Hockey | హాకీ నిజంగానే మన జాతీయ క్రీడనా? అసలు ఇండియాకు నేషనల్‌ గేమ్‌ ఉందా?-is hockey really indias national game here is the truth ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hockey | హాకీ నిజంగానే మన జాతీయ క్రీడనా? అసలు ఇండియాకు నేషనల్‌ గేమ్‌ ఉందా?

Hockey | హాకీ నిజంగానే మన జాతీయ క్రీడనా? అసలు ఇండియాకు నేషనల్‌ గేమ్‌ ఉందా?

Hari Prasad S HT Telugu
Dec 23, 2021 12:48 PM IST

Hockey.. ఇండియా జాతీయ క్రీడ ఏది? ఈ సందేహం కూడా మీకు వచ్చే ఉంటుంది. భారతీయులు ఎంతగానో ఆరాధించే క్రికెట్టా? లేదంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పూర్తిగా మనమే ఆధిపత్యం చెలాయించే కబడ్డీనా? అసలు ఇండియాకు జాతీయ క్రీడ అంటూ ఉందా?

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఓ హాకీ అభిమాని ఇలా..
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఓ హాకీ అభిమాని ఇలా.. (ANI)

Hockey.. ఇండియా జాతీయ జంతువు ఏది.. పులి. మరి జాతీయ పక్షి.. నెమలి. సరే జాతీయ క్రీడ.. దీనికి మీ సమాధానం హాకీ అయితే మీరు పొరపాటు పడినట్లే. ఇది నమ్మశక్యం కాకపోయినా నిజం ఇదే. కొన్ని దశాబ్దాలుగా మనం పుస్తకాల్లో, వార్తల్లో మన జాతీయ క్రీడ హాకీ అనే చదువుకున్నాం కదా. మరి హాకీ తప్పుడు సమాధానం ఎలా అవుతుందన్న అనుమానం రావడం సహజం. మరి ఇండియా జాతీయ క్రీడ ఏది? ఈ సందేహం కూడా మీకు వచ్చే ఉంటుంది. భారతీయులు ఎంతగానో ఆరాధించే క్రికెట్టా? లేదంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పూర్తిగా మనమే ఆధిపత్యం చెలాయించే కబడ్డీనా? అసలు ఇండియాకు జాతీయ క్రీడ అంటూ ఉందా? ఈ ప్రశ్న మీకు ఆశ్చర్యం కలిగించినా.. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం.

ఇండియాలో హాకీ చరిత్ర ఇదీ

ఇండియాలో హాకీకి ఘన చరిత్రే ఉంది. అప్పుడెప్పుడో 1850ల్లో బ్రిటీష్ వాళ్లు మన ఆర్మీలోకి హాకీని తీసుకొచ్చారు. సుమారు నాలుగు వందల ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ ఆటను మన వాళ్లు ఓన్‌ చేసుకున్నారు. ఎంతలా అంటే ఈ ఆటలో మొత్తం ప్రపంచాన్నే శాసించేంత. 1850ల నుంచే దేశంలో హాకీ ఆడుతున్నా.. 1925లో ఇండియన్‌ హాకీ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత ఈ ఆటలో ఇండియా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. 1926లో తొలిసారి న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లిన ఇండియన్‌ టీమ్‌ మొత్తం 21 మ్యాచ్‌లు ఆడగా.. 18 గెలిచింది. 
 

ఆ టూర్‌లోనే ఇండియాకు ధ్యాన్‌చంద్‌ అనే ఓ ఆణిముత్యం దొరికింది. తర్వాతి కాలంలో ఆ ప్లేయరే ప్రపంచ అత్యుత్తమ హాకీ ప్లేయర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. 1928 నుంచి ఒలింపిక్స్‌లో హాకీ ఓ రెగ్యులర్‌ ఆటగా మారిన తర్వాత మనదే రాజ్యం. 1928, 1932, 1936లలో హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ సాధించింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1948 నుంచి తిరిగి ఒలింపిక్స్‌ ప్రారంభమైన తర్వాత కూడా మరోసారి హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ ఇండియా సొంతమయ్యాయి. 

ఈసారి స్వతంత్ర భారతదేశంగా త్రివర్ణ పతాకంతో ఈ మెడల్స్‌ సాధించింది. మొత్తం ఒలింపిక్స్‌లో 8 గోల్డ్‌ మెడల్స్‌తో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ హాకీ టీమ్‌గా ఇండియానే నిలిచింది. ధ్యాన్‌చంద్, బల్బీర్‌సింగ్‌ సీనియర్‌, ధన్‌రాజ్‌ పిళ్లైలాంటి దిగ్గజ ఆటగాళ్లను ఇండియన్‌ హాకీ ప్రపంచానికి అందించింది. దీంతో ఈ ఆట పట్ల ఓ ప్రత్యేక అభిమానం ఏర్పడింది. దీనినే ఓ జాతీయ క్రీడగా భావించడం సాధారణమైపోయింది. కానీ హాకీ నిజంగానే జాతీయ క్రీడనా?

నేషనల్‌ గేమ్‌ హాకీ.. ఇదీ నిజం

హాకీ మన జాతీయ క్రీడ కాదు. భారత ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడూ హాకీని జాతీయ క్రీడగా గుర్తించలేదు. నిజం చెప్పాలంటే అసలు ఇండియాకు నేషనల్‌ గేమ్‌ అంటూ ఏదీ లేదు. ఈ విషయం ప్రపంచానికి తెలిసింది గతేడాదే. 2020లో మహారాష్ట్రలోని ఓ స్కూల్‌ టీచర్ ఆర్టీఐలో భాగంగా వేసిన పిటిషన్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హాకీని ఇండియా జాతీయ క్రీడగా ఎప్పుడు గుర్తించారు అని సదరు టీచర్‌ సమాచార హక్కు చట్టంలో భాగంగా ప్రభుత్వాన్ని అడిగారు. 

దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇదీ.. ప్రభుత్వం ఏ క్రీడనూ దేశ జాతీయ క్రీడగా ప్రకటించలేదు. దేశంలోని అన్ని ప్రముఖ క్రీడలనూ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పింది. అయితే సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియన్‌ మెన్స్‌ హాకీ టీమ్‌ బ్రాంజ్‌ మెడల్‌ గెలవడంతో హాకీని అధికారికంగా జాతీయ క్రీడగా గుర్తించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఓ న్యాయవాది అయితే హాకీని జాతీయ క్రీడగా గుర్తించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

 

WhatsApp channel

సంబంధిత కథనం