Maharashtra politics | మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరూ భావించినట్లు.. దేవేంద్ర ఫడణవీస్ కాకుండా, శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేను సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై `హిందుస్తాన్ టైమ్స్ తెలుగు` రెగ్యులర్ అప్‌డేట్స్.. మీ కోసం..!
Thu, 30 Jun 202202:49 PM IST
కొత్త సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం
మహారాష్ట్ర 20 వ ముఖ్యమంత్రిగా గురువారం, జూన్ 30న శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణం చేశారు. వీరిద్దరిచే రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ ప్రమాణ స్వీకారం చేయించారు. సేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే వర్గం, బీజేపీ చెబుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వ పాలనలో మహారాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానన్నారు. అలాగే, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ను కూడా ప్రధాని అభినందించారు. బీజేపీ కార్యకర్తలకు ఫడణవీస్ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు. ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడ్తారన్న విశ్వాసం తనకుందని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు, ఏక్‌నాథ్ షిండేను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా అభినందించారు.
Thu, 30 Jun 202201:53 PM IST
ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్!
బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నాయి బీజేపీ వర్గాలు. తాను ప్రభుత్వంలో చేరబోనని, ప్రభుత్వం సజావుగా సాగేలా బయటి నుంచి మద్దతు ఇస్తానని ఫడణవీస్ మొదట్లో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించకపోవడం సహజమేనని అంతా భావించారు. అయితే, కాసేపటికి సమీకరణాలు మారాయి. దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో చేరుతారని, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణం చేస్తారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. ప్రభుత్వంలో చేరనని ప్రకటించడం ఆయన గొప్పతనమని, అయితే, ప్రభుత్వంలో చేరాలని తాను వ్యక్తిగతంగా ఫడణవీస్‌ను కోరానని ఆయన వెల్లడించారు. బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ బాధ్యతలు చేపడ్తారని అమిత్ షా వెల్లడించారు. మరి కాసేపట్లో మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
Thu, 30 Jun 202212:21 PM IST
ఫడణవీస్ ది గొప్ప మనసు: షిండే
బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ది చాలా గొప్ప మనసు అని మహారాష్ట్ర కాబోయే సీఎం, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ప్రశంసించారు. `ఫడణవీస్ కావాలనుకుంటే, సీఎం అయ్యేవారే. కానీ గొప్ప మనసుతో నన్ను సీఎం చేయడానికి ముందుకు వచ్చారు` అని కొనియాడారు. బీజేపీ, శివసేనలది సహజసిద్ధమైన భాగస్వామ్యమన్నారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో పరిస్థితిని ఫడణవీస్ సరిగ్గా వివరించారని, రెండున్నరేళ్లుగా పాలన నిలిచిపోయిందని తెలిపారు. మహా వికాస్ అఘాడీ పాలనలో శివసేన ఎమ్మెల్యేలెవరూ సంతోషంగా లేరన్నారు. ఇప్పుడు తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలంతా స్వచ్చంధంగా ముందుకు వచ్చినవారేనని, వారెవరూ ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం రాలేదని వివరించారు.
Thu, 30 Jun 202212:12 PM IST
ఇది బీజేపీ మాస్టర్ స్ట్రోక్
మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేను ఎంపిక చేయడం బీజేపీ మాస్టర్ స్ట్రోక్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనయర్ నేత, పాలనలో అపార అనుభవం ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌ను కాదని, శివసేనలో ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షిండేను సీఎంగా చేయాలనుకోవడం వెనుక గొప్ప వ్యూహం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఉద్ధవ్ ఠాక్రేను మోసం చేశారన్న శివసేన వాదనను ఎదుర్కోవడం, సామాన్య శివసేన సైనికుల్లో తమ ప్రభుత్వమే ఏర్పడిందన్న భావన కల్పించడం ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన అని వారు తెలిపారు. శివసేనలో షిండే నాయకత్వంలోని తిరుగుబాటు వర్గంపై ఉన్న వ్యతిరేకతను తొలగించడం, షిండే వర్గమే అసలైన శివసేన అనే భావనను ప్రచారం చేయడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణమని వివరించారు. మరోవైపు, షిండే సీఎం అయినా, రిమోట్ కంట్రోల్ తమ వద్దనే ఉంటుందని, షాడో సీఎంగా అధికారం తామే అనుభవించవచ్చన్న విశ్వాసం కూడా బీజేపీ లో ఉందని వివరించారు. అలాగే, వచ్చే ఎన్నికల నాటికి, పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించే దిశగా బీజేపీని బలోపేతం చేయాలనే వ్యూహం కూడా ఉందన్నారు.
