Donation Rules: ఈ వస్తువులు దానం చేశారో కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే..
Donation Rules: కులమతాలతో సంబంధం లేకుండా దాతృత్వం అనేది గొప్ప గుణం. అయితే దానం చేసే వాళ్ళు ఎటువంటి వాటిని చేయాలి, వేటిని చేయకూడదు అనే విషయం తప్పకుండా తెలుసుకుని తీరాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల అనార్థాలు జరుగుతాయి.
దానం చేసే గుణం చాలా గొప్పది. అది అందరికీ రాదు. దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని చాలా మంది నమ్మకం. అందుకే పురాణాల దగ్గర నుంచి దానాధర్మాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అన్నీ దానాలలోకెల్లా అన్నదానం మిన్న అంటుంటారు. ఆకలిగా ఉన్న వారి ఆకలి తీర్చడం వల్ల మేలు జరుగుతుందని అంటారు.
దానం చేసే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మేలు కంటే ఎక్కువ కీడు జరుగుతుంది. దీని వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి వస్తువులు దానం చేయడం వల్ల నష్టం జరుగుతుందో మీకు తెలుసా?
ఉప్పు
మా ఇంట్లో ఉప్పు అయిపోయింది కాస్త ఉంటే పెడతారా పిన్నీ గారు అంటూ ఇళ్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇంటికి రావడం చూస్తూనే ఉంటారు. కానీ ఉప్పు అసలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయడం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడని అంటారు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదని కొందరు చెప్తుంటారు.
చీపురు
చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కానీ నిజానికి చీపురు లక్ష్మీ దేవితో సమానం. అందుకే దానికి ఎంతో విలువ ఇస్తారు. కొందరు ఇల్లు మారుతూ కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు ముందుగా చీపురు తమతో పాటు తీసుకుని వెళతారు. చీపురు ఇతరులకి ఇవ్వడం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్క. ఇలా చేస్తే మీ ఇంట్లో ధనం నిలవదు. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి.
పదునైన వస్తువులు
కత్తి, కత్తెర, చాకు వంటి పదునైన వస్తువులు ఎప్పుడు దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయడం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివిటీని ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది.
దుస్తులు
ఎంతో మంది పేదలకి వస్త్ర దానం చేస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. ఇది మంచిదే కానీ చిరిగిన, పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్త్రాలు ఇవ్వడం వల్ల మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుంది. అలాగే మనం వాడుకునే ఖర్చిఫ్(చేతి రుమాలు) కూడా దానం చేయకూడదు.
నువ్వుల నూనె
నువ్వులు, ఆవనూనె పొరపాటున కూడా దానం చేయవద్దు. వీటిని దానం చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుందని చెబుతుంటారు. అది మాత్రమే కాదు మిగిలిపోయిన నూనె, పాడైపోయిన నూనె అసలు దానం చెయ్యరాదు.
ఆహారం
అన్నదానం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారు. కానీ పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకి పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని అంటారు.
ఆక్వేరియం
నీటిలో కూడిన ఆక్వేరియం వంటి వాటిని బహుమతులుగా ఇస్తుంటారు. కానీ నీటితో ఉండేటువంటి వస్తువులు ఇవ్వడం వల్ల మీ అదృష్టం స్వీకరించే వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఆర్థిక నష్టాలు తరచుగా ఇబ్బందులు పెడతాయి.