Shreya Lenka| కొరియన్ పాప్ బ్యాండ్ లోకి తొలి భారతీయురాలు.. మన యంగ్ సెన్సేషన్ వేయాల్సింది ఇక ఒక్క అడుగే..-odisha girl shreya lenka one step away from becoming india s first k pop star ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shreya Lenka| కొరియన్ పాప్ బ్యాండ్ లోకి తొలి భారతీయురాలు.. మన యంగ్ సెన్సేషన్ వేయాల్సింది ఇక ఒక్క అడుగే..

Shreya Lenka| కొరియన్ పాప్ బ్యాండ్ లోకి తొలి భారతీయురాలు.. మన యంగ్ సెన్సేషన్ వేయాల్సింది ఇక ఒక్క అడుగే..

Madasu Sai HT Telugu
Feb 04, 2022 11:37 AM IST

పాప్ సంగీతమంటే చాలామందికి పిచ్చి ఇష్టం. అది వింటూ మైమరిచిపోతారు. ప్రత్యేకించి ఈ జనరేషన్ వాళ్లైతే పడి చచ్చిపోతారనుకోండి. మరి అలాంటి పాప్ సంగీత బ్యాండ్ లో చేరేందుకు సిద్ధమైంది ఓ భారతీయురాలు. ప్రపంచంలోనే పేరున్న K Pop బ్యాండ్ లోకి వెళ్లేందుకు అడుగు దూరంలోనే నిలిచింది. ఇంతకీ ఎవరామే? ఏ రాష్ట్రం నుంచి వెళ్లింది?

<p>శ్రేయా లెంకా</p>
శ్రేయా లెంకా (Feeds)

కొరియన్ సినిమాలు, K Pop, K- డ్రామాలు.. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇక ఇప్పటి వాళ్లకైతే.. ఎంతో ఇష్టం. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కొరియన్ పాప్ బ్యాండ్ లోకి అడుగుపెట్టబోతోంది శ్రేయ లెంకా. ఇక ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. హిందుస్థానీ క్లాసికల్ సింగర్ అయిన ఈ అమ్మాయి.. K-Pop బ్యాండ్ బ్లాక్‌స్వాన్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఆమె అక్కడ వరకు ఎలా వెళ్లిందో తెలుసుకుందాం..

డీఆర్ మ్యూజిక్ కు చెందిన బ్లాక్‌స్వాన్ పాప్ మ్యూజిక్ బ్యాండ్ లలో చాలా ఫేమస్. ఈ బ్లాక్ స్వాన్ ఐదుగురు సభ్యులతో కూడిన బృందం. Hyeme, Youngheun, Leia, Judy, Fatou. అక్టోబర్ 2020లో డీఆర్ మ్యూజిక్ దీనిని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఈ బృందంలోని సభ్యురాలు.. హైమ్ నవంబర్ 2020లో బయటకొచ్చింది. దీంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. మరో వ్యక్తిని తీసుకునేందుకు.. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉన్న వారి కోసం ఆడిషన్స్ నిర్వహించింది డీఆర్ మ్యూజిక్. చివరకు ఇద్దరిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేశారు. అందులో ఒకరే మన శ్రేయా లెంకా.

ఒడిశాలోని ఝార్సుగూడ పట్టణానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయి శ్రేయా లెంకా. గత డిసెంబర్ నాటికి.. ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదు. కానీ కొన్ని రోజులైతే.. ప్రపంచమే ఆమె వైపు చూస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ K Pop బ్యాండ్ లో చేరితే ఆమె భవిష్యత్ మారిపోతుంది.

శ్రేయా లెంకాతోపాటు బ్రెజిల్ అమ్మాయి గ్యాబ్రియెలా దాల్సిన్ ఫైనలో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని బ్యాండ్ కోసం సెలక్ట్ చేసుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ దక్షిణ కొరియాలో ఉన్నారు. డీఆర్ మ్యూజిక్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని.. బ్యాండ్ లోకి తీసుకుంటారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే.. శ్రేయా లెంకా.. కొరియన్ పాప్ బ్యాండ్ లో చేరే మెుట్ట మెుదటి భారతీయురాలు అవుతుంది. సెలక్ట్ అయిన ఇద్దరు మొత్తం ఆరు నెలల పాటు శిక్షణ పొందుతారని డీఆర్ మ్యూజిక్ తెలిపింది. కొరియన్ పాప్ కళాకారులుగా వారు అర్హులని శిక్షణా ప్రక్రియ తర్వాత తెలుస్తుంది.

'శ్రేయా బ్లాక్‌స్వాన్‌లో 5వ సభ్యురాలుగా ఎంపిక చేస్తారా లేదా అనేది మరో విషయం. కానీ అక్కడి వరకు వెళ్లింది అదే సంతోషం. ఏడాది కాలంగా కొరియన్ భాష, K-పాప్ సంగీతం నేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. స్కూల్ డేస్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి చేరుకుని, రాత్రి 9 గంటల వరకు డ్యాన్స్ శిక్షణ కోసం వెళ్ళేది.' అని శ్రేయా తల్లి చెబుతోంది.

 

Whats_app_banner