Monsoon ends today : దేశంలో నేటితో నైరుతి రుతుపవనాల ముగింపు..!
Southwest Monsoon ends today : నేటితో దేశంలో నైరుతి రుతుపవనాలకు అధికారికంగా ముగింపు పడనుంది. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది.
Southwest Monsoon ends today : నేటితో నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా అధికారికంగా ముగియనుంది! మొత్తం మీద ఈ ఏడాది.. 7శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా 2022 రుతుపవనాల సీజన్‌ను సగటు కన్నా అధిక వర్షపాతంగా పరిగణించవచ్చు అని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.
2021లో ఎల్పీఏ(లాంగ్ పీరియడ్ యావరేజ్)లో 99శాతం వర్షపాతం నమోదైంది. దానిని సాధారణ రుతుపవనాలుగా పరిగణించారు. ఇక 2020లో ఎల్పీఏలో 109శాతం వర్షపాతం నమోదుకావడంతో దానిని సాధారణం కన్నా ఎక్కువ అని పరిగణించారు. ఇక 2019లో అది 110శాతంగా ఉంది.
End of monsoon season : నైరుతి రుతుపవనాలు..
ఈ ఏడాది రుతుపవనాల విషయంలో కాస్త భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. సాధారణంగా సెప్టెంబర్ చివర్లో వర్షాలు ఎక్కువగా పడవు. కానీ ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెప్టెంబర్ చివరి రెండు వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుశాయి. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇంత జరిగినా.. తూర్పు, ఈశాన్య భారతంలో మాత్రం 18శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. వాయువ్య భారతంలో 1శాతం ఎక్కువ వర్షపాతం, మధ్య భారతంలో 19శాతం అధికం, భారత ద్వీపకల్పంలో 22శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వివరాలను ఐఎండీ వెల్లడించింది.
Southwest monsoon in India : బిహార్‌లో అత్యధికంగా 31శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 28శాతం, ఝార్ఖండ్‌లో 21శాతం, మణిపూర్‌లో 47శాతం, మిజోరాంలో 22శాతం, త్రిపురలో 24శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పంటలు సరిగ్గా చేతికి అందలేదు! రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిపోయిన ఆహార ద్రవ్యోల్బణంతో పాటు ఇది మరింత ప్రతికూలంగా మారింది.
Rains in India : ఎల్పీఏలో 90శాతం దిగువన వర్షపాతం నమోదైతే దానిని లోటు అని అంటారు. 90-96శాతం మధ్యలో వర్షపాతం ఉంటే దానిని సాధారణం కన్నా తక్కువ అని పరిగణిస్తారు. 96-104శాతంగా ఉంటే దానిని సాధారణంగాను, 104-110శాతంగా ఉంటే అప్పుడు దానిని సాధారణం కన్నా ఎక్కువగాను గుర్తిస్తారు. ఇక 110శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. దానిని అధిక వర్షపాతం అని అంటారు.
గురువారం నాటికి పంజాబ్, ఛండీగఢ్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లాయి అని ఐఎండీ స్పష్టం చేసింది.
సంబంధిత కథనం