Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో కేసు నమోదు-fir against rahul gandhis bharat jodo nyay yatra for route deviation in assam ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Jan 19, 2024 05:50 PM IST

Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రం
అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రం (AICC)

Bharat Jodo Nyay Yatra: అస్సాంలోని జోర్హాట్ పట్టణంలో అనుమతించిన మార్గంలో కాకుండా, వేరే మార్గంలో భారత్ జోడో న్యాయ యాత్రను కొనసాగించి, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

యాత్ర దారి మార్చారు..

భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. గురువారం నాడు అస్సాంలోని జోర్హాట్ పట్టణంలో ఆమోదించిన మార్గం లో కాకుండా వేరే మార్గంలో కొనసాగించి నిబంధనలను ఉల్లంఘించారని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' పై, అస్సాంలో యాత్ర ప్రధాన నిర్వాహకుడు కేబీ బైజుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోర్హాట్ పట్టణంలో ఈ యాత్రను అనుమతి లేని మార్గంలో కొనసాగించారు. ఈ యాత్రను కెబి రోడ్ మార్గం నుండి కొనసాగించడానికి పోలీసులు మొదట అనుమతినిచ్చారు. కానీ, ఆ మార్గంలో వెళ్లకుండా, వేరే ఇరుకైన మార్గంలోకి యాత్ర వెళ్లడంతో, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కొందరు కింద పడిపోయి గాయాల పాలయ్యారు.

యాత్రను అడ్డుకోవడానికే..

రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో న్యాయ యాత్ర కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ఈ విషయాన్ని జీర్ణం చేసుకోలేక అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం యాత్రపై కేసులు నమోదు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. “పీడబ్ల్యూడీ పాయింట్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులెవరూ లేరు. పోలీసులు అనుమతించిన మార్గం చాలా ఇరుకుగా ఉన్నది. ప్రజలు భారీగా తరలి వచ్చారు. కాబట్టి, మేము కేవలం కొంత దూరం విశాలమైన మార్గంలో వెళ్లాము. యాత్ర అస్సాంలో విజయవంతం అవుతుండడంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు” అని అస్సాం కాంగ్రెస్ నాయకుడు దేవవ్రత సైకియా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ, "ఏ నిబంధనలను ఉల్లంఘించలేదు. భారత్ జోడో న్యాయ యాత్రలో చేరకుండా ప్రజలను ఆపడానికి అస్సాం సిఎం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాత్రను ఎవరూ ఆపలేరు’’ అని ట్వీట్ చేశారు.

అస్సాంలో…

కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ యాత్ర శుక్రవారం అస్సాంలోని మజులీకి చేరుకుంది. జనవరి 25వ తేదీ వరకు ఈ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. అస్సాంలో ఈ యాత్ర 17 జిల్లాల మీదుగా 833 కి.మీ.ల మేర సాగనుంది. ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.

Whats_app_banner