Brazil Riots : బ్రెజిల్​లో బొల్సొనారో మద్దతుదారుల విధ్వంసం.. మరో ‘క్యాపిటల్​’ ఘటన!-probolsonaro rioters storm brazil s top government offices ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pro-bolsonaro Rioters Storm Brazil's Top Government Offices

Brazil Riots : బ్రెజిల్​లో బొల్సొనారో మద్దతుదారుల విధ్వంసం.. మరో ‘క్యాపిటల్​’ ఘటన!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 09, 2023 07:25 AM IST

Brazil Riots : యూఎస్​ క్యాపిటల్​ విధ్వంసం తరహా ఘటన బ్రెజిల్​లో చోటుచేసుకుంది! మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు.. రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు. నేషనల్​ కాంగ్రెస్​, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్​ ప్యాలెస్​లోకి చొచ్చుకెళ్లి హింసాకాండకు పాల్పడ్డారు.

మాజీ అధ్యక్షుడు బొల్సొనారోకు మద్దతుగా చెలరేగిన నిరసనలు..
మాజీ అధ్యక్షుడు బొల్సొనారోకు మద్దతుగా చెలరేగిన నిరసనలు.. (REUTERS)

Pro Bolsonaro riots in Brazil : ఆకస్మిక నిరసనలతో బ్రెజిల్​ అట్టుడికింది. మాజీ అధ్యక్షుడు జైర్​ బొల్సొనారో మద్దతుదారులు.. బ్రెజిల్​లో విధ్వంసం సృష్టించారు. ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్​ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా.. వందలాది మంది రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడ్డారు.

ఇదీ జరిగింది..

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం నిరసనలు మొదలయ్యాయి. బ్రెసీలియాలో.. ఆకుపచ్చ, పసుపు దుస్తులు వేసుకుని ఆందోళనకారులు రోడ్ల మీదకొచ్చారు. నేషనల్​ కాంగ్రెస్​, సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం, ప్రెసిడెంట్​ ప్యాలెస్​లో విధ్వంసం సృష్టించారు.

Brazil supreme court vandalised : ముఖ్యంగా.. మాజీ అధ్యక్షుడి మద్దతుదారులు.. నేషనల్​ కాంగ్రెస్​లోకి చొచ్చుకెళ్లి, హింసాకాండ సృష్టించిన తీరు ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాలు.. 2021 జనవరి 6న అమెరికాలో జరిగిన 'క్యాపిటల్​' హింసాకాండను గుర్తుచేస్తున్నాయి. నాడు.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు.. వాషింగ్టన్​లోని కాంగ్రెస్​ భవనాన్ని ధ్వంసం చేశారు. వేలాదిగా తరలివెళ్లి హింసకు పాల్పడ్డారు.

మరోవైపు.. బ్రెసీలియాలో నిరసనల సమయంలో అధ్యక్షుడు లూలా అక్కడ లేరు. వరదలతో చిన్నాభిన్నమైన అరారక్వారాలో పర్యటిస్తున్నారు. హింస గురించి తెలుసుకున్న లూలా.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని బ్రెసీలియాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫెడరల్​ అధికారులకు ప్రత్యేక హక్కులను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Brazil National Congress riots : "దేశ చరిత్రలోనే ఇదొక చీకటి రోజు. ఫాసిస్ట్​లు చాలా తప్పు చేశారు," అని మండిపడ్డారు బ్రెజిల్​ అధ్యక్షుడు లూలా. అక్టోబర్​లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బొల్సొనారోపై స్వల్ప తేడాతో విజయం సాధించిన లూలా.. గత వారమే బాధ్యతలు స్వీకరించారు. నాటి ఎన్నికల ఫలితాల్లో బొల్సొనారోకు 49.1శాతం స్కోరు లభించగా.. లూలాకు 50.9శాతం స్కోర్​ దక్కింది. తనను గద్దె దించేందుకు.. కుట్ర జరిగిందంటూ అప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చారు బొల్సొనారో.

అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బయటకొచ్చినప్పటి నుంచి.. బొల్సొనారో మద్దతుదారులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దేశంలోని మిలిటరీ స్థావరాలకు వెళ్లి.. రాజకీయ విషయంలో సైన్యం జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Brazil riots latest updates : ఇక తాజా ఘటనలో నేషనల్​ కాంగ్రెస్​​ భవనం ధ్వంసమైంది. కాంగ్రెస్​ భవనంపైకి ఎక్కిన నిరసనకారులు.. 'ఇంటర్​వెన్షన్​(జోక్యం చేసుకోండి)' అంటూ బ్యానర్లు ఎగరేశారు. ఆందోళనకారులు.. కాంగ్రెస్​ భవనం అద్దాలు పగలగొట్టి, లోపలుకు దూసుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అనంతరం చట్టసభ్యుల కార్యాలయాల్లోకి చొరబడి నాశనం చేశారు. స్పీకర్​ డయాస్​ మీదకు వెళ్లి దుర్భాషలాడారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితులను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. నేషనల్​ కాంగ్రెస్​ చుట్టూ బ్యారికెడ్లు ఏర్పాటు చేసి నిదానంగా ముందుకు అడుగులు వేశారు. ఈ క్రమంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల హెచ్చరికలను నిరసనకారులు లెక్కచేయలేదు! 'ఎన్నికల్లో మోసం జరిగింది' అంటూ ఆందోళనకారులు రెచ్చిపోయి మరింత విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల శ్రమ ఫలించింది. ఆదివారం సాయంత్రం తర్వాత.. నేషనల్​ కాంగ్రెస్​ను మళ్లీ తమ చేతుల్లోకి తీసుకున్నారు. కాగా.. ప్రెసిడెంట్​ ప్యాలెస్​, సుప్రీంకోర్టులో ఆందోళనలు కొనసాగుతున్నట్టు సమాచారం.

తాజా ఘటనను బ్రెజిల్​ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో ఖండించారు.

Bolsonaro Brazil riots : "ప్రజా భవనాలపై జరిగిన దోపిడీ, దండయాత్రను నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనల వెనుక నేను ఉన్నానని అధ్యక్షుడు లూలా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. కానీ.. శాంతియుతంగా నిరసనలు చేయడంలో తప్పులేదు," అని బొల్సొనారో ట్వీట్​ చేశారు. అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియడానికి రెండు రోజుల ముందు.. బొల్సొనారో అమెరికాలోని టెక్సాస్​కు వెళ్లిపోయారు.

బ్రెజిల్​ హింసాకాండను ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు.. అమెరికాతో సహా అనేక దేశాలు ప్రకటన చేశాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం