Herbs for Healthy Weight । ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి మీ ఆహరంలో ఈ 5 చేర్చండి!-know about 5 herbs that help you maintain healthy weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Herbs For Healthy Weight । ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి మీ ఆహరంలో ఈ 5 చేర్చండి!

Herbs for Healthy Weight । ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి మీ ఆహరంలో ఈ 5 చేర్చండి!

HT Telugu Desk HT Telugu
Dec 26, 2022 03:16 PM IST

Herbs for Healthy Weight: ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని మసాలా దినుసుల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Herbs for Weight Loss
Herbs for Weight Loss (Unsplash)

కరోనా తదనంత పరిణామాలతో ఈ ఏడాది కూడా చాలా మంది 'వర్క్ ఫ్రమ్ హోమ్' కే పరిమితమయ్యారు. ఇంటికే ఎక్కువగా పరిమితం అవడం వలన ఫిట్‌నెస్‌ విషయాన్ని మరిచిపోయారు. కానీ కొత్త సంవత్సరం వస్తుందంటే మళ్లీ కొత్త ఆలోచనలు మొదలవుతాయి. కొత్తకొత్త తీర్మానాలు చేసుకుంటారు. ఇందులో భాగంగా చాలా మంది రాబోయే ఏడాదిలో తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తమ ఫిట్‌నెస్‌ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆహారం నుంచి వ్యాయామం వరకు అనేక రకాల రిజల్యూషన్లు తీసుకుంటున్నారు.

ఫిట్‌గా, హెల్తీగా ఉండేందుకు ఖరీదైన ఆహారం తినడం, హైఫై జిమ్‌కి వెళ్లడం మార్గం అని చాలా మంది భావిస్తారు. కానీ పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం ప్రకారం నడుచుకుంటే చాలా మార్గం చాలా సులభంగా ఉంటుంది. వందేళ్లు ఆయురారోగ్యాలతో జీవించటానికి వేళకు నిద్రలేవడం, వేళకు నిద్రపోవడం, వేళకు ఆరోగ్యకరమైనవి తినడం, రోజూ కొన్ని నిమిషాలు యోగా చేస్తే చాలు.

Herbs for Healthy Weight - బరువును నియంత్రించే మూలికలు

మీరు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి వంటగదిలో లభించే కొన్ని మూలికలు, సుగంధ దినుసులు ఆహారంలో కలుపుకోవాలి. అలాంటి కొన్ని విలువైన సుగంధ దినుసుల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మెంతులు

మెంతులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిని ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చికిత్స కోసం కూడా ఉపయోగిస్తారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల మెంతులను బరువును నియంత్రించే ఔషధంగా పరిగణించవచ్చు. కొన్ని మెంతులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయం లేవగానే వడకట్టి పరిగడుపున తాగాలి. మెంతులను ఉడికించి గోరువెచ్చగా కూడా తాగవచ్చు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీనిని కొన్ని వ్యాధులకు ఇంటి నివారణగా కూడా తీసుకుంటారు. పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా దీని పాత్ర పెద్దదే. అధిక కొవ్వు పదార్ధాలను తినడం వల్ల కలిగే కొన్ని చెడు ప్రభావాలను దాల్చినచెక్క తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా అది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో కలిపి తాగవచ్చు. వేడి నీటిలో మరిగించి కూడా టీ తయారు చేసుకోవచ్చు. నీటిలో నానబెట్టి తేనెతో కూడా తీసుకోవచ్చు.

ఫెన్నెల్

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ఫెన్నెల్ సీడ్స్ మంచి ఎంపిక. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. సోంఫు విత్తనాల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి తినడం వలన ఆహార కోరికలు తగ్గుతాయి, ఆ సమయంలో కేలరీల వినియోగానికి దారితీస్తుంది, ఫలితంగా బరువు తగ్గుతుంది. సోంఫ్ తినడం వలన శరీరంలో విటమిన్, ఖనిజాల శోషణను మెరుగుపరచవచ్చు, కొవ్వు నిల్వను తగ్గించవచ్చు.

అల్లం

అల్లం జీవక్రియను పెంచుతుంది, తద్వారా కొవ్వు నిల్వలను కాల్చటానికి సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది, ఎక్కువ కొవ్వును గ్రహించనివ్వదు. మీరు అల్లంను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. అల్లం టీ తాగవచ్చు లేదా తురిమిన అల్లంను తేనెతో కలిపి తినవచ్చు. లేదా అల్లం ముక్కలుగా కోసిన తర్వాత 10-15 నిమిషాల పాటు నీటిలో మరిగించి ఈ నీటిని తాగాలి.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలను పైపర్ నిగ్రమ్ మొక్క ఎండిన పండ్ల నుండి తీసుకోబడే ఒక మసాలా దినుసు. మిరియాలలో పైపెరిన్ అనే శక్తివంతమైన సమ్మేళనానం ఉంటుంది, ఇది దాని ఘాటైన రుచి, బరువు-తగ్గించే ప్రభావాలను రెండింటినీ అందిస్తుంది. పైపెరిన్‌ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం కనుగొంది.

WhatsApp channel

సంబంధిత కథనం