Sri Lanka crisis: సైకిలెక్కిన శ్రీలంక.. కార్లు, బైకులు మూలకే
Sri Lanka crisis: శ్రీలంక ఇప్పుడు సైకిల్ ఎక్కింది. పెట్రోలు కొరతతో కార్లు, బైకులు పక్కన పడేసి సైకిళ్లు పడితే వాటి ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అనేక దుకాణాల్లో సైకిళ్ల స్టాక్ కూడా అయిపోయింది.
కొలంబో (శ్రీలంక), జూలై 12: ఇంధన కొరతతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంలకో ప్రతిరోజూ వందలాది మంది పెట్రోల్ పంపుల వద్ద క్యూలు కడుతుండగా, పెద్ద సంఖ్యలో ప్రజలు తమ రోజువారీ ప్రయాణం కోసం కార్లు, మోటార్ బైక్స్ వదిలేసి సైకిల్ ఎక్కడం స్టార్ట్ చేశారు.
శ్రీలంక చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలను ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల కొరత వేధిస్తోంది. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు కూడా సైకిళ్ల అమ్మకాలు పెరగడానికి ఒక కారణమైంది. ఇప్పటికే కొన్ని దుకాణాల్లో సైకిళ్ల స్టాక్ అయిపోయింది.
స్థానికులు తరచూ సైకిళ్లపై కార్యాలయాలు, కళాశాలలకు వెళ్తున్నారు. కొలంబోలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న లాక్లిన్.. ప్రస్తుతం ఉన్న ధరతో పెట్రోల్ కొనలేనని, ఎక్కువ సేపు క్యూలో నిలబడే సమయం లేదని చెప్పారు.
‘దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా సైకిళ్లను ఉపయోగించడం మొదలుపెట్టాం. పెట్రోల్ తెచ్చుకునే స్తోమత లేదు. క్యూలో నిలబడే సమయం కూడా లేదు. కొన్నిసార్లు క్యూలో నిలబడడం వల్ల కూడా మనకు పెట్రోలు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు..’ అని లాక్లిన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.
‘కాబట్టి ప్రస్తుతం సైకిల్ తొక్కడం ఉత్తమ ఆప్షన్. నా దగ్గర రెండు సైకిళ్లు ఉన్నాయి. ఒకటి నేను రోజువారీ పనుల కోసం ఉపయోగిస్తాను. నేను సాధారణంగా సైకిల్‌పై నా కార్యాలయానికి వెళ్తాను. ఇది నేను ఉన్న చోటు నుండి 8-10 కి.మీ. దూరంలో ఉంది. ఇటీవలి సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజా రవాణా సాధనాలు, సైకిళ్లకు మారిన వారు చాలా మంది ఉన్నారు..’ అని వివరించారు.
ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర 470 శ్రీలంక రూపాయలు కాగా, డీజిల్ లీటరుకు 460 చొప్పున విక్రయిస్తున్నారు. కాగా సైకిళ్ల ధరలు 30 శాతం వరకు పెరిగాయని స్థానికులు తెలిపారు.
‘నేను ఆఫీసుకు వెళ్లడానికి సైకిల్ ఉపయోగిస్తున్నాను. నా కుటుంబం, చాలా మంది స్నేహితులు అదే చేస్తున్నారు’ అని సైకిల్ విడిభాగాలను కొనుగోలు చేయడానికి దుకాణాన్ని సందర్శించిన స్థానిక నివాసి చెప్పారు.
శ్రీలంకలోని పెట్రోలు బంకుల వద్ద పొడవైన క్యూలు ఇప్పుడు సర్వసాధారణం. లభ్యతను బట్టి ధరలు మారుతూ ఉంటాయి.
ఇంధనం కోసం క్యూలైన్లలో 4-5 రోజులు వేచి ఉన్నామని స్థానికులు వాపోతున్నారు. ‘నేను గురువారం ఇక్కడకు వచ్చాను. 4-5 రోజులు క్యూలో వేచి ఉన్నాం. కానీ వారు బైక్‌లకు 1500 రూపాయల పరిమితిని విధించారు. అంటే వారు పోసే 3 లీటర్లు సరిపోదు. మేం కొరియర్ సర్వీసులో ఉన్నాం..’ అని స్థానిక నివాసి చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో శ్రీలంక విద్యుత్, ఇంధన మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ ఆగస్టు మొదటి పక్షం రోజుల వరకు ప్రణాళికాబద్ధమైన ఇంధన దిగుమతుల కోసం శ్రీలంక అనేక విదేశీ చమురు కంపెనీలకు 587 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు.
ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌తో కూడిన మూడు నౌకలు ఈ నెలలో దేశానికి చేరుకుంటాయని, ఆగస్టులో మరొకటి వస్తుందని, ఇంధన కొరతను ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న లంక ఐఓసీ చైర్మన్ శనివారం తెలిపారు. జులై 13 నుంచి 15వ తేదీలోపు ఒక నౌక, జూలై 29 నుంచి 31వ తేదీలోపు మరో నౌక చేరుకోనుంది.
సంబంధిత కథనం
టాపిక్