Throwback Thursday । నిజమైన ప్రేమంటే ఇదీ.. ప్రేమకోసం యుద్ధం చేసిన ఓ వీరుడి వీర ప్రేమ గాథ!-throwback thursday indulge in the epic love story of sri sita rama on their special day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Throwback Thursday- Indulge In The Epic Love Story Of Sri Sita Rama On Their Special Day

Throwback Thursday । నిజమైన ప్రేమంటే ఇదీ.. ప్రేమకోసం యుద్ధం చేసిన ఓ వీరుడి వీర ప్రేమ గాథ!

Manda Vikas HT Telugu
Mar 30, 2023 05:05 AM IST

Throwback Thursday: ప్రేమకోసం యుద్ధాలు జరుగుతాయి, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది, ప్రేమ విలువను తెలిపే ఒక వీరప్రేమగాథ చదవండి.

Throwback Thursday
Throwback Thursday (Unsplash/freepik)

Throwback Thursday: ప్రేమ అనేది రెండు అక్షరాల పదం, కానీ ఇందులో సముద్రమంత లోతు ఉంటుంది. నిజమైన ప్రేమ మాటల్లో చెప్పలేనిది, కానీ అది సందర్భం వచ్చినపుడు ఉప్పెనలా బయటకు వస్తుంది, తన ప్రేమ కోసం ఎంత దూరం అయినా నడిచేలా చేస్తుంది. అవసరమైతే యుద్ధాన్ని కూడా చేయిస్తుంది. ఇక్కడ చెబుతున్నది ఏదో కథ కాదు, ఇదొక గొప్ప చరిత్ర. మీ అందరికీ తెలిసిన ఒక వీర ప్రేమ గాథ.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైనపుడు ఆ బాధ వర్ణించడానికి కూడా మాటలు చాలవు. అన్నీ వదులుకొని ఒకరికోసం ఒకరు జీవిస్తుంటే వాళ్లను విడదీసిన పాపం ఊరికే పోదు. తన ప్రాణానికి మరో ప్రాణమైన వ్యక్తిని దూరం చేస్తే, ప్రాణాలకు తెగించి, వీరోచితంగా పోరాడి తన ప్రేమను దక్కించుకున్నాడు ఓ మహనీయుడు. ఇంతకీ ఈ ప్రేమకథ ఎవరిది? తెలుసుకోవాలంటే చరిత్రపుటల్లోకి వెళ్లాల్సిందే.

అనగనగనగా ఓ యువరాజు ఉండే వాడు, ఆయన మచ్చలేని చంద్రుడు. యువరాజు అయి ఉండి కూడా ఏనాడు ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు. కానీ ఒకానొక సందర్భంలో ఒక అందమైన యువతిని చూడాల్సి వస్తుంది. చూసీచూడంగానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ఎంతో గుణవంతురాలు, ఆమెకు తొలిచూపులోనే ఈ యువరాజు చాలా నచ్చేస్తాడు. అయితే వీరిద్దరికీ ఒకరికొకరు నచ్చినా, ఆ విషయం చెప్పుకోరు. అయితే ఒకరోజు ఆ అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఎంతో గుణవంతురాలు, సిరిసంపదలు కలిగిన ఆ యువతిని పెళ్లాడాలంటే మహా వీరుడై ఉండాలని ఆమె తండ్రి ఆకాంక్షిస్తాడు. కానీ ఆమె మనసులో మాత్రం తాను తొలిసారిగా చూసిన యువరాజు మాత్రమే ఉంటాడు, కానీ తండ్రి మాట విని పెళ్లిచూపులకు ఒప్పుకుంటుంది. యాదృచ్చికంగా ఆ పెళ్లి చూపులకు తాను మనసు పడినవాడు కూడా వస్తాడు, తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గి ఆమెను మనువాడుతాడు. అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరుగుతుంది. అప్పటి నుంచి వారి ప్రేమకథ మొదలవుతుంది.

ఆ ఇద్దరిదీ ఎంతో అందమైన జంట, భార్యాభర్తలకు సరైన నిర్వచనం వారు. ప్రేమకు ప్రతిరూపం వారు. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. భర్త ఏం చెప్పినా ఆమెకు అదే శిరోధార్యం, భార్య మాటలు ఆయనకు అమృతం. సంపన్న కుటుంబం కాబట్టి వారి కాపురం ఎలాంటి లోటు లేకుండా సాగిపోతుంది. కానీ, ఒకరోజు కుటుంబ కలహాల వలన ఆ యువరాజు తన రాజ్యాన్ని, రాజభోగాలను, ఐశ్వర్యాలను అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. కట్టుబట్టలతో ఆ భార్యభర్తలు ఇద్దరు బయటకు వచ్చేస్తారు, ఎక్కడో దూరంగా ఎలాంటి సౌకర్యాలు లేనిచోట జీవిస్తారు. వారికి పెళ్లయి కొంతకాలమే అయింది. తన భార్యను ఎంతో అపురూపంగా చూసుకుందామనుకుంటే, ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ సందర్భంలో ఆమెకు తన పుట్టినుండి పిలుపు వస్తుంది. ఇలాంటి బ్రతుకు నీకు అవసరం లేదు, మన ఇంట్లో సిరిసంపదలకు కొదువ లేదు, మళ్లీ యువరాణిలా బ్రతకవచ్చునని చెబుతారు. కానీ ఆమెకు తన భర్తే ప్రాణం అని చెబుతుంది. ఆయనతో కలిసి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తానని వారి తల్లిదండ్రులకు తేల్చి చెబుతుంది. దీంతో వారు అందరూ ఉన్నా, అనాధల్లా బ్రతకవలసి వస్తుంది.

