Sitaram Yechury: లౌకిక శిఖరం.. సీతారాం ఏచూరీ-sitaram yechury a media friendly leader with vast knowlede on various fields ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sitaram Yechury: లౌకిక శిఖరం.. సీతారాం ఏచూరీ

Sitaram Yechury: లౌకిక శిఖరం.. సీతారాం ఏచూరీ

HT Telugu Desk HT Telugu
Sep 12, 2024 05:45 PM IST

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సుపరిచితులు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన చూడని రాజకీయ సవాలు లేదు. దేశ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా యుపిఎ ప్రభుత్వం పాలనా సమయంలో ఆయన పాత్ర కీలకమైనది.

లౌకిక శిఖరం.. సీతారాం ఏచూరీ
లౌకిక శిఖరం.. సీతారాం ఏచూరీ (PTI)

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్టీలో ఐక్యతను, పార్టీ బయట ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో నిరంతర కృషీవలుడు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్‌ కరత్‌ ఉన్న సమయంలో, సీతారాం ఏచూరి పొలిట్‌ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఆయన పార్లమెంటరీ రాజకీయాలతో సుపరిచితులు. ఆయన ఎప్పుడూ పార్టీ సైద్ధాంతిక రాజకీయాలు, పార్లమెంటరీ రాజకీయాలు రెండూ వేరువేరు అని చెప్పేవారు.

సిపిఎం 21వ అఖిల భారత మహాసభ

నేను జర్నలిస్టుగా ప్రయాణం మొదలుపెట్టిన నెలకే సంస్థ అవసరాల నిమిత్తం 2015 మార్చిలో ఢిల్లీ వెళ్లాను. ఢిల్లీకి పంపడానికే నన్ను ప్రజాశక్తిలోకి ఆహ్వానించారు. వాస్తవానికి నాకు ఢిల్లీ గురించి ఏమీ తెలియదు. ఢిల్లీ వెళ్లడం అదే మొదటి సారి. అక్కడి భాష, వాతావరణ అంతా కొత్తగా ఉంటుందని తెలుసు. నేను ఢిల్లీ వెళ్లిన సమయానికి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్‌ కరత్‌ ఉన్నారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా ఏచూరి ఉన్నారు. 2015 ఏప్రిల్‌ 14 నుంచి 19 వరకు విశాఖపట్నంలో సిపిఎం 21వ అఖిల భారత మహాసభ జరిగింది. ఈ మహాసభలోనే ఏచూరి తొలిసారి ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ మహాసభను ప్రజాశక్తి తరపున కవర్‌ చేసేందుకు ఢిల్లీ నుంచి నేను కూడా విశాఖపట్నం వెళ్లాను. అది నేను కవరు చేసిన మొదటి సిపిఎం అఖిల భారత మహాసభ. ఆ తరువాత హైదరాబాద్‌, కన్నూర్‌ సిపిఎం అఖిల భారత మహాసభలను కవర్‌ చేశాను. అయితే విశాఖపట్నం మహాసభ ముగిసిన తరువాత ఢిల్లీ వెళ్లిన కొన్ని రోజులకు నేను సిపిఎం కేంద్ర కార్యాలయానికి వెళ్లి, ఆయనను పరిచయం చేసుకున్నా. నేను ప్రజాశక్తి ఢిల్లీ రిపోర్టర్‌గా వచ్చాను అని ఆయనతో చెప్పాను. దానికి ఆయన అవునా అంటూ చైల్డ్‌ లేబర్‌ (బాల కార్మికుడి)లా ఉన్నావుగా అంటూ నవ్వుతూ చమత్కరించారు. నీవల్ల మాకు తలనొప్పులు వస్తాయని మళ్లీ నవ్వుతూ అన్నారు.

కార్మిక పోరాటాలు

అప్పటికే మోదీ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. కార్మికులు పోరాటాలకు సిద్ధమవుతున్న తరుణం. అప్పటి నుంచి సీతారాం ఏచూరితో చాలా సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఎప్పుడు కలిసిన ఏంట్రా ఎలా ఉన్నావు. ఏం చేస్తున్నావు. కనబడటం లేదు. బిజీ అయిపోయావుగా అంటూ పలకరించేవారు. వరుసగా కొన్ని రోజులు కనపబడకపోతే, జగదీష్‌ కనబడటం లేదు, ఢిల్లీలో లేడా అని ఇతర జర్నలిస్టులను అడిగేవారు. ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండటంతో మీడియా ఫ్రెండ్లీ (జర్నలిస్టులతో ఎక్కువ సంబంధాలు)గా ఉంటూ జర్నలిస్టులతో తరచూ సమావేశమయ్యేవారు. వాటిలో కొన్ని సమావేశాలకు నేను కూడా హాజరయ్యాను. పార్లమెంట్‌ కార్యకలాపాలపై చాలా సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. అంతేకాదు పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపైన, పార్లమెంట్‌ ప్రక్రియలపైన అనేక సార్లు ఆయనతో చర్చించాను.

