ఆదిలాబాద్​లో ఉగ్రవాదుల సంచారం..! పోలీసుల ముమ్మర తనిఖీలు-haryana police to probe link of terror suspects held in karnal with ied recovered in ambala ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆదిలాబాద్​లో ఉగ్రవాదుల సంచారం..! పోలీసుల ముమ్మర తనిఖీలు

ఆదిలాబాద్​లో ఉగ్రవాదుల సంచారం..! పోలీసుల ముమ్మర తనిఖీలు

HT Telugu Desk HT Telugu
May 06, 2022 11:08 AM IST

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హరియాణా ఉగ్రకుట్ర భగ్నం ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేసును ఛేదించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. కాగా తెలంగాణలోని ఆదిలాబాద్​లో కొంతమంది అనుమానిత ఉగ్రవాదులు సంచిస్తున్నట్టు సమాచారం అందడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు.

<p>హరియాణాలో ఉగ్ర కుట్ర భగ్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం</p>
హరియాణాలో ఉగ్ర కుట్ర భగ్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Terror suspects held in Karnal | హరియాణాలో 'ఉగ్ర కుట్ర భగ్నం' ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. తాజాగా.. కేసును ఛేదించేందుకు కర్నల్​ పోలీసులకు సహకరించేందుకు అంబాలా పోలీసులు సైతం రంగంలోకి దిగారు.

"నలుగురు అనుమానితులను కర్నల్​ పోలీసులు అరెస్ట్​ చేసినట్టు సమాచారం అందింది. కొన్ని నెలల క్రితమే.. అంబాలాలో ఓ ఐఈడీని స్వాధీనం చేసుకున్నాము. ఈ ఘటనకు, నిందితులకు ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ జరపాల్సి ఉంది. అందుకే కర్నల్​ పోలీసులతో కలిసి దర్యాప్తు చేసేందుకు సిద్ధపడ్డాము," అని అంబాలా ఎస్​పీ జహన్​దీప్​ వెల్లడించారు.

పంజాబ్ నుంచి తెలంగాణ‌లోని ఆదిలాబాద్​కు చేరవేసేందుకు పేలుడు ప‌దార్ధాలతో వెళ్తున్న కారును హ‌రియాణా పోలీసులు గురువారం అడ్డుకున్నారు. ఫలితంగా దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నలుగురు నిందితులు.. పంజాబ్​కు చెందినవారేనని తెలుస్తోంది. నిందితుల పేర్లు గుర్​ప్రీత్​, అమన్​దీప్​, పర్మిందర్​, భూపేందర్​ అని సమాచారం. వీరికి పాకిస్థాన్​ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వీరి నుంచి మూడు ఐఈడీలు, 31 బుల్లెట్లు, పిస్టోల్​, ఆరు ఫోన్లు, రూ. 1.3లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నాందేడ్​ నుంచి మరో పోలీసు బృందం..

నలుగురు నిందితులను ప్రశ్నించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్​ పోలీసుల బృందం.. హరియాణాకు వెళ్లింది. హరియాణా నుంచి నిందితులు నాందేడ్​కు సమీప ప్రాంతానికి వెళ్లాలని భావించినట్టు ఓ పోలీసు అధికారి చెప్పడం ఇందుకు కారణం.

"కర్నల్​కు మా పోలీసు బృందాన్ని పంపించాము. నలుగురు నిందితులను ఆ బృందం విచారిస్తుంది. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము," అని నాందేడ్​ ఎస్​పీ ప్రమోద్​కుమార్​ స్పష్టం చేశారు.

తెలంగాణలో తనిఖీలు..

ఆదిలాబాద్​కు మందుగుండు సామాగ్రి, ఆయుధాలను తరలించేందుకు నిందితులు ప్రణాళికలు వేశారన్న వార్తలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆదిలాబాద్​లోని పలు ప్రాంతాలు, డాబాల వద్ద అనుమానిత ఉగ్రవాదులు సంచరించినట్టు సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Whats_app_banner

సంబంధిత కథనం