Eye Sight । మీ కంటి చూపు మెరుగుపడాలంటే ఈ పండ్లు తినండి!-5 best fruits that help improve your eye sight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eye Sight । మీ కంటి చూపు మెరుగుపడాలంటే ఈ పండ్లు తినండి!

Eye Sight । మీ కంటి చూపు మెరుగుపడాలంటే ఈ పండ్లు తినండి!

HT Telugu Desk HT Telugu
Jan 02, 2023 10:50 AM IST

Eye Sight: నేడు ఎక్కువ మంది స్క్రీన్లకే అతుక్కుపోతూ కంటి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు, మీ కంటి చూపును మెరుగుపరిచే అద్భుతమైన పండ్లు ఇక్కడ తెలుసుకోండి.

fruits that improve your eye sight
fruits that improve your eye sight (Pixabay)

సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెబుతారు. అంటే మన శరీరంలోని ఇంద్రియాలన్నింటిలో కళ్లు చాలా ప్రధానమైనవి అని అర్థం. కంటి చూపు మెరుగ్గా ఉన్నప్పుడే ప్రపంచాన్ని చూడవచ్చు. కానీ ఈరోజుల్లో చాలా మందికి కంప్యూటర్ స్క్రీన్ లు చూడటమే ప్రపంచం అయిపోయింది. పెరిగిన 'స్క్రీన్ టీమ్' మీ కంటి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేదా సెల్ ఫోన్‌లను విపరీతంగా ఉపయోగించడం వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి. ఈ అలవాటు కళ్లపై భారాన్ని కలిగించి అస్పష్టమైన దృష్టికి దారితీస్తుంది. అంతేకాదు, కంటి సమస్యలు వచ్చినపుడు మీరు ఏ పనిపై దృష్టి కేంద్రీకరించలేరు, మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది తీవ్రమైన తలనొప్పి, మెడ, వీపు అలాగే భుజాల నొప్పిని కూడా కలిగిస్తుంది. మీరు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీ కళ్లను కాపాడుకోవడం చాలా అవసరం.

మంచి కంటి ఆరోగ్యానికి స్క్రీన్ టైమ్ తగ్గించడంతో పాటు, కాలుష్యరహితమైన స్వచ్ఛమైన వాతావరణం కలిగి ఉండటంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

Fruits For Good Eye Sight- కంటి చూపును మెరుగుపరిచే పండ్లు

మీ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని పండ్ల రకాలను ఇక్కడ తెలియజేస్తున్నాం, వీటిని ఎక్కువగా తినడం వలన మీ కళ్లకు మంచి పోషణ లభించి, అవి ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడవచ్చు.

అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం అనే పోషకం సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పొడి కళ్ళకు ఈ మూలకం అవసరం. మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజూవారీ ఆహారంలో అరటిపండును చేర్చుకోండి.

బొప్పాయి

లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్‌ బొప్పాయి పండు తినడం ద్వారా లభించే కీలక పోషకాలు. ఇవి సహజమైన సన్‌బ్లాక్‌గా పనిచేస్తాయి, ఇది రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది. బ్లూ లైట్ నుండి కంటిని రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. మామిడి పండ్లలో కూడా ఇలాంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి బొప్పాయి, మామిడి పండ్లు ఎక్కువ తీసుకోండి.

సిట్రస్ పండ్లు

నిమ్మ, నారింజ, బత్తాయి, ద్రాక్షపండ్లు మొదలైన పుల్లని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. ఈ పోషకం వయస్సు-సంబంధిత దృష్టి లోపాలను, మచ్చల క్షీణత , కంటిశుక్లాలకు కూడా సహాయపడుతుంది.

ఆప్రికాట్లు

ఆప్రికాట్లలో విటమిన్ ఎ, సి, ఇ సహా కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో బీటా కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రాత్రి దృష్టిని మెరుగుపరచడం, చీకట్లో దృశ్యాలను చూడగల కళ్ళ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి రెటీనాను దెబ్బతీసే నీలం, అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించడంలో ఆప్రికాట్లలోని పోషకాలు సహాయపడతాయి.

బెర్రీలు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్‌బెర్రీస్ , బ్లాక్‌బెర్రీస్ మొదలైన బెర్రీ పండ్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గొప్ప పండ్లు. బెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు లో బీపీ, కళ్లు పొడిబారడం, దృష్టి లోపాలు, మచ్చల క్షీణతను నివారించడంలో సహాయపడతాయి.