Protein rich snacks: జంక్ ఫుడ్ బదులు ఈ 9 ప్రోటీన్ స్నాక్స్ రీప్లేస్ చేయండి
Protein rich snacks: జంక్ ఫుడ్‌కు బదులుగా ప్రోటీన్ కలిగిన స్నాక్స్ ఎంచుకుంటే మీ ఆరోగ్యం పుంజుకుంటుంది. ప్రోటీన్ మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకంగా గుర్తించాలని డైటీషియన్ చెబుతున్నారు. నిపుణులు సూచిస్తున్న 9 ప్రోటీన్ స్నాక్స్ మీకోసం..
సమతుల ఆహారంలో అత్యంత అవశ్యమైన సూక్ష్మ పోషకం ప్రోటీన్. కండరాలు బలోపేతం కావాలన్నా, బరువు తగ్గాలన్నా, రోజంతా చురుగ్గా ఉండాలన్నా మీకు ప్రోటీన్ అవసరం. జంక్ ఫుడ్‌కు బదులుగా ప్రోటీన్ కలిగిన స్నాక్స్ తీసుకోవడం వల్ల మీ సమతుల ఆహార అవసరాలు తీరుతాయి. మీ బిజీ లైఫ్‌లో సమతుల ఆహారంపై దృష్టి పెట్టడం కుదరకపోవచ్చు. అందువల్ల వీలున్నంత మేరకు ప్రోటీన్ కలిగిన స్నాక్స్ తీసుకోవడం మరవొద్దు.
ప్రోటీన్ కలిగిన ఆహారం విషయంలో డైటీషియన్ ప్రీతీ గుప్తా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిన్న చిన్న మార్పులతో మీరు ఆరోగ్యకరమైన స్నాక్స్ అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. డైటీషియన్ ప్రీతి గుప్తా సూచించిన హెల్తీ స్నాక్స్ ఇవే..
1. కట్‌లెట్స్, టీక్కీల్లో సీడ్స్, నట్స్ యాడ్ చేయండి
స్నాక్స్‌గా టిక్కీ, కట్‌లెట్లు అందరూ ఇష్టపడుతారు. రుచికరంగా ఉండడమే కాకుండా, తయారు చేయడం కూడా సులభమే. వీటితో పాటు ప్రోటీన్ కూడా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందుకు మీరు విత్తనాలు, నట్స్ వీటికి జత చేస్తే సరిపోతుంది. కరకరలాడడమే కాకుండా ప్రోటీన్ అందుతుంది.
2. ఈ పప్పులు వాడండి
పెసర పప్పు, మసూర్ పప్పు వంటి వాటిలో ప్రోటీన్ లభిస్తుంది. ఇవి రుచికరంగా ఉండడమే కాకుండా, ఇతర ఆహార పదార్థాలలో సులువుగా జత చేయొచ్చు. దాల్ సలాడ్, చాట్‌లలో ఈ పప్పులు ఉంటే మీ ప్రోటీన్ అవసరాలు తీరుతాయి.
3. పనీర్, మష్రూమ్, సోయా టిక్కా
పనీర్, సోయా, మష్రూమ్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటితో పలు స్నాక్స్ చేసుకోవచ్చు. సోయా చాప్, పనీర్ టిక్కా, మష్రూమ్ టిక్కా మంచి ఎంపికలు. వీటితో ఇతర స్నాక్స్ కూడా చేసుకోవచ్చు.
4. గుడ్డు మీ ఆహారంలో భాగం కావాలి
మీరు గుడ్డు తినే వారైతే రోజువారీ ఆహారంలో గుడ్డు తప్పనిసరి చేసుకోండి. రకరకాల ఆమ్లెట్లు కూడా చేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా ఉడికించిన గుడ్డు తినేయొచ్చు. ఎగ్ టోస్ట్, ఎగ్ సలాడ్, ఎగ్ రోస్ట్ వంటివి కూడా ప్రోటీన్ రిచ్ స్నాక్స్‌గా చూడొచ్చు.
5. చికెన్ టిక్కా, గ్రిల్డ్ ఫిష్, తందూరి కబాబ్
మీరు మాంసాహారులైతే చికెన్, ఫిష్ తీసుకోండి. వీటిలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. చికెన్ టిక్కా, గ్రిల్డ్ ఫిష్, కబాబ్స్ వంటివి ప్రోటీన్ రిచ్ స్నాక్స్‌గా తినొచ్చు.
6. ప్రోటీన్ కోసం షేక్స్
మిల్క్ షేక్స్ ఇష్టపడేవారైతే రకరకాల మిల్క్ షేక్స్ అందుబాటులో ఉంటాయి. చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా వంటి ఫ్లేవర్లతో మిల్క్ షేక్స్ మీకు తగిన ప్రోటీన్ అందిస్తాయి. కానీ ఎక్కువ మిల్క్ షేక్స్ తాగితే బరువు పెరుగుతారని గుర్తుంచుకోండి.
7. చీలా ట్రై చేయండి
శనగ పిండితో తయారు చేసే స్నాక్ చీలా. ఆమ్లెట్ రూపంలో కనిపిస్తుంది. పెసర పిండి, ఓట్స్ యాడ్ చేస్తే మల్టీగ్రెయిన్ చీలా అవుతుంది. దీని వల్ల మీకు తగిన ప్రోటీన్ అందడమే కాకుండా, బరువు కూడా పెరగకుండా అదుపులో పెట్టుకోవచ్చు.
8. ప్రోటీన్ రిచ్ స్మూతీ
స్మూతీ అంటే నోరూరుతుంది. పీనట్ బటర్, నట్స్, సీడ్స్, ఫ్లేవర్ కోసం ఒక పండ్లు, ఆల్మండ్ మిల్క్ లేదా సోయా మిల్క్ యాడ్ చేస్తే ప్రోటీన్ స్నాక్స్ రెడీ. పాలకు బదులు పెరుగు కూడా వాడొచ్చు.
9. టోఫు కట్‌లెట్స్, క్వినోవా సలాడ్స్
ప్రోటీన్ అవసరాల గురించి ఆందోళన చెందుతున్నట్టయితే మీరు టోఫు, క్వినోవా ఎంచుకోవచ్చు. ఇవి మార్కెట్లో సులువుగా లభ్యమవుతాయి. వీటిల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ లభిస్తాయి. మీ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతాయి.
రోజువారీ ప్రోటీన్ అవసరాల కోసం ఈ 9 రకాల స్నాక్స్ చూశారు కదా. ఈ ఆహారాలను స్నాక్స్ రూపంలో తీసుకుంటే ప్రోటీన్ లభ్యమై మీరు ఆరోగ్యంగా ఉంటారు.
టాపిక్