IIT student suicide: ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ విద్యార్థి
IIT student suicide: మధ్య ప్రదేశ్ కు చెందిన ఒక విద్యార్థి ఐఐటీ మద్రాసు క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఐఐటీ మద్రాస్ (IIT Madras) క్యాంపస్ లో ఇది నాలుగో ఆత్మహత్య.
IIT student suicide: ఐఐటీ మద్రాసు (IIT Madras) క్యాంపస్ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మధ్య ప్రదేశ్ కు చెందిన కేదార్ సురేశ్ (Kedar Suresh) అనే విద్యార్థి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Indian Institute of Technology IIT ) మద్రాస్ క్యాంపస్ లో బీ టెక్ కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. IIT Madras క్యాంపస్ లోని కావేరీ హాస్టల్ లో ఉన్న తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి సురేశ్ ఉంటున్న గది తలుపులు మూసి ఉండడం, తలుపు తట్టినా తెరవకపోవడంతో సహ విద్యార్థులు హాస్టల్ మేనేజ్మెంట్ కు సమాచారమిచ్చారు. హాస్టల్ అధికారులు పోలీసులకు సమాచారమివ్వడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ గది తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వారికి సీలింగ్ కు ఉరివేసుకుని చనిపోయి ఉన్న సురేశ్ కనిపించాడు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సురేశ్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
IIT student suicide: నాలుగో బలవన్మరణం
ఈ సంవత్సరం ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో చోటు చేసుకున్న నాలుగో ఆత్మహత్య ఇది. 2018 నుంచి ఈ క్యాంపస్ లో 12 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇదే నెల 2వ తేదీన ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో పశ్చిమబెంగాల్ కు చెందిన పీహెచ్డీ (PhD) విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.