మంచిరోజులు రాకపోతాయా అని కాలం వెళ్లదీస్తూ ఉంటారు, అయినప్పటికీ ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు సంతోషంగా, ఆన్యోన్యంగా జీవిస్తారు. అయితే ఆమెపై ఓ దుర్మార్గుడి కన్నుపడుతుంది, ఒకరోజు తన భర్త ఇంట్లో లేని సమయం చూసి ఆ దుర్మార్గుడు వారు నివసిస్తున్న చోటుకి వస్తాడు, మాయమాటలు చెప్పి ఆమెను అక్కడ్నించి అపహరించుకుపోతాడు. భర్త తిరిగి వచ్చి చూడగా ఆమె ఉండదు. ఆమె కోసం గట్టిగా అరుస్తాడు, బాధతో ఏడుస్తాడు, ఏం జరిగిందేమోనని చాలా కంగారు పడతాడు. తన ప్రాణం పోయినంతగా విలవిలలాడుతాడు. చుట్టూ అంతటా వెతుకుతాడు కానీ ఎక్కడా ఆమె జాడ తెలియదు. రోజులు గడుస్తాయి, గడిచే ఒక్కొక్క క్షణం ఒక యుగంగా గడుపుతాడు. ఆమె కోసం తన వెతుకులాటను కొనసాగిస్తాడు. ఇలా వెతుకుతూ వెతుకుతూ కొన్ని రోజులకు తనకు దారిలో ఎదురైన వారి సహాకారంతో ఎట్టకేలకు ఆమెను ఒక రహస్య ద్వీపంలో ఒక దుర్మార్గపు రాజు బంధించినట్లు తెలుసుకుంటాడు. ఇక, అప్పటి నుంచి అతడు ఆగడు, అడవులు, నదులు, సముద్రాలు దాటి ఆగమేఘల మీద తన ప్రేయసి ఉన్నచోటును వెళ్తాడు. తన భార్యను బంధించిన ఆ రాజుతో యుద్ధం చేసి, ఆ రాజును సంహరించి తన ప్రేమను గెలుస్తాడు. ఈ ప్రేమాయణమే మన రామాయణం!

శ్రీరాముడు ఒక వీరుడు, శూరుడు, అంతకు మించి ఆయన ఒక రాజ వంశీయుడు. ఆయన కోరుకుంటే ఎంతమంది అప్సరసలైనా దొరుకుతారు, ఎలాంటి మహారాజులైన తమ రాజ్యాలను కానుకగా ఇచ్చి వారి కుమార్తెలను ఆయన చేతుల్లో పెడతారు. కానీ, ఇవేవి కోరుకోకుండా.. తాను కట్టుకున్న భార్య కోసం, కన్నవారిలా తల్లడిల్లుతూ.. కష్టాల కడలిని దాటుకుంటూ, ఎక్కడో అయోధ్య సమీపంలోని అరణ్యాల నుంచి మరెక్కడో ఓ మూలనా, సుదూర తీరాన ఉన్న తన సీత జాడను తెలుసుకొని, ఆమె కోసం వానర సైన్యాన్ని పోగుచేసి, లంక రాజ్యంపై దండించి, అరివీర భయంకరుడైన రావణ సంహారం చేసి, వీరోచితంగా తన భార్యను దక్కించుకున్నాడంటే.. సీతంటే రాముడికి ఎంత ప్రేమ? ఎంత ప్రేమ లేకపోతే సీత కోసం రాముడు ఇంత చేస్తాడు? తన రాముడు తన కోసం తప్పకుండా వస్తాడని నమ్మకంతో ఎదురుచూసిన సీతకు రాముడంటే మరెంత ప్రేమ. ప్రేమ గొప్పది అని చెప్పటానికి ఇంతకంటే గొప్ప ఉదాహారణ ఇంకేం ఉంటుంది. రామాయణాన్ని మించిన మహా ప్రేమ కావ్యం మరొకటి ఏది ఉంటుంది. సీతారాముల ప్రేమ తరతరాలకు ఆదర్శవంతమైనది. భార్యాభర్తలు అందరూ సీతారాములను ఆదర్శంగా తీసుకోవాలి. జై శ్రీ సీతారామ్.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

WhatsApp channel