Odisha train accident live : ఒడిశా రైలు ప్రమాదంలో 223మంది మృతి..
Odisha train accident live : ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 220 దాటింది. మరో 900మంది గాయపడ్డారు.
Odisha train accident live updates : యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మహా విషాదంలో ఇప్పటివరకు 223మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో 900మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. దేశ చరిత్రలోనే అతి భయంకరమైన, అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా ఈ ఘటన నిలిచిపోతుంది!
అసలేం జరిగింది..?
శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో.. బాలాసోర్‌లోని బహనాగా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత 12864 బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. పక్కనే ఉన్న పట్టాలపై బోగీలు పడ్డాయి. అటుగా వస్తున్న 12841 షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్.. పట్టాలపై పడిన బోగీలను ఢీకొట్టింది. ఫలితంగా ఈ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఆ బోగీలు మరో ట్రాక్‌పై పడగా.. అటుగా వెళుతున్న ఓ గూడ్స్ రైలు వాటిని ఢీకొట్టింది. ఫలితంగా గూడ్స్ రైలు సైతం ప్రమాదానికి గురైంది.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్పందించారు. ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ ప్రాంతమంతా అంబులెన్స్‌ల సైరన్ మోతమోగిపోయింది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల బంధువుల ఆర్థనాథాలతో ఆసుపత్రుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
'జీవితంలో మర్చిపోలేను..'
Odisha train accident death toll : ఘటనాస్థలంలో పరిస్థితులు భయానకంగా ఉన్నట్టు రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు వెల్లడించాడు.
"రైలు పట్టాలు తప్పడంతో నాకు మెలుకువ వచ్చింది. అప్పటికే నా మీద 10-15మంది పడ్డారు. నా తల, మెడకు గాయాలయ్యాయి. ఎలాగో అలా బయటకు రాగలిగాను. కానీ అప్పుడే నా శరీరంపై వేరొకరి చేతులు, కాళ్లు చూశాను. రైలులో కొందరి ముఖాలు పూర్తిగా చిద్రమైపోయింది," అని ఆ ప్రయాణికుడు మీడియాకి వివరించాడు.
సంతాప దినం..
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు సంతాప దినంగా ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్. నేడు సంఘటనాస్థలానికి వెళ్లనున్నట్టు ప్రకటించారు.
మరోవైపు.. వాలంటీర్ల శ్రమను ప్రశంసించారు ఒడిశా చీఫ్ సెక్రటరీ జేనా.
"బాలాసోర్‌లో రాత్రికి రాత్రే 500కుపైగా బ్లడ్ యూనిట్లు సేకరించారు. ప్రస్తుతం 900 యూనిట్ల స్టాక్ ఉంది. ప్రమాదంలో గాయపడిన వారి చికిత్సకు ఇవి ఉపయోగపడతాయి. రక్తదానం చేసి సరైన సమయంలో సాయం చేసిన వాలంటీర్లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను," అని జేనా అన్నారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
Coromandel express accident : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రకటించారు. ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడినట్టు వివరిచారు.
మరోవైపు ఘటనకు గల కారణాలను కనుగొనేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. త్వరలో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం