Chandrayaan 3: విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు నిద్రలేస్తాయా?.. చంద్రయాన్ 3 పై ఇస్రో ఏమంటోంది?-chandrayaan 3 news isro continues vikram pragyan revival efforts details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Chandrayaan 3 News: Isro Continues Vikram, Pragyan Revival Efforts. Details Here

Chandrayaan 3: విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు నిద్రలేస్తాయా?.. చంద్రయాన్ 3 పై ఇస్రో ఏమంటోంది?

HT Telugu Desk HT Telugu
Sep 23, 2023 04:23 PM IST

Chandrayaan 3: చంద్రుడి ఉపరితలంపై దాదాపు 15 రోజుల క్రితం నిద్రావస్థలోకి వెళ్లిన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను నిద్ర లేపే ప్రయత్నాలను ఇస్రో కొనసాగిస్తోంది.

చంద్రుడిపై దిగిన విక్రం ల్యాండర్ (ఫైల్ ఫొటో)
చంద్రుడిపై దిగిన విక్రం ల్యాండర్ (ఫైల్ ఫొటో) (ISRO twitter)

Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 4 వ తేదీ వరకు అక్కడ పరిశోధనలు చేశాయి. విలువైన సమాచారాన్ని సేకరించాయి. అరుదైన ఫొటోలను పంపించాయి.

ట్రెండింగ్ వార్తలు

నిద్ర లేపే ప్రయత్నం..

సెప్టెంబర్ 4 నుంచి చంద్రడిపై రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను ఇస్రో నిద్రావస్థలోకి పంపించింది. 15 రోజుల పాటు నిద్రావస్థలో ఉన్న విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు చంద్రుడిపై సూర్యోదయం కాగానే, సోలార్ ప్యానెళ్ల ద్వారా శక్తిని గ్రహించి మేలుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇస్రో ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు ఫలించలేదు. విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ల నుంచి ఎలాంటి సంకేతాలు ఇస్రోకు అందలేదు. దాంతో, వాటిని మళ్లీ యాక్టివేట్ చేసే కార్యక్రమాన్ని ఇస్రో శనివారం నుంచి మళ్లీ ప్రారంభించింది.

ఫలితం లేదు..

విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను మళ్లీ యాక్టివేట్ చేసే ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదని ఇస్రో ప్రకటించింది. ‘ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. వాటితో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడి వాతావరణాన్ని తట్టుకుని మళ్లీ యాక్టివేట్ కావడానికి 50% అవకాశాలు మాత్రమే ఉన్నాయి’’ అని ఇస్రో వెల్లడించింది.

యాక్టివేట్ అయితే.. అది బోనసే..

విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు తమ బాధ్యతలను ఇప్పటికే పూర్తి చేశాయని,ఒకవేళ మళ్లీ రివైవ్ అయితే, అది బోనసేనని ఇస్రో వెల్లడించింది. పేలోడ్స్ మళ్లీ పని చేయడం ప్రారంభించి, ఏదైనా సమాచారం పంపిస్తే, దాన్ని బోనస్ గానే భావించాలని వ్యాఖ్యానించింది. విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లపై ఉన్న సౌర ఫలకలు మళ్లీ విజయవంతంగా చార్జి అయ్యి, విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లలోని ఎలక్ట్రానిక్ యంత్ర సామగ్రి యాక్టివేట్ అయితే, మళ్లీ కొన్ని రోజులు అవి చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలను కొనసాగిస్తాయని తెలిపింది.

WhatsApp channel