మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర, మహత్యం ఏంటి?-mangalagiri panakala lakshmi narasimha swamy temple history and significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర, మహత్యం ఏంటి?

మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర, మహత్యం ఏంటి?

HT Telugu Desk HT Telugu
Jun 19, 2024 07:00 PM IST

మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎలా ఏర్పడింది. అక్కడి వింతలు, విశేషాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి (pinterest)

తెలుగు మాట్లాడే ప్రతీ వ్యక్తికి, తెలుగు నేలపై నివసించే ప్రతీ మానవుడు పూజించవలసిన దైవం లక్ష్మీ నరసింహస్వామి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన అవతారాలలో శ్రీరామ అవతారం ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో జరిగితే కృష్ణావతారం ఉత్తర ప్రదేశ్‌లో మధుర, బృందావనం, ద్వారకలో జరిగితే లక్ష్మీ నరసింహ అవతారాలు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఏర్పడటం చేతనే తెలుగువారందరు వారి కష్టాలు తొలగడానికి పూజించవలసిన దైవం లక్ష్మీ నరసింహస్వామి అని చిలకమర్తి తెలిపారు.

ఏ వ్యక్తి అయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే జాతకంలో కుజదోషం, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారో అలాగే స్త్రీలు సౌభాగ్యాన్ని పొందాలనుకుంటున్నారో వారికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం, ఆరాధన చేత శుభ ఫలితాలు పొందుతారని చిలకమర్తి తెలిపారు.

మహావిష్ణువు ప్రముఖ ఆలయాలు

దేశంలోని శ్రీమహావిష్ణువు నెలకొని ఉన్న 8 ముఖ్యమైన ప్రదేశాలు... 1. శ్రీరంగం 2. శ్రీముష్నం 3. నైమిశం 4. పుష్కరం 5. సాలగామాద్రి 6. తోతాద్రి 7. నారాయణాశ్రమం 8. వేంకటాద్రి. ఈ ముఖ్యమైన ప్రదేశాలలోని తోతాద్రియే ప్రస్తుత వ్యవహారనామకంగా పిలవబడుతున్న మంగళగిరి.

శ్రీ మహాలక్ష్మీదేవి ఈ కొండపై తపమాచరించినందువల్ల ఈ కొండ అత్యంత పవిత్రమైన కొండ అయినది. మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ఒకటి కొండమీద పానకాల నరసింహస్వామి, రెండు కొండ పాదం వద్ద ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మూడు కొండపైన చివరగా ఉన్న గండాల నరసింహస్వామి.

కొండ చివరనున్న ఈ అలయంలో పూజలు నిర్వహించబడవు. కానీ నిత్యం ఆవు నేతి దీపం వెలిగించబడుతుంది. ఈ దీపం చుట్టుప్రక్కల గ్రామాలలో నివాసం ఉండే ప్రజలకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో దీపారాధన చెయ్యడం ద్వారా సకల శుభాలు, కోరికలు నెరవేరుతాయని చిలకమర్తి తెలిపారు.

ఈ కొండని అకాశం నుండే కాక ఏ దిక్కు నుండి చూసినా ఏనుగు ఆకారంలో కనబడుతుంది. ఈ కొండ ఈ ఆకారంలో కనిపించటానికి కారణం ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం హస్వశ్ళంగి అనే రాజకుమారుడు తన దేహంలోని అన్ని అనారోగ్యాలు తొలగి తిరిగి సంపూర్ణవంతమైన ఆరోగ్యంతో ఉండాలనే కోరికతో ఎన్నో పుణ్యప్రదేశాలను సందర్శించుకుంటూ చివరగా మంగళగిరి ప్రాంతానికి వచ్చి ఇక్కడే 8 సంవత్సరాల పాటు స్వామికి పూజలు నిర్వహిస్తూ ఉండిపోయాడు.

దేవతలు చెప్పగా ఈ స్థలంలో ఉన్న శ్రీమహావిష్ణువుని పూజించసాగాడు. కొంతకాలం తర్వాత అతని తండ్రి అతడిని తిరిగి రాజ్యానికి రమ్మని కోరాడు. కానీ హస్వశ్ళంగి నిరాకరించాడు. తండ్రి మరింత బలవంతం పెట్టడంతో శ్రీ మహావిష్ణువుకి (అనగా పానకాల లక్ష్మీ నరసింహునికి) గొడుగుగా ఉండాలని తన శరీరాన్ని ఏనుగు ఆకారానికి మలచుకున్నాడు.

