Navaratri 9th Day : నవరాత్రులలో తొమ్మిదో రోజు.. శ్రీ మహిషాసుర మర్ధని దేవి అవతార విశిష్టత
Navaratri 9th Day : శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారు మహిషాసుర మర్ధని దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం రోజు మహర్షవమిగా ప్రాశస్త్యం పొందిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్దనీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తూ ఉంటుంది.
మహిషాసురుడనే రాక్షసుడు శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొంది, ఇంద్రుడిని ఓడించి, దేవతకు కూడా హాని తలపెట్టడంతో అందరూ శివకేశవుల దగ్గరకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. సమస్త దేవతల నుండి శక్తి వెలువడి, ప్రత్యేకమైన ఉగ్రమూర్తిగా రూపొంది, మహిషాసురుని యుద్ధానికి ప్రేరేపించి దుష్టశక్తిని అణచదలచింది. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా పోరు సలిపి, ఆశ్వయుజ శుక్ల నవమి దినమున ఆ రాక్షసుని అంతమొందించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించింది. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈరోజు సిద్ధి ధాత్రిగా పూజిస్తారు.
దుర్గామాత తొమ్మిదో శక్తిరూపం సిద్ధిధాత్రి. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పరమేశ్వరిని మహిషాసుర మర్ధని అవతారంలో అనేక విధాలుగా పూజించి, జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధని శైలసుతే...అని కొలుస్తారు. ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం నివేదన చేసి శాంతింపచేస్తారు. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు ధరించవలసిన వర్ణం కాఫీ రంగు.