Nandi Bull Idol at Home। శివలింగం ముందు నంది తప్పక ఉండాలి.. విడిగా ఉంచేందుకు నియమాలు!
Nandi Bull Idol at Home: శివుని ముందు నంది విగ్రహం తప్పనిసరిగా ఉండాలి, ఎందుకో తెలుసుకోండి. ఒకవేళ విడిగా నందిని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే అందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.
మీరు ఏ శివాలయానికి వెళ్లినా శివలింగం ముందు నంది తప్పనిసరిగా ఉంటుంది. నంది శివుని వాహనం అని మీకు తెలుసు, కానీ ఏ ఇతర దేవతా విగ్రహాల ముందు ఇలాంటి దృశ్యం కనిపించకపోవచ్చు. ఇంట్లో పెట్టుకునే చిన్న శివుడి విగ్రహమైనా సరే ఎదురుగా నంది ఉంటుంది. నంది ఆరాధన లేకుండా శివుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నంది చెవుల్లో కోరికలు చెప్పే సంప్రదాయం పురాతన కాలం నుంచే ఉంది. ఎందుకంటే శివుడు తరచుగా ధ్యానం చేస్తూ తపస్సులో మునిగిపోతాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, నంది భక్తుల కోరికలను వింటాడు. శివుడు ధ్యానం పూర్తి చేసుకున్న తర్వాత భక్తుల కోరికలను శివుడికి నంది తెలియపరుస్తాడు. అప్పుడు భగవంతుడు తన భక్తుల కోరికలను తీరుస్తాడని ఒక నమ్మకం ఉంది. శివుడ్ని చేరుకోవడానికి నంది ఒక్కటే మార్గం. అందుకే శివుని ముందు నందికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది.
మీలో చాలా మంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించుకుని ఉంటారు. ఏ ఇంట్లో అయినా శివలింగాన్ని ప్రతిష్టిస్తే ఆ ఇంట్లో నందిని కూడా ప్రతిష్టించాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. నంది కూడా శివునికి ప్రియమైన భక్తుడు. ఇద్దరిలో ఎవరికి తమ కోరికలు చెప్పినా అది ఆ పరమశివుడికి చేరుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి.
Rules To Install Nandi Bull Idol at Home- నంది ప్రతిష్ఠాపనకు నియమాలు
- ఇంట్లో శివలింగంతో పాటు నంది స్థాపనకు సంబంధించిన నియమాలను వేద పండితుల ద్వారా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం, వాటిని ఈ కింద గమనించవచ్చు.
- నంది విగ్రహాన్ని సోమవారాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. సోమవారం కుదరకపోతే బుధవారం, గురువారం లేదా శుక్రవారం నంది విగ్రహాన్ని కొనుగోలు చేయవచ్చు.
- నందిని ఇంటికి తోలుకొచ్చిన తర్వాత విగ్రహానికి పచ్చి పాలు, నెయ్యితో అభిషేకం చేయండి. దీంతో విగ్రహంలోని దోషాలన్నీ తొలగిపోయి విగ్రహం పరిశుభ్రంగా మారుతుంది.
- తర్వాత నంది విగ్రహానికి జలాభిషేకం చేసి 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించాలి.దీనితో పాటు, మీరు నంది మంత్రాలను కూడా జపించవచ్చు.
- నందిని ప్రతిష్ఠించిన తర్వాత కుంకుమ, విభూతి, పువ్వులు మొదలైన వాటితో పూజించండి.
- దీని తరువాత, శుభ గడియల్లో శివలింగాన్ని ప్రతిష్టించి అభిషేకాలు, పత్రాలు సమర్పించాలి. శివుని ముందు నందిని కూడా ప్రతిష్టించాలి.
- నంది విగ్రహం ఎల్లప్పుడూ శివుని వైపు చూస్తున్నట్లుగా ఉండాలి.
నంది విగ్రహాన్ని విడిగా పెట్టుకోవచ్చా?
మీరు కోరుకుంటే, మీరు విడిగా కూడా వెండి, ఇత్తడి నందిని తీసుకురావచ్చు. అలంకరణ రూపంలో అదనపు నంది విగ్రహాన్ని పెట్టాలనుకుంటే ఏదైనా స్థిరమైన చోటును పరిశీలించి పెట్టుకోవాలి.
ఒకసారి నందిని స్థాపించిన తర్వాత, పదే పదే తొలగించడం అశుభకరంగా పరిగణించబడుతుంది. అందుకే మళ్లీ మళ్లీ తొలగించాల్సిన అవసరం లేని చోట నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయండి.
నిధులు, నగదు ఉన్న ప్రదేశంలో నంది విగ్రహం ఉంచవచ్చు. ధనం ఉంచిన ప్రదేశంలో నంది విగ్రహం ఉండటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి సదా నివాసం ఉంటుందని నమ్ముతారు.
సంబంధిత కథనం
టాపిక్