ఇక అక్క‌డ కూడా కుల గ‌ణ‌న‌-nitish agrees to socio economic survey of all castes communities in bihar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇక అక్క‌డ కూడా కుల గ‌ణ‌న‌

ఇక అక్క‌డ కూడా కుల గ‌ణ‌న‌

HT Telugu Desk HT Telugu
Jun 01, 2022 10:20 PM IST

కుల గ‌ణ‌న‌కు బిహార్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. అయితే, ఈ దీన్ని `క్యాస్ట్ సెన్స‌స్` అని కాకుండా, `క్యాస్ట్ కౌంట్‌` అని పిల‌వ‌నున్నారు.

<p>అఖిల‌ప‌క్ష భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడుతున్న‌ బిహార్ సీఎం నితీశ్ కుమ‌ర్‌, ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌</p>
అఖిల‌ప‌క్ష భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడుతున్న‌ బిహార్ సీఎం నితీశ్ కుమ‌ర్‌, ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌ (Aftab Alam Siddiqui )

రాష్ట్రంలో కులాల వారీ జ‌నాభాను లెక్కించ‌డానికి బిహార్ ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. ఇందులో భాగంగా, బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ బుధ‌వారం అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్ర‌తిపాద‌న‌కు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయ‌న్నారు. అయితే, కుల గ‌ణ‌నను తీవ్రంగా వ్య‌తిరేకించే బీజేపీ కూడా ఇందుకు స‌మ్మ‌తించ‌డం విశేషం.

న్యాయ వివాదాల స‌మ‌స్య‌

ఈ కుల గ‌ణ‌న‌పై న్యాయ వివాదాలు త‌లెత్తే ప్ర‌మాదం ఉన్నందున, ఆ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకునేందుకు దీన్ని `క్యాస్ట్ సెన్స‌స్` అని కాకుండా, `క్యాస్ట్ కౌంట్‌` అని పిలుస్తామ‌ని బిహార్ సీఎం నితీశ్ తెలిపారు. అయితే, ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి ముందుగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం అవ‌స‌ర‌మ‌న్నారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల అభివృద్ధి ల‌క్ష్యంగా ఈ క్యాస్ట్ కౌంట్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. కుల జ‌నాభా, వారి సామాజిక, ఆర్థిక స్థితిగ‌తులు తెలుసుకోవ‌డం ద్వారా వారి అభివృద్ధి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను రూపొందించ‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. నిర్ణీత కాల వ్య‌వ‌ధిని నిర్ధారించి, ఆ లోపు ఈ ప్ర‌క్రియను ముగించాల‌ని ఆల్ పార్టీ మీట్‌లో కొంద‌రు నాయ‌కులు సూచించిన‌ట్లు స‌మాచారం. దానికి ముఖ్య‌మంత్రి స‌మ్మ‌తించార‌ని స‌మావేశంలో పాల్గొన్న ఒక నాయ‌కుడు వెల్ల‌డించారు. అయితే, త్వ‌ర‌లో పండుగ‌ల సీజ‌న్ ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. ఆ సీజ‌న్ ముగిసిన త‌రువాత ఈ ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ సూచించార‌ని తెలిపారు.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో

ఇలాంటి స‌ర్వేను ఇప్ప‌టికే `సామాజిక ఆర్థిక స‌ర్వే` పేరుతో తెలంగాణ‌లో చేశారు. క‌ర్నాట‌క‌, ఒడిశాలోనూ ఇలాంటి స‌ర్వే నిర్వ‌హించారు. అలాగే, యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో, దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న నిర్వ‌హించారు. కానీ, న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, ఇత‌ర సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఆ డేటాను వెల్ల‌డించ‌లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ స‌ర్కారు మాత్రం కుల గ‌ణ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించింది. అవ‌సరం అనుకుంటే, రాష్ట్రాలు ప్ర‌త్యేకంగా కుల‌గ‌ణ‌న చేపట్టుకోవ‌చ్చ‌ని సూచించింది.

ఎస్సీలు, ఎస్టీలు కాకుండా..

ఎస్సీలు, ఎస్టీలు కాకుండా, మిగ‌తా సామాజిక వ‌ర్గాల జ‌నాభా లెక్కింపున‌కు కేంద్రం అంగీక‌రించ‌క‌పోవ‌డంతో, బిహార్ ప్ర‌భుత్వం సొంతంగానే ఈ స‌ర్వే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. గ‌త సంవ‌త్స‌ర‌మే ఈ ప్ర‌తిపాద‌న‌తో అఖిల ప‌క్షాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌ద్ద‌కు బిహార్ సీఎం నితీశ్ తీసుకువెళ్లారు. బిహార్‌లో ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీ మిన‌హా అన్ని పార్టీలు కుల‌గ‌ణ‌న‌కు సానుకూలంగానే ఉన్నాయి. బీజేపీ మాత్రం కేంద్రంలో వ్య‌తిరేక స్టాండ్‌ను, రాష్ట్రంలో అనుకూల స్టాండ్‌ను తీసుకోవ‌డం విశేషం.

కుల గ‌ణ‌నతో స‌మాజంలో చీలిక

కుల గ‌ణ‌న వ‌ల్ల స‌మాజంలో చీలిక ఏర్ప‌డుతుంద‌ని, ఆ త‌రువాత అది విప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌ని కేంద్రం భ‌య‌ప‌డుతోంది. అయితే, బిహార్‌లోని ఇత‌ర పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా కుల గ‌ణ‌న వ‌ల్ల సామాజికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారి కోసం మ‌రింత మెరుగైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని వాదిస్తోంది. చివ‌రి కుల ఆధారిత జ‌న‌గ‌ణ‌న 1931లో జ‌రిగింది.

Whats_app_banner

టాపిక్