Earthquake: జమ్మూకశ్మీర్ లో భూకంపం; ఢిల్లీ పరిసరాల్లోనూ ప్రకంపనలు
జమ్మూకశ్మీర్లో మంగళవారం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత వల్ల ఢిల్లీ, పంజాబ్, పలు ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వర్ కు ఆగ్నేయ దిశగా 30 కిమీల దూరంలో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత వల్ల ఢిల్లీ, పంజాబ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి.
భూకంప కేంద్రం
పంజాబ్ లోని పఠాన్ కోట్ కు ఉత్తరంగా 99 కిమీల దూరంలో, 60 కిమీల లోతున ఈ భూ కంప కేంద్రం ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగడంతో ప్రజలు భయాందోళలకు గురయ్యారు. పాఠశాలల్లో పిల్లలు భయపడ్డారని టీచర్లు తెలిపారు.ఇళ్లు, షాపుల్లో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. వారం క్రితం వచ్చిన భూకంపం కన్నా దీని తీవ్రత అధికంగా ఉందని జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని ఒక షాపు యజమాని తెలిపారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. మంగళవారం తెల్లవారు జామున మయన్మార్ లో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు, మే 31న కూడా మయన్మార్ లో 5.7 తీవ్రతతో భూమి కంపించింది.
పాకిస్తాన్ లో కూడా..
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో భూమి కంపించింది. భూ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగడంతో ప్రజలు భయాందోళలకు గురయ్యారు. మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో తూర్పు పాకిస్తాన్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని జియో న్యూస్ వెల్లడించింది. లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, అబోటాబాద్, జీలమ్, జఫర్వాల్ తదితర నగరాల్లో, సమీప ప్రాంతాల్లో ఈ భూకంపం వల్ల ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.