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విశేషాలు

శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండ మీద ఉంది. క్రింద నుంచి మెట్ల మార్గం ద్వారా కొండ మీద ఆలయాన్ని చేరుకుని స్వామిని సందర్శించుకోవచ్చు. ఇంకా రోడ్డు మార్గం ద్వారా కూడా కొండ మీద అలయాన్ని దర్శించవచ్చు. ఆలయం వద్ద రాతిపై విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయల వారి విగ్రహం చూడవచ్చు. నడక మార్గంలో మహాప్రభు చైతన్య పాదముద్రలు, ఒక గుహలో లక్ష్మీనరసింహస్వామి నోటిని తెరిచిన ముఖంలో ఉన్న స్వామిని దర్శించుకోవచ్చు.

దేవాలయం ముందు 1955 సంవత్సరంలో నిలబెట్టబడిన ధ్వజస్థంభాన్ని చూడవచ్చు. కొండపైన స్వామి ఆలయానికి వెనుక వైపున శ్రీ రాజ్యలక్ష్మీదేవి అలయం ఉన్నది. ఆమెకి పశ్చిమ దిక్కున ఉన్న శ్రీ స్వామివారి ఆలయం పైన లక్ష్మీ అమ్మవారి ఆలయం ప్రక్కన ఉన్న గుహ నుండి కృష్ణానదీ తీరంలో ఉన్న ఉండవల్లి గుహలకి చేరవచ్చు. దేవాలయానికి సిద్ధిరాజు, రాజయ్య అను ఇద్దరు దేవరలు చుట్టుపక్కల ఉన్న 28 పల్లెలలోని 200 కుంచిళ్ళ స్థలమును శ్రీ వారికి ఈనాములుగా ఇచ్చినారు.

మెట్ల మార్షాన్ని శ్రీ చెన్నాప్రగడ బలరామదాసుల వారు 1890 సంవత్సరములో నిర్మించారు. స్టలపురాణానికి వస్తే స్వయంభువుగా వెలసిన హరి అనగా మహా విష్ణువు అవతారంగా ఉన్నది. ఈ స్వామికి సుదర్శన నరసింహస్వామి అని ఇంకొక పేరు. నముచి అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి పొడి లేదా తడి ఆయుధములతో చావు లేకుండా బ్రహ్మదేవుని వద్ద వరాన్ని పొందాడు.

వరగర్వంతో ఇంద్రాది దేవతలను హింసించసాగాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఇంద్రుడు నముచి బలగాన్ని నాశనం చేయసాగాడు. నముచి సూక్ష్మాకారంలో ఒక గుహలో దాగి యుండగా ఇంద్రుడు శ్రీమహావిష్ణువు సుదర్శనమును సముద్ర రూపంలో గుహలోకి పంపగా సుదర్శనము మధ్యలో నరసింహుని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు తన నిశ్వాసాగ్నిచేత సముచిని సంహరించాడు. ఈవిధంగా ఇక్కడి నారసింహునికి సుదర్శన నారసింహుడనే నామం వచ్చిందని చిలకమర్తి తెలిపారు.

ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతించమని దేవతలు ప్రార్థించి ఆ స్వామికి అమృతాన్ని ఇవ్వగా అది స్వీకరించి స్వామి శాంతించారు. ఇది కృతయుగంలో జరిగిన గాథ. ఆ తర్వాత శ్రేతాయుగంలో నేతిని స్వీకరిస్తూ, ద్వాపరయుగంలో పాలన సేవిస్తూ, కలియుగంలో పానకాన్ని సేవిస్తూ నేను శాంతచిత్తుడనై తృప్తిపడతానని తన భక్తులకి తెలుపుతాడు. అందువలననే కలియుగంలో స్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా పిలవబడుతున్నాడు.

త్రేతాయుగంలో భక్తులు పాపాలను పోగొట్టుకుని ముక్తిని పొందే మార్గాన్ని చూపమని ఇంద్రుడిని ప్రార్ధించగా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సేవించిన స్వర్గాన్ని పొందెదరని వారికి తెలుపుతాడు.

కృతయుగంలో పాపులు చాలా తక్కువమంది. మంగళగిరి స్వామిని ప్రార్ధించడం వల్లనే పాపాలు పోగొట్టుకుని స్వర్గాన్ని చేరతారని స్వయంగా యమధర్మరాజు తెలుపుతాడు. విశ్వం అరంభం నుండే మంగళగిరి అని పిలవబడుతున్న ప్రదేశం ఉనికిని సంతరించుకుని ఉన్నది. కృతయుగంలో అంజానాద్రిగా, శ్రేతాయుగంలో తోతాద్రిగా, ద్వాపరయుగంలో ముక్త్యాద్రిగా, కలియుగంలో మంగళాద్రిగా అపై మంగళగిరిగా భాసిల్లుతూ భక్తుల పాపాల్ని కడిగివేస్తుంది.

