కొత్త నేషనల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. పావో నుర్మి గేమ్స్‌లో జావెలిన్‌ను 89.3 మీటర్ల దూరం విసిరి కొత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఇక ఇప్పుడు కువొర్తనే గేమ్స్‌లో మరోసారి గోల్డ్ మెడల్ గెలిచాడు. తన తొలి అటెంప్ట్‌లోనే 86.69 మీటర్ల దూరం జావెలిన్ విసిరి గోల్డ్ సాధించాడు.
ఈ గేమ్స్‌లో అతని ప్రధాన ప్రత్యర్థులైన 2012 ఒలింపిక్ ఛాంపియన్ కెషోర్న్ వాల్కట్, 2019 వరల్డ్ ఛాంపియన్ అయిన ఆండెర్సన్ పీటర్స్‌ను అధిగమించాడు. అయితే ఫిన్లాండ్‌లో వాతావరణ పరిస్థితులు అథ్లెట్లను పరీక్షించాయి. ఎడతెరపి లేని వర్షం కారణంగా రనప్ కష్టంగా మారింది. దీంతో నీరజ్ చోప్రా కూడా తన అటెంప్ట్స్‌లో ఒకసారి కిందపడిపోయాడు.
ఇది అతనికి మూడో అటెంప్ట్. ఇలా కిందపడినప్పుడు అతని ఎడమ చేతికి కాస్త గాయమైంది. దీంతో ఆ తర్వాత మూడుసార్లు జావెలిన్‌ను విసరకూడదని నిర్ణయించుకున్నాడు. అంతకుముందు రెండో అటెంప్ట్ కూడా ఫౌల్‌గా తేలింది. దీంతో అతడు వేసిన తొలి త్రోనే నీరజ్‌కు గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం విశేషం. నీరజ్ కింద పడినా.. అతనికి ఏమీ కాలేదని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
సంబంధిత కథనం