IND vs WI: ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ గెలుపు.. భారత్‍కు వరుసగా రెండో ఓటమి.. 12ఏళ్ల తర్వాత ఇలా..-cricket breaking news ind vs wi 2nd t20 west indies beat team india by 2 wickets in second t20 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Wi: ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ గెలుపు.. భారత్‍కు వరుసగా రెండో ఓటమి.. 12ఏళ్ల తర్వాత ఇలా..

IND vs WI: ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ గెలుపు.. భారత్‍కు వరుసగా రెండో ఓటమి.. 12ఏళ్ల తర్వాత ఇలా..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 07, 2023 12:20 AM IST

IND vs WI: రెండో టీ20లో టీమిండియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‍లో 2-0 ఆధిక్యంలో నిలిచింది విండీస్.

హార్దిక్ పాండ్యా బౌల్డ్ అయిన దృశ్యమిది
హార్దిక్ పాండ్యా బౌల్డ్ అయిన దృశ్యమిది (AP)

IND vs WI: టీమిండియా వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. వెస్టిండీస్‍తో జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. విండీస్ చేతిలో భారత్ వరుసగా రెండు అంతర్జాతీయ మ్యాచ్‍లు ఓడిపోవడం 12 ఏళ్లలో ఇదే తొలిసారి. గయానా వేదికగా నేడు (ఆగస్టు 6) జరిగిన రెండో టీ20లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో పరాజయం చెందింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‍లో వెస్టిండీస్ 2-0తో ఆధిక్యాన్ని పెంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. భారత యువ ప్లేయర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (41 బంతుల్లో 51 పరుగులు) తొలి అర్ధశతకంతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (27) పర్వాలేదనిపించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, అల్జారీ జోసెఫ్, అకీల్ హొసేన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో 155 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో హర్దిక్ పాండ్యా మూడు, యజువేంద్ర చాహల్ రెండు, అర్షదీప్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత స్పిన్నర్ చాహల్ 16వ ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడం.. అదే ఓవర్లో మరో రనౌట్ కావటంతో మ్యాచ్‍ మలుపు తిరిగినా.. చివరికి ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ గెలిచింది. మ్యాచ్ ఎలా సాగిందంటే..

ఈ మ్యాచ్‍లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది టీమిండియా. భారత ఓపెనర్ శుభ్‍మన్ గిల్ (7) త్వరగా ఔటైనా.. ఇషాన్ కిషన్ (27) నిలకడగా ఆడాడు. నాలుగో ఓవర్లో విండీస్ ప్లేయర్ మేయర్స్ వేసిన అద్భుతమైన త్రోకు భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (1) రనౌటై నిరాశపరిచాడు. అనంతరం తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. విండీస్‍పై ఎదురుదాడి చేశాడు. ఇషాన్‍తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, పదో ఓవర్లో షెఫర్డ్ బౌలింగ్‍లో ఇషాన్ ఔటయ్యాడు. అనంతరం సంజూ శాంసన్ (7) కూడా ఎక్కువ సేపు నిలువలేదు.

తిలక్ వర్మ మాత్రం నిలకడగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే 50 పరుగులకు చేరి తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్‍లోనే అదరగొట్టాడు. అయితే, అర్ధ శతకం చేసిన వెంటనే భారీ షాట్ ఆడబోయి తిలక్ ఔటయ్యాడు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (24), అక్షర్ పటేల్ (14) వేగంగా ఆడలేకపోవటంతో టీమిండియా 152 పరుగులకే పరిమితం అయింది. చివర్లో రవిబిష్ణోయ్ (8 నాటౌట్), అర్షదీప్ సింగ్ (6 నాటౌట్) పర్వాలేదనిపించారు.

లక్ష్యఛేదనలో వెస్టిండీస్ ఆరంభంలో తడబడింది. బ్రెండన్ కింగ్ (0)ను భారత కెప్టెన్ హార్దిక్ తొలి బంతికే ఔట్ చేశాడు. జాన్సన్ చార్లెస్ (2), కైల్ మేయర్స్ (15) త్వరగా ఔటయ్యారు. అయితే, ఆ తర్వాత నికోలస్ పూరన్ విశ్వరూపం చూపాడు. ఎదురుదాడికి దిగాడు. సిక్సర్లు, ఫోర్ల మోత మోగించాడు. 29 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. కాసేపు రాణించిన విండీస్ కెప్టెన్ రావ్మన్ పావెల్ (21)ను పాండ్యా ఔట్ చేశాడు. పూరన్ కాసేపటికి ఔటైనా అప్పటికే చేయాల్సిన విధ్వంసం చేశాడు. 16వ ఓవర్లో భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్.. షిమ్రన్ హిట్మైర్ (22), జేసన్ హౌల్డర్ (0)ను ఔట్ చేసి మ్యాచ్‍ను మలుపు తిప్పాడు. అదే ఓవర్లో రొమారియో షెఫర్డ్ (0) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ తిరిగి మ్యాచ్‍లోకి వచ్చింది. అయితే, చివర్లో అకీల్ హొసేన్ (16 నాటౌట్), అల్జారీ జోసెఫ్ (10) నిలకడగా ఆడి వెస్టిండీస్‍ను గెలిపించారు.