Thu, 30 Jun 202211:56 AM IST
`బీజేపీ పాలన కొనసాగుతుంది`
గత రెండున్నరేళ్లలో మహారాష్ట్రలో పాలన పూర్తిగా నిలిచిపోయిందని బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ విమర్శించారు. కొత్తగా ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించకపోగా.. గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా నిలిపివేశారని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. ముంబై మెట్రో సహా.. గత బీజేపీ ప్రభుత్వంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. షిండే ప్రభుత్వానికి బీజేపీ తరఫున పూర్తి మద్ధతు ఉంటుందన్నారు.
Thu, 30 Jun 202211:43 AM IST
`హిందుత్వ హృదయ సామ్రాట్.. బాలాసాహెబ్ ఠాక్రే`
ఏక్‌నాథ్ షిండేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్.. శివసేన వ్యవస్థాపక నేత `బాలాసాహెబ్` బాల్ ఠాక్రేను గొప్పగా కొనియాడారు. హిందుత్వ హృదయ సామ్రాట్ అని ప్రశంసించారు. ఆయన ఆశయాలను షిండే ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనని, కానీ, ఉద్ధవ్ ఠాక్రే సైద్ధాంతికంగా శత్రుపక్షమైన ఎన్సీపీ కాంగ్రెస్‌లతో కలిశారని విమర్శించారు. బాలాసాహెబ్ ఆశయాలు, ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మార్గంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం సాగుతుందని ఫడణవీస్ వివరించారు.
Thu, 30 Jun 202211:36 AM IST
సాయంత్రం 7.30కి సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గురువారం సాయంత్రం 7.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. షిండేతో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. షిండే ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని, అందుకు తమ మద్దతు ఉంటుందని ఫడణవీస్ హామీ ఇచ్చారు.
Thu, 30 Jun 202211:32 AM IST
`రాష్ట్ర ప్రజల ఆకాంక్ష`
గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిసిన అనంతరం శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేతో కలిసి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, తదుపరి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేనేనని, షిండే ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తుందని సంచలన ప్రకటన చేశారు. కాబోయే సీఎం దేవేంద్ర ఫడణవీస్ అని అంతా భావిస్తున్న తరుణంలో, స్వయంగా ఫడణవీస్ ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 106 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. పలువురు స్వతంత్రులు సహా కేవలం 49 మంది మంది ఎమ్మెల్యేల మద్ధతున్న షిండే ను సీఎంగా చేసేందుకు అంగీకరించడం విశేషం. ``2019 ఎన్నికల సమయంలో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అదే. కానీ శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే మరోలా ఆలోచించారు. సైద్ధాంతికంగా శత్రు పక్షమైన ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఇది మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం`` అని దేవేంద్ర ఫడణవీస్ వివరించారు.
Thu, 30 Jun 202211:14 AM IST
ఫడణవీస్ కాదు.. ఏక్‌నాథ్ షిండేనే సీఎం
మహారాష్ట్రలో ఒక్కసారిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్, శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని గవర్నర్‌కు వివరించారు. తనకు మద్దతు ఇస్తున్న 49 మంది ఎమ్మెల్యేల సంతకాలున్న లేఖను షిండే గవర్నర్‌కు అందజేశారు. అనంతరం ఫడణవీస్, షిండ్ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఫడణవీస్.. అనూహ్య ప్రకటన చేశారు. మహారాష్ట్ర తదుపరి సీఎంగా శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ఉంటారని, తన ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
Thu, 30 Jun 202209:58 AM IST
షిండే కోసం ట్రాఫిక్ నిలిపివేత
ముంబై చేరుకున్న షిండే కాన్వాయ్ కోసం ముంబై ఏర్‌పోర్ట్ రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపేశారు. దాంతో విమానాశ్రాయానికి వెళ్లే ప్రయాణీకులు, ఏర్‌పోర్ట్ నుంచి సిటీకి వెళ్లే ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. చాలాసేపు ట్రాఫిక్‌ను నిలిపేయడంతో అసహనానికి లోనయ్యారు. షిండే కాన్వాయ్ వెళ్లిన తరువాతే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Thu, 30 Jun 202209:47 AM IST
గవర్నర్‌తో భేటీ
తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గురువారం ముంబై చేరుకున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ తదితరులతో కలిసి ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలవనున్నారు. ఈ మహా సంక్షోభంలో ఇక మిగిలింది దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, షిండే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడమే.
మాదే అసలైన శివసేన
ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని విన్నవించనున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను షిండే గవర్నర్‌కు అందించనున్నారు. 39 మంది ఎమ్మెల్యేల మద్దతున్న తమదే నిజమైన శివసేన అని గవర్నర్‌కు నివేదించనున్నారు.