Draft data protection Bill : వ్యక్తిగత డేటాను దుర్వినియోగిస్తే.. భారీ జరిమానా!
Draft data protection Bill : డేటాను ఎవరైనా దుర్వినియోగిస్తే.. రూ. 500కోట్ల వరకు జరిమానా విధించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది! ఈ మేరకు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ముసాయిదా బిల్లును విడుదల చేసింది కేంద్రం.
Draft data protection Bill : '2022 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు'కు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తే.. రూ. 500కోట్ల వరకు భారీ స్థాయిలో జరిమానా విధించడంతో పాటు పలు కీలక అంశాలను ఇందులో ప్రతిపాదించింది. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో.. డేటా వినియోగానికి సంబంధించి రూల్స్, చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
బిల్లులో భాగంగా.. ఒక విచారణ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఎవరైనా డేటా దుర్వినియోగానికి పాల్పడినట్టు రుజువైతే.. గరిష్ఠంగా రూ. 500కోట్ల వరకు జరిమానా విధించేందుకు వీలుగా బిల్లులో నిబంధనలు పెట్టినట్టు పేర్కొంది. డేటాను సేకరించిన సంస్థలు.. తగిన రక్షణాత్మక చర్యలు తీసుకోకపోతే.. రూ. 250కోట్ల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లులో వెసులుబాటు కల్పించినట్టు స్పష్టం చేసింది.
Data protection Bill : ఈ బిల్లును పరిశీలిస్తే.. డేటా బ్రీచ్ను కేంద్రం అత్యంత తీవ్రంగా పరిగణించినట్టు అర్థమవుతోంది. డేటా బ్రీచ్ జరిగిందని విచారణ బర్డుకు నోటిఫై చేయకపోయినా, పిల్లలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోయినా.. రూ. 200కోట్ల వరకు జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధపడింది. బిల్లు అమల్లోకి వస్తే.. పిల్లలకు సంబంధించి ఎవరైనా డేటాను సేకరించాలని భావిస్తే.. ఆ విషయాన్ని తొలుత వారి తల్లిదండ్రులకు చెప్పి, వారి నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు.. వ్యక్తిగత డేటాను నిర్దిష్ట దేశాలకు ట్రాన్స్ఫర్ చేసేందుకు, అక్కడ నిల్వ ఉంచేందుకు అనుమతులు ఇస్తూ.. ఈ డేటా ప్రొటెక్షన్ ముసాయిదాను రూపొందించింది కేంద్రం. సంబంధిత దేశాల జాబితాను రానున్న కాలంలో నోటిఫై చేయనుంది.
Data protection Bill India : ప్రస్తుతం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ముసాయిదా బిల్లును ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచింది కేంద్రం. డిసెంబర్ 17 వరకు.. ఎవరైనా తమ అభ్యంతరాలను, సలహాలను పంచుకోవచ్చు.