MS Dhoni about his calmness: ఫీల్డ్‌లో నాకెప్పుడూ ఎందుకు కోపం రాదంటే..: ధోనీ
MS Dhoni about his calmness: ఫీల్డ్‌లో తనకెప్పుడూ ఎందుకు కోపం రాదో చెప్పాడు మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ. అంతేకాదు బయట కూర్చొని సలహాలు ఇవ్వడం చాలా ఈజీ అని కూడా అన్నాడు.
MS Dhoni about his calmness: మిస్టర్ కూల్ అనే పదాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. తన రక్తనాళాల్లో ఎప్పుడూ రక్తానికి బదులు ఐస్ ప్రవహిస్తుందేమో అన్నంత కూల్‌గా అతడు ఫీల్డ్‌లో కనిపిస్తాడు. టీవీల్లో మ్యాచ్ చూసే ప్రేక్షకులు కూడా నరాలు తెగేంత ఉత్కంఠను అనుభవిస్తే.. ఫీల్డ్‌లో కెప్టెన్‌గా అన్నీ చూసుకోవాల్సిన వ్యక్తి ఇంత కూల్‌గా ఎలా ఉంటాడో చాలా మంది అభిమానులకు అర్థం కాని విషయం.
అయితే తన కామ్‌నెస్ వెనుక ఉన్న సీక్రెట్‌ను ఇప్పుడు ధోనీ బయటపెట్టాడు. ఫీల్డ్‌లో ఎప్పుడూ తనకెందుకు కోపం రాదో కూడా వివరించాడు. లివ్‌ఫాస్ట్‌లో మాట్లాడిన ధోనీ.. ఎన్నో విలువైన విషయాలు చెప్పాడు. కోపంతో ఒరిగేదేమీ లేదని, అందుకే తానెప్పుడూ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తానని ఈ కెప్టెన్ కూల్ తెలిపాడు. ఈ సందర్భంగా తన ముందున్న ఆడియెన్స్‌ను మీ బాస్‌లలో ఎవరైనా కూల్ ఉంటారా అని అడిగాడు. కొంతమంది చేతులు పైకెత్తారు.
"అలా అయితే వాళ్లు నటిస్తూ అయినా ఉండాలి లేదంటే నిజంగానే బాస్‌లు అయి ఉండాలి. నిజాయతీగా చెప్పాలంటే మేము ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి తప్పూ చేయకూడదని అనుకుంటాం. మిస్‌ఫీల్డ్, క్యాచ్‌లు డ్రాప్ చేయడం లేదా ఏదైనా ఇతర తప్పులు చేయకూడదనే భావిస్తాం. అందుకే నేను ఏ ప్లేయర్ అయినా క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు లేదా మిస్‌ఫీల్డ్ చేసినప్పుడు అలా ఎందుకు అయిందన్నది ఆలోచిస్తాను. కోపం తెచ్చుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. అప్పటికే స్టాండ్స్‌లో 40 వేల మంది, టీవీ సెట్ల ముందు కోట్ల మంది మ్యాచ్ చూస్తూ ఉంటారు. అందుకే దాని వెనుక కారణమేంటో నేను చూస్తాను" అని ధోనీ వివరించాడు.
"ఒక ప్లేయర్ ఫీల్డ్‌లో వంద శాతం శ్రద్ధగా ఉండి ఆ తర్వాత కూడా క్యాచ్ డ్రాప్ అయిందంటే నాకు ఎలాంటి సమస్య లేదు. అయితే అంతకుముందు ప్రాక్టీస్‌లో అతడు ఎన్ని క్యాచ్‌లు పట్టుకున్నాడో కూడా నేను చూడాలి. ఏదైనా సమస్య ఉండి దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా అన్నదీ చూడాలి. ఓ క్యాచ్ డ్రాప్ అయినప్పుడు నేను ఇవన్నీ ఆలోచిస్తాను. ఆ క్యాచ్ డ్రాప్ వల్ల మ్యాచ్ ఓడిపోవచ్చేమోగానీ ఆ సమయంలో సదరు ఫీల్డర్ కోణంలో ఆలోచించడం అన్నది ముఖ్యం" అని ధోనీ చెప్పుకొచ్చాడు.
"నేను కూడా మనిషినే. మీరందరూ లోపల ఎలా అయితే ఆలోచిస్తారో నేనూ అదే చేస్తాను. మీరు కూడా ఓ మ్యాచ్ ఆడినప్పుడు అలా జరిగితే ఫీలవుతారు. మేము దేశానికి ఆడతాం కాబట్టి ఇంకాస్త ఎక్కువగానే ఫీలవుతాం. అయినా సరే మా భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడానికే ప్రయత్నిస్తాం. బయట కూర్చొని ఓ ప్లేయర్ ఎలా ఆడాలో చెప్పడం సులువే. కానీ అలా చేయడం సులువు కాదు. మేము మా దేశానికి ఆడుతున్నట్లే ప్రత్యర్థులు వాళ్ల దేశానికి ఆడతారు. ఎన్నోసార్లు మ్యాచ్‌లలో ఎగుడుదిగుడులు సహజమే" అని ధోనీ చెప్పాడు.