Electoral bonds : జూన్ 30 వరకు గడువు అడిగితే.. 24 గంటలే సమయం- ఎస్బీఐ ఇప్పుడు ఏం చేస్తుంది?
SBI Electoral bonds : ఎస్బీఐకి షాక్ ఇస్తూ.. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మార్చ్ 12 సాయంత్రం నాటికి సమర్పించాలని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. దాదాపు 3 నెలల సమయం అడిగిన ఎస్బీఐ ముందు ఇప్పుడు కేవలం 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. మరి ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది?
Supreme court on Electoral bonds : ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం కావాలని ఎస్బీఐ చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. మార్చ్ 12 సాయంత్రం నాటికి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందే అని తేల్చిచెప్పింది. మిగిలిన 24 గంటల్లో ఎస్బీఐ ఏం చేస్తుంది? అని ఉత్కంఠ నెలకొంది.
24 గంటల్లో ఎస్బీఐ ఏం చేస్తుంది?
ఏ వ్యక్తి లేదా ఏ సంస్థ.. ఎంత విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనుగోలు చేశారు? ఏ రాజకీయ పార్టీకి ఎంత ఇచ్చారు? ఏ రాజకీయ పార్టీ ఎంత నిధులను ఎన్‌క్యాష్ చేసుకుంది? వంటి వివరాలను మ్యాచ్ చేసేందుకు సమయం పడుతుందని, అందుకే గడువును పొడిగించాలని అడినట్టు పిటిషన్లో చెప్పింది ఎస్బీఐ.
అయితే.. వివరాలను మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదని, ఎవరు విరాళం ఇచ్చారు? ఏ పార్టీ ఎంత ఎన్‌క్యాష్ చేసింది? అని వేరువేరుగా ఇస్తే చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మ్యాచ్ చేయాలని తాము తీర్పులో చెప్పలేదని పేర్కొంది. అందుకే.. మార్చ్ 12 సాయంత్రం నాటికి.. డోనర్లు, విరాళల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని తేల్చిచెప్పింది.
SBI electoral bonds issue : అయితే.. మిగిలిన 24 గంటల సమయంలో ఎస్బీఐ ఏం చేస్తుంది? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో.. వివరాలు మ్యాచ్ అవ్వకపోతే.. ఎవరు, ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారు? అన్న విషయంపై క్లారిటీ ఉండదు! డోనర్స్ పేర్లు, పార్టీలకు అందిన విరాళాల పేర్లు మాత్రమే.. ఈసీకి ఎస్బీఐ సమర్పించే అవకాశం ఉంది. ఆ వివరాలను మార్చ్ 15 సాయంత్రం నాటికి.. ఈసీ తన వెబ్సైట్లో పబ్లీష్ చేయాల్సి ఉంది.
ఒకవేళ వివరాలను ఎస్బీఐ సమర్పించకపోతే.. అది కోర్టు దిక్కరణ కిందకు వస్తుంది. కోర్టు దిక్కరణను ఈసారి సహించబోమని తాజా ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రానున్న రోజుల్లో రాజకీయ ప్రకంపనలు..!
ఏది ఏమైనా.. ఎలక్టోరల్ బాండ్స్ డోనర్లు, రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకున్న డబ్బుల వివరాల వ్యవహారం.. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.
Supreme court latest news : సుప్రీంకోర్టు తాజా తీర్పును విపక్షాలు స్వాగతించాయి. వివరాలను మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదని, డోనర్లు పేర్లు- పార్టీలు ఎంత రిడీమ్ చేసుకున్నాయి? వంటి వివరాలు చెబితే చాలని, ప్రజలకు నిజాలు అర్థమైపోతాయని బీజేపీని ఉద్దేశించి ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
మరికొందరు మాత్రం.. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజా హక్కులు మరింత బలోపేతమైనట్టు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల విషయంలో పార్టీలకు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి పార్టీలకు నిధులు వస్తున్నాయి? అన్న వివరాలు ప్రజలు తెలుసుకోవడం చాలా అవసరం అని, ఎలక్టోరల్ బాండ్స్‌తో అవి తెలిసేవి కావని అంటున్నారు.
సంబంధిత కథనం