Byju’s: పిల్లల తల్లిదండ్రులను బైజూస్ బెదిరిస్తోంది: NCPCR ఆరోపణలు-byjus buying phone numbers of children and their parents threatening them ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Byju’s: పిల్లల తల్లిదండ్రులను బైజూస్ బెదిరిస్తోంది: Ncpcr ఆరోపణలు

Byju’s: పిల్లల తల్లిదండ్రులను బైజూస్ బెదిరిస్తోంది: NCPCR ఆరోపణలు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 21, 2022 12:19 AM IST

Allegations on Byju’s: పిల్లలు, వారి తల్లిదండ్రులను ఎడ్ టెక్ కంపెనీ ‘బైజూస్’ బెదిరిస్తోందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చీఫ్ ఆరోపించారు. విద్యార్థులపైనా ఒత్తిడి చేస్తోందని అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Live Mint)

Allegations on Byju’s: ప్రముఖ ఎడ్‍టెక్ కంపెనీ బైజూస్ (Byju’s)పై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చీఫ్ కీలక ఆరోపణలు చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సంపాదించి.. వారిని బైజూస్ బెదిరిస్తోందని అన్నారు. తమ కోర్సులు తీసుకోకపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని బైజూస్ భయపెడుతోందని ఆరోపించారు. వివరాలివే..

‘చర్యలు తీసుకుంటాం’

“పిల్లలు, వారి తల్లితండ్రుల ఫోన్ నంబర్లను బైజూస్ ఎలా సంపాదిస్తుందో, వారిని ఎలా ఫాలో చేస్తోందో మాకు తెలిసింది. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఎలా బెదిరిస్తుందో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ (ప్రాథమిక స్థాయి)ను వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మేం ఈ విషయంపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేస్తాం” అని NCPCR చీఫ్ ప్రియాంక్ కనూంగో చెప్పారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

అలాగే, ఇప్పటికే ఉన్న కస్టమర్లను కోర్సుల కోసం లోన్ ఆధారిత అగ్రిమెంట్లు తీసుకునేలా బైజూస్ ఒత్తిడి చేస్తోందని కూడా ఆయన చెప్పారని ఆ రిపోర్టులో ఉంది. లోన్ బేస్డ్ అగ్రిమెంట్ అయితే ఒకవేళ కస్టమర్లు కోర్సును రద్దు చేసుకోవాలనుకున్న రీఫండ్ ఉండదని, అందుకే బైజూస్ ఇలా ఒత్తిడి చేస్తుందని ఆ చైల్డ్ ప్యానెల్ వెల్లడించింది.

ముందుగా, బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్‍కు NCPCR నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 23న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఒత్తిడి చేసి పిల్లలకు కోర్సులను విక్రయించడం, కోర్సుల విషయంలో తప్పుదోవ పట్టించడం లాంటి ఆరోపణలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. పిల్లల కోసం తల్లిదండ్రులు కోర్సులు తీసుకునేలా చేసేందుకు బైజూస్ కంపెనీ సేల్స్ టీమ్ అక్రమాలకు పాల్పడుతోందని ఇటీవల వార్తా నివేదిక ఒకటి వచ్చింది. దాని ఆధారంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ చర్యలకు ఉపక్రమించింది.

Whats_app_banner

టాపిక్