నన్నెవరూ పట్టించుకోని సమయంలో హార్దిక్‌ ఓపెనింగ్‌ ఛాన్స్‌ ఇచ్చాడు: సాహా-hardik believed in me and given me a chance to open says wriddhiman saha ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  నన్నెవరూ పట్టించుకోని సమయంలో హార్దిక్‌ ఓపెనింగ్‌ ఛాన్స్‌ ఇచ్చాడు: సాహా

నన్నెవరూ పట్టించుకోని సమయంలో హార్దిక్‌ ఓపెనింగ్‌ ఛాన్స్‌ ఇచ్చాడు: సాహా

Hari Prasad S HT Telugu

వృద్ధిమాన్‌ సాహా.. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీమిండియాలో చోటు కోల్పోవడం.. తర్వాత జర్నలిస్ట్‌ బెదిరింపులు, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో విభేదాలు, ఆ టీమ్‌కు ఇక ఆడనని చెప్పడం వంటివి సంచలనం రేపాయి.

గుజరాత్ టైటన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (PTI)

కోల్‌కతా: వృద్ధిమాన్‌ సాహా కొన్నాళ్ల కిందటి వరకూ ఇండియన్‌ టెస్ట్ టీమ్‌లో ఫస్ట్ ఛాయిస్‌ వికెట్‌ కీపర్‌. అయితే ఆ స్థానాన్ని రిషబ్‌ పంత్ సొంతం చేసుకున్నాడు. ఇక టీమిండియాకు ఇప్పట్లో తన పేరును పరిశీలించబోమని సెలక్టర్లు కూడా చెప్పేశారు. అదే సమయంలో ఇటు బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో విభేదాలు కూడా కొనసాగాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్‌ అతనిలో కొత్త ఊపిరులూదింది.

ఐపీఎల్‌ వేలంలో తొలి రోజు అతన్ని ఎవరూ కొనుగోలు చేయకపోయినా, రెండో రోజు చివర్లో గుజరాత్‌ అతన్ని రూ.1.9 కోట్లకు తీసుకుంది. అయితే లీగ్‌ ప్రారంభమైన తర్వాత సాహా స్థానంలో మాథ్యూ వేడ్‌కే ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. దీంతో తొలి ఐదు మ్యాచ్‌లకు సాహా దూరంగానే ఉన్నాడు. అయితే వేడ్‌ విఫలమవడం సాహాకు కలిసి వచ్చింది. ఒక రకంగా అతన్ని అనుకోని అదృష్టం వరించింది. తర్వాత గుజరాత్‌ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి 11 మ్యాచ్‌లలో 317 రన్స్‌ చేశాడు. అందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఈ సందర్భంగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తనపై ఎంతటి నమ్మకం ఉంచాడో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు సాహా. "అన్ని ఫ్రాంఛైజీలు వదిలేసిన ప్లేయర్స్‌పై హార్దిక్‌ పాండ్యా నమ్మకముంచాడు. నన్ను కూడా తొలి రోజు ఎవరూ కొనలేదు. తర్వాత సీజన్‌ మొదట్లోనే ఛాన్స్‌ ఇవ్వలేదు. అప్పుడు హార్దిక్‌ నా దగ్గరికి వచ్చి ఓపెనర్‌ బాధ్యతలు తీసుకోమన్నాడు. నా ఆత్మవిశ్వాసం తిరిగొచ్చింది. అతని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నాకు సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాను. నన్ను నేను నిరూపించుకునే అవకాశం అతడు నాకిచ్చాడు. అతని మేలు ఎప్పటికీ మరచిపోలేను. నిజానికి టీమ్‌లోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఛాంపియన్‌ టీమ్‌ కావాలంటే అదే అవసరం" అని బెంగాలీ న్యూస్‌పేపర్‌ ఆనంద్‌బజార్‌ పత్రికతో సాహా అన్నాడు.

హార్దిక్‌లో తాను ఎంతో మార్పు చూశానని కూడా సాహా చెప్పాడు. టీమ్‌లోని ప్రతి ఒక్కరినీ ఎలా చూసుకోవాలో హార్దిక్‌కు తెలుసని అన్నాడు. ఫీల్డ్‌లో ఎవరైనా పొరపాటు చేసినా హార్దిక్‌ తన సహనం కోల్పోలేదని సాహా తెలిపాడు. "ఓ టీమ్‌ను ఎలా మేనేజ్‌ చేయాలో హార్దిక్‌కు తెలుసు. ఓ కెప్టెన్‌గా అందరితోనూ కలిసిపోవడం, వాళ్ల ఆటను అర్థం చేసుకోవడం ముఖ్యం. హార్దిక్‌లో దీనికి కొదవ లేదు. అతడు చాలా మారాడు" అని సాహా చెప్పాడు.

సంబంధిత కథనం

టాపిక్