Cricket Bats | క్రికెట్ బ్యాట్ ఏది సరైనది? తేలికైనదా? బరువైనదా? రూల్స్ ఏంటి?
అప్పుడప్పుడే ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న యువ క్రికెటర్లను ఈ ప్రశ్న తరచూ వేధిస్తూనే ఉంటుంది. బ్యాట్‌ను ఎంత వేగంగా, బలంగా తిప్పగలిగితే బంతి అంత దూరం వెళ్తుంది. ఫలితంగా బౌండరీలు, సిక్సర్లు కొట్టడం సులువవుతుంది. మరి ఈజీగా స్వింగ్ చేయగలిగే బ్యాట్ ఏది?
Cricket Bats.. క్రికెట్ ఆడటానికి రూల్స్ ఉన్నట్లే.. అందులో వాడే బాల్, బ్యాట్ ఎలా ఉండాలన్న వాటికీ కొన్ని రూల్స్ ఉన్నాయి. అయితే ఆ రూల్స్‌ను పాటిస్తూనే భారీగా పరుగులు చేయాలంటే ఓ క్రికెటర్ ఏ బ్యాట్ వాడాలి? బరువైనదా? తేలికైనదా? అప్పుడప్పుడే ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న యువ క్రికెటర్లను ఈ ప్రశ్న తరచూ వేధిస్తూనే ఉంటుంది. బ్యాట్‌ను ఎంత వేగంగా, బలంగా తిప్పగలిగితే బంతి అంత దూరం వెళ్తుంది. ఫలితంగా బౌండరీలు, సిక్సర్లు కొట్టడం సులువవుతుంది.
మరి ఈజీగా స్వింగ్ చేయగలిగే బ్యాట్ ఏది? కచ్చితంగా అది తేలికైన బ్యాటే. అందులో సందేహం లేదు. కానీ బరువైన బ్యాట్‌ను కూడా వేగంగా, బలంగా తిప్పగలిగే సామర్థ్యం ఉంటే.. అప్పుడు తేలికైనదాని కంటే బరువైనదే బెటర్ చాయిస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఏ బ్యాట్ ఎంచుకోవాలన్న డైలమా సహజం. అయితే ఏ బ్యాట్ సామర్థ్యం ఏంటి? స్టార్ క్రికెటర్లు ఎలాంటి బ్యాట్లు వాడతారో తెలుసుకుంటే ఈ ఎంపిక సులువవుతుంది.
క్రికెట్ బ్యాట్ బరువెంత?
ఆధునిక క్రికెట్‌లో సాధారణంగా బ్యాట్లు కిలో నుంచి కిలోన్నర బరువు ఉంటున్నాయి. కొందరు లైట్ వెయిట్ ఉన్నవి, మరికొందరు హెవీ వెయిట్ ఉన్న బ్యాట్లు వాడుతున్నారు. క్రీజులో వాళ్ల స్టాన్స్‌ను బట్టి కూడా ఈ ఎంపికలో మార్పులు ఉంటున్నాయి. నిజానికి క్రికెట్ బ్యాట్ ఎలా ఉండాలి, దాని కొలతలు ఎంత ఉండాలన్నదానిపై నిబంధనలు ఉన్నాయి కానీ బరువుపై పరిమితి లేదు.
ఓ క్రికెట్ బ్యాట్ 38 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు. అలాగే వెడల్పు 4.25 అంగుళాలు, అంచుల మందం 1.56 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదన్న నిబంధన ఉంది. అంపైర్లు ఓ బ్యాట్ గేజ్ ఉపయోగించి నిబంధనల ప్రకారం ఉందో లేదో చూస్తారు. కొలతలపై ఉన్న పరిమితుల ఆధారంగా చూస్తే ఓ క్రికెట్ బ్యాట్ 900 గ్రాముల నుంచి 1.6 కిలోల వరకూ ఉంటుంది.
తేలికైన బ్యాట్ ఎందుకు?
ఓ ప్లేయర్ బాల్‌ను బలంగా బాదడానికి తన టైమింగ్‌నే నమ్ముకుంటే అలాంటి ప్లేయర్ తేలికైన బ్యాట్ ఎంచుకోవచ్చు. తేలికైన బ్యాట్లను బరువైన బ్యాట్ల కంటే 10 శాతం వేగంగా తిప్పొచ్చని ఆస్ట్రేలియా సైంటిస్టులు తేల్చారు. దీనికారణంగా బ్యాట్ నుంచి బంతి 7.5 శాతం ఎక్కువ వేగంతో దూసుకెళ్తుంది. ఇక బ్యాట్ స్వింగ్ స్పీడు.. బంతి వేగాన్ని గంటకు 22 మైళ్ల వరకూ పెంచగలదని మరో అధ్యయనంలో తేలింది. శారీరకంగా అంత బలంగా లేని ప్లేయర్స్ ఈ లైట్ వెయిట్ బ్యాట్లను ఎంచుకోవచ్చు.
