ఎయిర్​ ఇండియాకు షాక్​.. కారణం ఆర్​ఎస్​ఎస్​!-ilker ayci declines tata group s offer to be ceo md of air india sources ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఎయిర్​ ఇండియాకు షాక్​.. కారణం ఆర్​ఎస్​ఎస్​!

ఎయిర్​ ఇండియాకు షాక్​.. కారణం ఆర్​ఎస్​ఎస్​!

HT Telugu Desk HT Telugu
Mar 01, 2022 02:52 PM IST

Air India CEO news | ఎయిర్​ ఇండియా కొత్త సీఈఓగా ఇల్కర్​ ఐసి త్వరలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తాజాగా.. ఆ పదవిని చేపట్టబోనని ఐసి తేల్చిచెప్పారు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది.

<p>ఇల్కర్​ ఐసి</p>
ఇల్కర్​ ఐసి (REUTERS)

Air India CEO | ఎయిర్​ ఇండియా కొత్త సీఈఓగా.. టర్కిష్​ ఎయిర్​లైన్స్​ మాజీ ఛైర్మన్​ ఇల్కర్​ ఐసిని టాటా సన్స్​ సంస్థ నియమించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. తాను ఆ బాధ్యతలు స్వీకరించబోనని ఐసి ప్రకటించారు. ఈ విషయాన్ని టాటా గ్రూప్​ సైతం ధృవీకరించింది.

ఐసి తప్పుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. ఈ నెల 14న ఆయన్ని సీఈఓగా నియమించింది టాటా సన్స్​. కాగా.. వారం రోజులకే ఆ సంస్థ నిర్ణయంపై దేశంలో వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా.. ఐసి నియామకానికి అంగీకరించొద్దని కేంద్రానికి ఆర్​ఎస్​ఎస్​ విజ్ఞప్తి చేసింది. టర్కీ రాజకీయాలు, అక్కడి నేతలతో ఐసికి ఉన్న సంబంధాలు దేశానికి కీడు చేస్తాయని ఆర్​ఎస్​ఎస్​ అభిప్రాయపడింది.

భారత్​లో.. ఏదైనా సంస్థకు విదేశీ సీఈఓను నియమించాలంటే.. అందుకు ప్రభుత్వ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. కాగా.. టర్కీతో ఇటీవలి కాలంలో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ఐసి నియామకంపై ప్రభుత్వం కూడా అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణం కన్నా ఎక్కువగా ఐసిపై భద్రతాపరమైన తనిఖీలు చేసినట్టు సమాచారం.

ఎయిర్ ​ఇండియా సీఈఓగా ఏప్రిల్​ 1న ఐసి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలతో.. తాను ఆ స్థానాన్ని తీసుకోబోనని ఐసి ప్రకటించారు. టాటా గ్రూప్​ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు.

"ఎయిర్ ​ఇండియా సీఈఓగా నన్ను ఎంపిక చేయడంపై అనవసరమైన రాజకీయ రంగులు పులుముతున్నారు. ఓ వ్యాపార నేతగా.. నేను ఎప్పుడూ నా వృత్తికే అధిక ప్రాధాన్యతనిచ్చాను. తాజా పరిణామాలతో.. ఇక నేను ఈ ఆఫర్​ను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అదే మంచిదని అనిపించింది," అని ఐసి వెల్లడించారు.

టాటాకు మరిన్ని చిక్కులు..!

Air India | ఎయిర్​ ఇండియా.. ఇటీవలే అధికారికంగా టాటా గ్రూప్​లో చేరింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కొత్త సీఈఓను ప్రకటించింది. అంతా సజావుగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో.. ఐసి తప్పుకున్నారు. ఫలితంగా ఇప్పుడు మళ్లీ కొత్త సీఈఓను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజా పరిణామాలపై ఎయిర్​ ఇండియా, టాటా సన్స్​ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎయిర్​ ఇండియాకు సీఈఓ అంటే చాలా క్లిష్టమైన ఉద్యోగమే అని చెప్పాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను విజయవంతంగా నడిపించాలంటే, అందుకు తగ్గట్టు నాయకత్వం సైతం ఉండాలి. మరి ఇప్పుడు ఎయిర్ ​ఇండియా ఎవరిని సీఈఓగా ఎంపిక చేస్తుందనేది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం.. ఎయిర్ ​ఇండియా చేతిలో 4,400 స్వదేశీ, 1,800 విదేశీ ల్యాండింగ్​, పార్కింగ్​ స్లాట్లు ఉన్నాయి.

1932లో టాటా ఎయిర్​లైన్స్​ పుట్టింది. 1946లో దానిని ఎయిర్​ ఇండియాగా నామకరణం చేశారు. 1953లో అది ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇటీవలే తిరిగి టాటాలతో చేరింది.

 

Whats_app_banner