Nobel prize in medicine: మానవ పరిణామంపై పరిశోధనకు నోబెల్ పురస్కారం
Nobel prize in medicine: మానవ పరిణామంపై చేసిన పరిశోధనలకు ఈ సారి వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
స్టాక్‌హోమ్, అక్టోబర్ 3: మానవ పరిణామంపై చేసిన ఆవిష్కరణలకు గాను స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంట్ పాబోకు ఫిజియాలజీ - మెడిసిన్‌లో ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది.
స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్‌మాన్ విజేతను సోమవారం ప్రకటించారు.
పాబో ఆధునిక మానవుల జన్యువును, అంతరించిపోయిన నియాండర్తల్, డెనిసోవాన్‌లను పోల్చుతూ చేసిన పరిశోధనకు నాయకత్వం వహించారు. ఈ జాతుల మధ్య కలయిక ఉందని ఈ పరిశోధన చూపిస్తుంది.
వారం రోజుల పాటు సాగే నోబెల్ అవార్డుల ప్రకటన నేడు వైద్య శాస్త్రంతో మొదలైంది. మంగళవారం భౌతిక శాస్త్రంలో అవార్డుప్రకటిస్తారు. బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య రంగంలో అవార్డును ప్రకటిస్తారు. 2022 నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటిస్తారు. అర్థ శాస్త్ర రంగంలో అవార్డును అక్టోబర్ 10 న ప్రకటించనున్నారు.
మానవ శరీరం ఉష్ణోగ్రత, స్పర్శను ఎలా గ్రహిస్తుందో కనుగొన్నందుకు గత సంవత్సరం డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌లు వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు.
ఈ పురస్కారాల కింద 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (దాదాపు 900,000 డాలర్లు) నగదు బహుమతులు ఇస్తారు. వీటిని డిసెంబర్ 10న అందజేస్తారు.
టాపిక్