బరువైన బ్యాట్ ఎందుకు?
తమ కండ బలాన్ని ఉపయోగించి బంతిని బలంగా బాదాలనుకునే ప్లేయర్స్ బరువైన బ్యాట్ల వైపు మొగ్గు చూపుతారు. తేలికైన బ్యాట్‌తో పోలిస్తే బరువైన బ్యాట్ కాస్త ఎక్కువ పవర్ అందిస్తుంది. ఒక్కోసారి బ్యాట్స్‌మన్ బంతిని సరిగ్గా కొట్టలేకపోయినా అంటే అంచులకు తగిలినా బంతి బౌండరీ వైపు దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా బలంగా ఉండేవాళ్లే ఈ బరువైన బ్యాట్‌వైపు మొగ్గు చూపుతారు.
మరి రెండు బ్యాట్లలో ఏది బెస్ట్?
తేలికైన, బరువైన బ్యాట్లను ఒక వేగంతో తిప్పగలిగే ప్లేయర్ అయితే కనుక బరువైన బ్యాట్ ఎంచుకోవడమే ఉత్తమం. దీనివల్ల అదనపు శక్తి లభిస్తుంది. అయితే చాలా కొద్ది మంది ప్లేయర్స్‌కు మాత్రమే ఇది సాధ్యం. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ మాటల్లో చెప్పాలంటే ఎలాంటి ప్లేయర్‌కైనా తేలికైన బ్యాటే ఉత్తమం. అయితే ఓ బ్యాట్స్‌మన్ బ్యాట్‌ను పట్టుకునే విధానం, అతని టెక్నిక్, స్టాన్స్‌పై అతను వాడే బ్యాట్ బరువు ఆధారపడి ఉంటుంది. అందుకే బ్యాట్‌ను కొనే ముందు అందుబాటులో ఉన్న వాటిని స్వింగ్ చేసి చూడటం ఉత్తమం. ఏ బ్యాట్‌నైతే మీరు సునాయాసంగా తిప్పగలుగుతున్నారో అది తీసుకుంటే.. సులువుగా పరుగులు చేయగలుగుతారు.
కలపతో చేసిన బ్యాటే వాడాలా?
కచ్చితంగా కలపతో చేసిన బ్యాటే వాడాలన్న నిబంధన ఉంది. నిజానికి 1979 వరకూ ఇలాంటి రూలేమీ క్రికెట్‌లో లేదు. అయితే ఆ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ డెన్నిస్ లిల్లీ అల్యూమినియంతో చేసిన బ్యాట్‌తో వచ్చాడు. తన ఫ్రెండ్ ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాట్ అది. మొదట్లో ఈ బ్యాట్‌పై ఇంగ్లండ్ ప్లేయర్స్ అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా.. ఓ బలమైన షాట్‌తో లిల్లీ ఓ బంతిని బౌండరీకి తరలించిన తర్వాత బంతి ఆకారం దెబ్బతినడం గమనించారు. దీంతో ఇంగ్లండ్ ప్లేయర్స్ ఆ అల్యూమినియం బ్యాట్ వద్దని వారించారు. అప్పటి వరకూ అలాంటి బ్యాట్ వాడొద్దన్న రూలేమీ లేకపోవడంతో అంపైర్లు కూడా గట్టిగా అభ్యంతరం చెప్పలేకపోయారు. అయితే ఎలాగోలా అతన్ని ఒప్పించి చివరికి చెక్కతో చేసిన బ్యాట్‌నే వాడేలా చేశారు. ఆ తర్వాతే కచ్చితంగా చెక్కతో చేసిన బ్యాటే వాడాలన్న నిబంధన తీసుకొచ్చారు.
స్టార్ ప్లేయర్స్.. బ్యాట్స్
క్రికెట్‌లో స్టార్ ప్లేయర్స్‌గా ఎదిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రకమైన బ్యాట్ వాడటానికి ఇష్టపడ్డారు. ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ తేలికైన బ్యాట్‌వైపే మొగ్గు చూపాడు. అతని బ్యాట్ బరువు కేవలం కిలో మాత్రమే ఉండేది. అలాగే ఇంగ్లండ్ గ్రేట్ లెన్ హటన్ కూడా తేలికైన బ్యాటే వాడాడు. ఆధునిక క్రికెట్‌లో స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ లాంటి వాళ్లు 1.3 కిలోల బరువున్న తేలికైన బ్యాట్ వాడుతున్నారు. ఇక క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అయితే బరువైన బ్యాట్ వాడేవాడు. అతని బ్యాట్ బరువు 1.54 కిలోలు ఉండేది. అలాగే విండీ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, క్రిస్ గేల్‌లాంటి వాళ్లు కూడా బరువైన బ్యాట్ వాడేవారు.
సంబంధిత కథనం