కృతయుగంలో వైఖానస మహర్షి స్వామి మూర్తిని పూజించారు. దేవాలయంలో ఈ మహర్షి ప్రతిమ ఈ రోజుకీ పూజించబడుతోంది. శ్రీరాముడు అవతార సమాప్తి సమయంలో వైకుంఠానికి తిరిగి వెళుతూ ఆంజనేయుడిని ఈ ప్రదేశంలోనే ఉండి స్వామి కృపను పొంది చిరంజీవిగా ఎల్లప్పుడూ ఇక్కడ ఉండి పొమ్మని దీవించాడు. ఆ తరువాత ఆంజనేయుడు ఈ గిరికి క్షేత్రపాలకుడిగా ఉంటానని ప్రతిజ్ఞ తీసుకున్నాడని చిలకమర్తి తెలిపారు.

పానకాల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువు. గర్భగుడిలో ఈయన మూర్తి కనపడదు. తెరిచిన నోటితో ఉన్న ముఖాన్ని దర్శించుకోవచ్చు. దేవుని ముఖానికి వెండితొడుగు ఉంటుంది. ఆలయం మధ్యాహ్నం వరకు మాత్రమే తెరచి ఉంటుంది. రాత్రి సమయంలో దేవతల పూజలను స్వామి అందుకుంటారని భక్తుల విశ్వాసం. స్వామికి పానకాన్ని శంఖం ద్వారా అర్చిస్తారు. పానకాన్ని శంఖంతో స్వామికి సమర్పించినపుడు కొన్ని శంఖముల పానకాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు.

స్వామి వారు తృప్తి చెందినపుడు శంఖములోనికి పానకము వెనక్కి వస్తాయి. ఆ శంఖములోనికి వచ్చిన పానకమును మిగిలిన పానకములో కలిపి భక్తులకు ప్రసాదముగా ఇచ్చెదరు. స్వామి స్వీకరిస్తున్నట్లుగా గుటకల శబ్దం భక్తులకు వినిపించడం ఒక అద్భుతమైన విషయం. ఈ విధానం ఎంతమంది భక్తులకు పానకాన్ని సమర్పించినా జరుగుతుంది. భక్తులు ఎంత పానకం పోసినా సగం మాత్రమే స్వీకరించి మిగిలినది భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏమనగా బెల్లంతో తయారయ్యే ఈ పానకం స్వామి ముఖాన్ని తడిపినా కూడా ఒక్క ఈగ కూడా అక్కడికి 'ప్రవేశించదు. పానకాన్ని స్వామికి సమర్పించటానికి కారణం గూర్చిన కథ మరొకటి వ్యాప్తిలో ఉంది.

పెద్దబజారులోని లక్ష్మీనారాయణ ఆలయం, ఆంజనేయ మందిరాలలో నిత్యం పూజలు నిర్వహించబడతాయి. శ్రీలక్ష్మీనరసింహనికి ఫాల్గుణ శుద్ద షష్టి నుండి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. వీటిని మొట్ట మొదట శ్రీ కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడి అధ్వర్యంలో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుచే ప్రారంభించబడ్డాయని తెలుస్తోంది. ప్రస్తుతం 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

చతుర్దశి రోజు శాంత నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవిల కళ్యాణోత్సవం వైభవంగా జరపబడుతోంది. ఈ ఉత్సవం ముందు రోజు చెంచులు తమ బిడ్డ చెంచులక్ష్మిని స్వామి వివాహమాడుతున్నాడనే ఆనందాన్ని పండుగగా జరుపుకుంటారు. ఆ నాటి రాత్రి స్వామి శేషవాహనంపై ఎదుర్మోల ఉత్సవంలో పాల్గొంటారు. మర్నాటి కళ్యాణం తర్వాత పూర్ణిమనాడు హోలీ ఉత్సవాన్ని భారతీయులు వైభవంగా జరుపుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీరామనవమి, హనుమజ్జయంతి, నరసింహజయంతి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయి. మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రం నుంచి ఈశ్వరుడు రథంపై ఊరేగుతారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర గాలిగోపురం తెరవబడుతుంది.

మంగళగిరిలో క్షీరవృక్షం అత్యంత మహిమాన్వితమైనది. ఈ వృక్షాన్ని పూజించిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ వృక్షానికి ఒక గాధ కలిగి ఉంది. సంతానం లేని సశిబండి అనే రాజు నారదుడు చెప్పడంతో రాజ్యాన్ని వీడి సంతానం కోసం భూమి యందున్న పుణ్యక్షేత్ర సందర్శనార్థం తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న సశిబండి భార్య కోపంతో నారదుడ్ని మంగళగిరి కొండపై క్షీరవృక్షంగా మారి సంతానం లేనివారికి సంతానాన్ని అనుగ్రహించమని, వారి పాపాల్ని తొలగించమని శాపం ఇచ్చింది. ఆ శాపాన్ని నారదుడు వరంగా తలచి ఆమె మాట విని అక్కడ క్షీరవృక్షంగా మారి నిలబడుతున్నాడు. నేటికీ ఈ వృక్షం భక్తులచే పూజలందుకుని కోరిన వరాలను వారికి అందిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner