PM Modi Mother Hospitalised: ఆసుపత్రిలో చేరిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్.. హెల్త్ అప్‍డేట్ విడుదల
PM Modi Mother Heeraben Hospitalised: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ.. అనారోగ్యానికి గురయ్యారు. అహ్మదాబాద్‍లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
PM Modi Mother Hospitalised: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi) ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను అహ్మదాబాద్‍లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. 99 ఏళ్ల హీరాబెన్ మోదీ ఆరోగ్యంపై ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది.
నిలకడగా ఆరోగ్యం
Heeraben Modi Health: హీరాబెన్ మోదీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని అహ్మదాబాద్‍లోని యూఎన్ మెహతా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి ప్రకటించింది. అయితే, మిగిలిన వివరాలేవీ వెల్లడించలేదు. గత రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురవటంతో హీరాబెన్‍ను యూఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు.
బీజేపీ ఎమ్మెల్యేలు దర్శనాబెన్ వాఘెలా, కౌశిక్ జైన్ ఇప్పటికే ఆ ఆసుపత్రి వద్ద ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
మాతృమూర్తి హీరాబెన్‍తో తన అనుబంధాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలాసార్లు ప్రస్తావించారు. ముఖ్యమైన అన్ని సందర్భాల్లో మోదీ ఆమె ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా హీరాబెన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు మోదీ. ఆమెతో కలిసి టీ తాగుతూ మాట్లాడారు.
ఈ ఏడాది జూన్‍లో హీరాబెన్.. 99వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి భావోద్వేగంగా మదర్ అనే బ్లాగ్ కూడా రాశారు మోదీ.
కాగా, ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు కొందరు కర్ణాటకలోని మైసూరులో మంగళవారం కారు ప్రమాదానికి గురయ్యారు. స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.