Ind vs SA: రెండు రికార్డులకు చేరువలో ఉన్న భువనేశ్వర్‌ కుమార్‌-bhuvaneshwar kumar eye on 2 massive reocrds ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa: రెండు రికార్డులకు చేరువలో ఉన్న భువనేశ్వర్‌ కుమార్‌

Ind vs SA: రెండు రికార్డులకు చేరువలో ఉన్న భువనేశ్వర్‌ కుమార్‌

Hari Prasad S HT Telugu
Jun 14, 2022 04:56 PM IST

సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20ల్లో టీమిండియా తరఫున రాణించిన ఏకైక బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. తన ఒకప్పటి రిథమ్‌ను తిరిగి సంపాదించిన భువీ.. సఫారీ బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నాడు.

రెండు రికార్డులపై కన్నేసిన భువనేశ్వర్ కుమార్
రెండు రికార్డులపై కన్నేసిన భువనేశ్వర్ కుమార్ (ANI)

విశాఖపట్నం: బుమ్రా, షమిలాంటి బౌలర్లు లేని సమయంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో టీమిండియా పేస్‌ బౌలింగ్ భారాన్ని మోస్తున్నాడు భువనేశ్వర్‌ కుమార్‌. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా కాస్త ఇబ్బంది పడింది అంటే అది భువీ బౌలింగ్‌లోనే. రెండు మ్యాచ్‌లలోనూ పవర్‌ ప్లేలోనే సఫారీ బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీశాడు. అయితే అతనికి ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడింది.

టీమిండియాలోకి వచ్చిన తర్వాత గాయాల కారణంగా తరచూ బయటకు వెళ్తూ వస్తున్న భువీ.. ఈ సిరీస్‌లో మాత్రం తనపై ఉంచిన అంచనాలను అందుకున్నాడు. రెండో మ్యాచ్‌లో అయితే అతడు 4 ఓవర్లలో కేవలం 13 రన్స్‌ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికాపై అతడు తీసుకున్న వికెట్ల సంఖ్య 13కి చేరింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలవాలంటే అతడు మరో మూడు వికెట్లు తీసుకోవాలి.

ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్‌ బౌలర్‌ డ్వేన్‌ బ్రేవో, ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ల పేరిట ఉంది. ఇక ఇదే కాకుండా మరో రికార్డు కూడా భువీని ఊరిస్తోంది. ప్రస్తుతం భువనేశ్వర్‌ టీ20ల్లో 63 వికెట్లు తీసుకున్నాడు. అందులో 33 వికెట్లు పవర్‌ప్లేలో వచ్చినవే కావడం విశేషం. టీ20ల్లో పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన విండీస్‌ బౌలర్‌ శామ్యూల్‌ బద్రీతో భువీ ఇప్పుడు సమమయ్యాడు.

మరొక్క వికెట్‌ పవర్‌ప్లేలో తీస్తే చాలు.. రికార్డు భువనేశ్వర్‌ సొంతమవుతుంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు ఓడిన టీమిండియా.. విశాఖపట్నంలో మంగళవారం జరగబోయే మూడో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌పై ఆశలు నిలుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి బౌలింగ్ భారం భువీపైనే ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్