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు సంబంధించి

ఒక రోజు అవసరం మేరకు రాత్రి సుమారు పదిన్నర సమయంలో ఆయన ఆన్సర్‌ చేస్తారో లేదో అనే అనుమానంతో ఫోన్‌ చేశా. అప్పుడు పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై చర్చ జరుగుతోంది. మరుసటి రోజు ఆ బిల్లుపై ఓటింగ్‌ ఉంటుందని సర్వత్రా చర్చ. అప్పుడు ఒక సీనియర్‌ జర్నలిస్టు మిత్రుడు తనతో జగదీష్‌ ఒకసారి ఏచూరికి ఫోన్‌ చేసి అడుగు. అసలు ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపైన ఓటింగ్‌ జరిగిందా? ఒక వేళ బిల్లుపై ఓటింగ్‌ జరిగి, నెగ్గితే పరిస్థితి ఏంటీ? అని అడగమన్నాడు. కానీ నాకు మాత్రం ఆ రాత్రి సమయంలో ఏచూరికి ఫోన్‌ చేసి అడగడం ఇష్టం లేదు. కానీ మిత్రుడు కోరడంతో ఫోన్‌ చేశా. ఆయన ఫోన్‌ ఎత్తి ఈ సమయంలో ఫోన్‌ చేశావు ఏమిటి అని అడిగి, అన్నింటికి సమాధానం చెప్పారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆయనతో అనేక రాజకీయ అంశాలపై చర్చించా. ఆయనెప్పుడూ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటారు.

కార్యకర్తలతో ఫ్రెండ్లీగా..

అంతేకాకుండా నా పెళ్లి తేదీ కూడా ఏచూరినే నిర్ణయించారు. ఎందుకంటే నేను కమ్యూనిస్టు పద్దతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయనతో నాకున్న అనుబంధం వల్ల ఆయనను నా పెళ్లికి అతిథిగా రావాలని కోరాను. అందుకు ఆయన అంగీకరించారు. కాకపోతే ఆయన పెళ్లికి హాజరుకాలేదు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమైన పార్టీ సమావేశాలు నా పెళ్లి రోజునే జరగడంతో ఆయన రాలేకపోయారు. ఆయన నాకు ఫోన్‌ చేసి తాను పెళ్లికి రాలేకపోతున్నానని, ఢిల్లీ వచ్చిన తరువాత తప్పకుండా కలవాలని అన్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన తరువాత ఆయనను కలిస్తే తాను పెళ్లి రాలేకపోయినందుకు సారీ చెప్పారు. సామన్య కార్యకర్త అయిన నాకు ఆయన సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా ఆయన స్పందించారు. ఈ ఉదంతం ఆయన ఒక కార్యకర్తకు ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

కుమారుడు ఆశిష్‌ రిజిస్టర్ మ్యారేజ్‌

ఏచూరి తన కుమారుడు ఆశిష్‌ వివాహాన్ని నిడారంబరంగా నిర్వహించారు. కేవలం రిజిస్టర్ మ్యారేజ్‌ చేసి, చిన్న ట్రీట్‌ ఇచ్చి, దగ్గర వాళ్లని మాత్రమే పిలిచారు. జెఎన్‌యు ప్రొఫెసర్లు, ఢిల్లీ లో ఉన్న కొంత మంది పార్టీ నేతలు, ఆయనకు చాలా దగ్గరగా ఉండే జర్నలిస్టులను ఆ పెళ్లికి పిలిచారు. నాకు కూడా పిలుపు రావడంతో వెళ్లాను. న్యూఢిల్లీలోని క్యానింగ్‌ లైన్‌ 36లో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన నివాసంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విధానాలు, విద్యార్థుల చదువులపై మా మధ్య చర్చకు వచ్చినప్పుడు, విద్యార్థులు చదివిన చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి అయిపోయిందని చెబుతూ అందుకు తన కొడుకునే ఉదాహరించారు. ఆయనతో ఎప్పుడూ మాట్లాడిన సరదా, సెటారికల్‌గా చిరునవ్వుతూ మాట్లాడేవారు. ఆయనతో కమ్యూనిస్టు రాజకీయాలపైనే కాకుండా, దేశంలోని రాజకీయాలపై కూడా చర్చించేవాడిని. పార్లమెంట్‌లో లేకపోతే జంతర్‌ మంతర్‌లో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మాట్లాడాలనుకునేటప్పుడు ఆ విషయానికి సంబంధించి నన్ను అడిగేవారు. ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడేటప్పుడు చాలా సార్లు తనతో చర్చించేవారు. నేను కొన్ని అంశాలు చెప్పేవాడిని. అలాగే ఇతర పార్టీ నేతలను కూడా అడిగి, ఆ అంశాలపై మాట్లాడేవారు.

యువతకు ప్రోత్సాహం

ఆయనెప్పుడు యువతను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగానే నన్ను కూడా వివిధ సందర్భాల్లో ప్రోత్సహించారు. నాకు ఏదైనా సమస్య వస్తే ఆయన వద్దకే వెళ్లేవాడిని. ఆయనతో చెబితే దానికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని బలంగా నమ్మేవాడిని. ఎనిమిదేళ్ల నా ఢిల్లీ జీవితంలో ఎన్నో సార్లు ఆయనను కలిసిన, ఆయనతో మాట్లాడిన అవకాశం నాకు వచ్చింది. మృధుస్వభావి అయిన ఏచూరికి, ఇతర పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. లౌక్యం తెలిసిన నేతగా ముద్ర పొందారు. ఇటీవలి కాలంలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు. కామ్రెడ్‌ ఏచూరీతో బంధం భౌతికంగా నేటితో తెగిపోయినా, జీవితాంతం ఆయనతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మర్చేపోలేనివి.

-జ‌గ‌దీష్ రావు,

పొలిటికల్‌ ఎనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

జ‌గ‌దీష్ రావు,
జ‌గ‌దీష్ రావు,